సాధారణంగా గర్భిణులకు చాలా సందేహాలుంటాయి. ఏది తినాలో.. ఏది తినకూడదో.. ఏది తాగాలో.. ఏది తాగకూడదో తెలియక సతమతవుతుంటారు. ఇక షుగర్ కూడా ఉంటే ఇంక తీసుకునే జాగ్రత్తల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలో ఆరోగ్యకర ఆహారపదార్థాలు కూడా కొంతమంది దూరం పెడతారు. అయితే టైప్-2 డయాబెటిస్ కలిగిన గర్భిణుల్లో కాఫీ తాగడం ద్వారా మంచి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
సింగపూర్ నేషనల్ యూనివర్సిటీకి చెందిన యోంగ్ లూ లిన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ తాజాగా గర్భిణులపై ఓ అధ్యయనం చేసింది. క్రమం తప్పకుండా కాఫీ తాగడం వల్ల గర్భధారణ సమయంలో మధుమేహం ఉన్న మహిళల్లో టైప్ 2 డయాబెటిస్ అదుపులో ఉంటుందని వారు తెలిపారు. కృత్రిమ తియ్యదనంతో కూడిన పానియాల కంటే కెఫిన్‌తో చేసిన కాఫీ తీసుకోవడం ఉత్తమమని పేర్కొంటున్నారు.
సాధారణంగా రోజుకు రెండు నుంచి ఐదు కప్పుల కాఫీ తాగే వారిలో సాధారణ టైప్ 2 డయాబెటిస్ రావడం లేదని.. ఒకవేళ ముందే ఉంటే అదుపులో ఉంటోందని పలు పరిశోధనలు ఇప్పటికే నిరూపించాయి. అయితే గర్భిణుల్లో ఈ తరహా పరిశోధనలు చేయడం చాలా అరుదు. అయితే పరిశోధకులు దాదాపు 4,500 మంది మహిళలపై ఈ పరిశోధనలు చేశారు. అస్సలు కాఫీ తాగని వారు.. రోజూ కెఫిన్ కలిగిన కాఫీ తాగే వారిని పరీక్షించారు. ఈ పరిశోధనలో కాఫీ తాగని వారితో పోల్చితే రోజూ కాఫీ తీసుకునే వారిలో టైప్-2 డయాబెటిస్ బాగా తగ్గినట్లు గుర్తించారు. ఒక కప్పు తాగే వారిలో 10 శాతం, రెండు, మూడు కప్పులు తాగే వారిలో 17 శాతం, నాలుగు లేదా అంతకంటే ఎక్కువ కెఫిన్‌తో కూడిన కాఫీ తాగడం ద్వారా టైప్ -2 డయాబెటిస్ వచ్చే అవకాశం 53 శాతం తగ్గిందని గుర్తించారు. అయితే ఇది చాలా విషయాలపై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కాఫీ తాగే వారి వ్యక్తి శరీరతత్వం, కాఫీ రకం, దానిలో కలిపే చక్కెర రకాలు వంటివి ప్రభావితం చేస్తాయని వివరించారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం..
(గమనిక: ఈ కథనంలో పేర్కొన్న సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇలాంటి పద్ధతులు/ఆహారం/చిట్కాలు పాటించే ముందు దయచేసి వైద్య సలహా తీసుకోవడం మంచిది.)