
రోడ్డుపక్కన పానీపూరీ బండి కనపడగానే నోరు ఊరుతుంది.. కానీ, అందులో వాడే నీళ్ల నాణ్యత గానీ, అమ్మే వ్యక్తి పాటించే పరిశుభ్రత గానీ పట్టించుకోకుండా తినడానికి వెళ్తే ఒక్కోసారి పెనుముప్పు వాటిల్లుతుంది. నగరానికి చెందిన 22 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విషయంలో అచ్చం ఇలాగే జరిగింది. పానీపూరీ తిని, తీవ్రమైన హెపటైటిస్ ఎ ఇన్ఫెక్షన్ బారిన పడిన ఆ యువకుడు నెల రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందాల్సి వచ్చింది. దీంతో ఓ వైపు అనారోగ్యం.. మరోవైపు ఉద్యోగానికి దూరం కావడమే కాక, చికిత్స ఖర్చు భారం కూడా అతడి మీద పడింది. నగరంలోని ప్రధాన ఆస్పత్రులలో ఒకటైన ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి వైద్యులు సకాలంలో చికిత్స చేసి అతడి ప్రాణాలు కాపాడారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్. కలువల హర్ష తేజ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
“కళ్లు, చర్మం పసుపుపచ్చగా అయిపోవడం (కామెర్లు), కడుపులో ఏదో ఇబ్బంది, వికారం, వాంతులు, నీరసం, మూత్రం బాగా ముదురు రంగులో ఉండడం లాంటి సమస్యలతో ఆ యువకుడు ఆస్పత్రికి వచ్చాడు. ఏం జరిగిందని లోతుగా ప్రశ్నిస్తే, తాను రెండు వారాల క్రితం రోడ్డుపక్కన పానీపూరీ తిని, అక్కడ డబ్బాలో మంచినీళ్లు తాగానని చెప్పాడు. రక్తపరీక్షలు చేయగా హెపటైటిస్ ఎ తీవ్రంగా ఉందని, దాంతోపాటే కాలేయంలోని ఎంజైమ్‌లు పెరిగాయని, యాంటీ-హెచ్ఏవీ ఐజీఎం యాంటీబాడీలు పాజిటివ్ అని తేలింది..’’ అని హర్ష తేజ తెలిపారు.
చాలామంది యువతలో హెపటైటిట్ ఎ దానంతట అదే తగ్గిపోతుంది. కానీ, నిర్లక్ష్యం చేస్తే అది చాలా ఇబ్బంది, సమస్యలు తెస్తుంది. వీధుల్లో అపరిశుభ్రంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల ఎంత తీవ్రమైన కాలేయ ఇన్ఫెక్షన్లు వస్తాయో ఈ కేసు ఉదాహరణగా నిలిచింది.. ‘‘ఆ యువకుడికి ముందుగా హైడ్రేషన్ ఇచ్చి, కాలేయాన్ని కాపాడే మందులు, ఇతర చికిత్సలతో 2-3 వారాలు పూర్తిగా విశ్రాంతి ఇచ్చాం. ఎప్పటికప్పుడు పరీక్షలు చేశాం. కాలేయం క్రమంగా మెరుగుపడింది. నాలుగు వారాలకు అతడు పూర్తిగా కోలుకున్నాడు. ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కౌన్సెలింగ్ ఇచ్చి, భవిష్యత్తులో రక్షణ కోసం హెపటైటిస్ ఎ టీకా తీసుకోవాలని సూచించాం” అని డాక్టర్ తెలిపారు.
ఈ కేసు నుంచి అనేక గుణపాఠాలు నేర్చుకోవాలని ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. రోడ్డు పక్కన అమ్మే పానీపూరీ, చట్నీలు, పళ్ల ముక్కలు, సరిగా ఉడకని నూడుల్స్ లాంటి వాటి వల్ల హెపటైటిస్ ఎ, ఈ లు వచ్చే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా కలుషిత నీటివల్ల ఇవి వస్తాయి. నగరాలు, పట్టణాల్లో తగినంత పారిశుధ్యం లేనిచోట ఉండే ఆహార, పానీయాల ద్వారానే హెపటైటిస్ ఎ, ఈ వస్తాయి. చేతులు సరిగా శుభ్రం చేసుకోవడం, వీధుల్లో అపరిశుభ్ర ఆహారం తీసుకోకపోవడం, కాచి చల్లార్చిన, లేదా ఫిల్టర్ చేసిన నీళ్లే తాగడం ద్వారా ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు.
ఈ సమస్యల గురించి ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి సీఈఓ డాక్టర్ హరికుమార్ రెడ్డి మాట్లాడుతూ.. హెపటైటిస్ ఎ నిరోధ టీకా భారతదేశంలో అందుబాటులో ఉంది. ముఖ్యంగా వ్యాధుల ముప్పు ఉండే ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. మన దేశంలో నివారించగల ప్రధానమైన ప్రజారోగ్య సమస్యల్లో హెపటైటిస్ ఎ, ఈ ఉన్నాయన్నారు. పరిశుభ్రత పాటించడం, సురక్షితమైన ఆహారం, టీకాలు అందరికీ అందించడం ద్వారా ఇలాంటి ఇన్ఫెక్షన్ల భారం తగ్గుతుంది. అపరిశుభ్రమైన ఆహారం వల్ల ఆర్థికపరిస్థితులు దెబ్బతింటాయి. బాధితులు కొన్ని వారాల పాటు ఉద్యోగాలు, ఉపాధి పనులు చేసుకోలేకపోవడం, దానికితోడు చికిత్స ఖర్చులు వారిని ఇబ్బందిపెడతాయి” అని తెలిపారు.
మనం ఏం తింటున్నాం, ఏం తాగుతున్నాం అనే రోజువారీ పనుల్లో జాగ్రత్తలు పాటిస్తే మన కాలేయం భద్రంగా ఉంటుందని, పాటించకపోతే ముప్పులో పడుతుందని వైద్యులు చెబుతున్నారు. తగిన అవగాహన, నిరోధక టీకాలు అందించడం ద్వారా ఇలాంటి నిరోధించగల వ్యాధుల నుంచి సమాజాన్ని రక్షించవచ్చని డాక్టర్ వివరించారు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..