
చిల్లీ చికెన్ అంటే కేవలం కారం, సాస్‌ల మిశ్రమం మాత్రమే కాదు.. అదొక పర్ఫెక్ట్ వంట టెక్నిక్. ఎర్రటి రంగు, ఘాటైన వెల్లుల్లి వాసన, బయట కరకరలాడుతూ లోపల మెత్తగా ఉండే చికెన్ ముక్కలే దీని స్పెషాలిటీ. చాలామంది అన్ని పదార్థాలు వేసినా హోటల్ రుచి రావడం లేదని అంటుంటారు. నిజానికి తప్పు పదార్థాల్లో లేదు, మీరు వండే పద్ధతిలో ఉంది. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం..
1. మ్యారినేషన్
చికెన్ ముక్కలకు ఉప్పు, మిరియాలు రాసి వెంటనే నూనెలో వేయడం అతిపెద్ద పొరపాటు. చికెన్ లోపల వరకు రుచి వెళ్లాలంటే కనీసం అరగంట పాటు మ్యారినేట్ చేయాలి. అల్లం-వెల్లుల్లి పేస్ట్, సోయా సాస్, కొద్దిగా నిమ్మరసం కలిపి సమయం ఇస్తే, మాంసం ఉడికిన తర్వాత చాలా మృదువుగా, జ్యుసీగా మారుతుంది.
2. కరకరలాడే పొర కోసం!
బయట పొర గట్టిగా లేదా మరీ మెత్తగా అవ్వడానికి కారణం కార్న్‌ఫ్లోర్, మైదా పిండిని సరిగ్గా కలపకపోవడమే. కార్న్‌ఫ్లోర్ ఎక్కువైతే పూత రాయిలా మారుతుంది, తక్కువైతే వేయించేటప్పుడు విడిపోతుంది. మైదా పిండి చికెన్‌కు పట్టుత్వాన్ని ఇస్తుంది. ఈ రెండింటికీ తోడు ఒక గుడ్డును కలిపితే పూత చికెన్ ముక్కకు చక్కగా అంటుకుని, వేయించినప్పుడు అద్భుతమైన క్రంచీనెస్‌ను ఇస్తుంది.
3. వేయించడంలో మెళకువ!
నూనె మరీ ఎక్కువగా కాగితే చికెన్ బయట మాడిపోయి లోపల పచ్చిగా ఉంటుంది. తక్కువ వేడి ఉంటే ముక్కలు నూనెను పీల్చేస్తాయి. మీడియం ఫ్లేమ్ మీద చికెన్‌ను నెమ్మదిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి. ఒకేసారి కడాయి నిండా ముక్కలు వేయకుండా, తక్కువ సంఖ్యలో వేయిస్తే నూనె వేడి తగ్గకుండా ఉంటుంది.
4. సాస్ తయారీలో ఆలస్యం వద్దు!
చిల్లీ చికెన్ వండటం అనేది ఒక మెరుపు దాడి లాంటిది. చికెన్ వేయించిన తర్వాత ఉల్లిపాయలు కోయడం, సాస్‌లు వెతుక్కోవడం చేస్తే చికెన్ ముక్కల క్రంచీనెస్ పోతుంది. వంట మొదలుపెట్టే ముందే సాస్ మిశ్రమాన్ని సిద్ధం చేసుకోవాలి. చికెన్ వేయించిన వెంటనే సాస్‌లో కలిపేస్తే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది.
5. సాస్ పరిమాణం
ఎక్కువ సాస్ వేస్తే రుచి పెరుగుతుందని అనుకోవడం భ్రమ. సాస్ మోతాదు మించితే చికెన్ ముక్కలు మెత్తబడిపోయి, రుచుల సమతుల్యత దెబ్బతింటుంది. సాస్ అనేది ముక్కలకు పట్టేలా మందంగా ఉండాలి తప్ప, పులుసులా ఉండకూడదు. తీపి, పులుపు, కారం సమపాళ్లలో ఉన్నప్పుడే అది అసలైన చిల్లీ చికెన్ అవుతుంది.