
ఎండాకాలంలో పొట్టకు హాయిగా, రుచికరంగా ఉండే ఆరోగ్యకరమైన అల్పాహారం.. పెసరపప్పు ఊతప్పం .. ఇది శరీరంలోని వేడిని దూరం చేసి ఆరోగ్యకరంగా ఉంచుతుంది.. అంతేకాకుండా.. ఎన్నో పోషకాలు సైతం శరీరానికి అందుతాయి.. పెసరపప్పు ఊతప్పం ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా లేదా సాయంత్రం స్నాక్‌గానూ చేసుకోదగిన తక్షణ వంటకం. ఎలాంటి చట్నీ లేకుండా కూడా ఈ ఊతప్పాలను ఆస్వాదించవచ్చు.. లేదా మీకు నచ్చిన చట్నీతో కలిపి తినవచ్చు. ఇంకా మీకు ఇష్టమైన కొబ్బరి పల్లీ చట్నీ, టమాటా సాస్ లేదా గ్రీన్ చట్నీతో కలిపి తింటే మరింత రుచికరంగా ఉంటుంది.
పెసరపప్పు నానబెట్టడం: ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు (సుమారు పావు కిలో) పెసరపప్పును తీసుకుని, శుభ్రంగా కడిగి, మళ్లీ నీళ్లు పోసి నానబెట్టాలి. బ్రేక్‌ఫాస్ట్ కోసం అయితే రాత్రి నానబెట్టి ఉదయం చేసుకోవచ్చు. కనీసం రెండు గంటలు నానబెడితే సరిపోతుంది.
పిండి తయారీ: బాగా నానిన పెసరపప్పును మిక్సీ జార్‌లోకి తీసుకుని, అవసరమైతే ఒక టేబుల్‌స్పూన్ నీళ్లు కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బిన పిండిని ఒక పెద్ద బౌల్‌లోకి మార్చుకోవాలి. ఊతప్పాలకు కొద్దిగా క్రిస్పీనెస్ రావాలంటే, రెండు టేబుల్‌స్పూన్ల బియ్యప్పిండిని కలపవచ్చు. ఇది ఐచ్ఛికం.
పిండిని బీట్ చేయడం: పిండిని ఒకే దిశలో సుమారు నాలుగు నుండి ఐదు నిమిషాల పాటు బాగా బీట్ చేయాలి. చేతితో బీట్ చేస్తే పిండి మరింత ఫ్లఫీగా అవుతుంది. పిండి కన్సిస్టెన్సీ సరిపోయిందో లేదో తెలుసుకోవడానికి, కొద్దిగా పిండిని నీళ్లల్లో వేస్తే అది పైకి తేలాలి. లేకపోతే, మరో రెండు మూడు నిమిషాలు బీట్ చేయాలి.
మసాలాలు కలపడం: పిండి సిద్ధమయ్యాక, అర టీస్పూన్ జీలకర్ర, కచ్చాపచ్చాగా దంచిన అర టీస్పూన్ అల్లం ముద్ద, రెండు మూడు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా తరిగిన కరివేపాకు, ఒక సన్నగా తరిగిన ఉల్లిపాయ, రెండు టేబుల్‌స్పూన్ల తరిగిన కొత్తిమీర ఆకు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి.
వంటసోడా – నిమ్మరసం: చివరిగా, పావు టీస్పూన్ వంటసోడాను వేసి, దానిపై ఒకటి రెండు టీస్పూన్ల నిమ్మరసం పిండి బాగా కలపాలి. వంటసోడా లేకున్నా ఈ ఉతప్పాలు బాగుంటాయి.. కానీ సోడా వేయడం వల్ల లోపల ఫ్లఫీగా, బయట క్రిస్పీగా తయారవుతాయి.
1. మరోవైపు స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టి, ఒకటి రెండు టీస్పూన్ల నూనె లేదా బట్టర్ వేయాలి. బట్టర్ వాడటం వల్ల ఉతప్పాలకు మరింత రుచి వస్తుంది. నెయ్యిని కూడా ఉపయోగించవచ్చు.
2. మిశ్రమాన్ని గరిటెతో కొద్దికొద్దిగా తీసుకుని, పాన్‌పై ఊతప్పంలా చిన్న సైజులో వేయాలి. మీకు కావాలంటే పెద్ద సైజులో కూడా చేసుకోవచ్చు.
3. ఉతప్పం పైన కొద్దిగా కొత్తిమీర, నువ్వులతో గార్నిష్ చేసి, మీడియం ఫ్లేమ్‌లో మూతపెట్టి ఒకటి రెండు నిమిషాలు ఫ్రై చేయాలి.
4. మధ్యమధ్యలో కొద్దిగా నూనె లేదా నెయ్యి వేస్తూ, రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ అయ్యేవరకు కాల్చాలి. మీడియం ఫ్లేమ్‌లో కాల్చడం వల్ల లోపల వరకు చక్కగా ఉడుకుతుంది.
విభిన్న రకాలు:
ఈ పిండితో కేవలం ఉతప్పాలు మాత్రమే కాదు, గుంత పొంగణాలు లేదా ఆవిరిపై ఇడ్లీలా కూడా తయారు చేసుకోవచ్చు.
ఈ పెసరపప్పు ఉతప్పం శరీరానికి చలవ చేసే వంటకం, ముఖ్యంగా ఎండాకాలంలో ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది సులువుగా జీర్ణమవుతుంది. ఇంకెందుకు ఆలస్యం ఈ రుచికరమైన, ఆరోగ్యకరమైన అల్పాహారాన్ని ప్రయత్నించండి..
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..