Walnuts: మనిషి ఎంత కాలం జీవించాలనేది వారు తీసుకునే ఆహారం మీదే ఆధారపడి ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మంచి ఆహారం తీసుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయామాం చేసిన వారు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు. ఇలాంటి వారి ఆయుష్షు కూడా పెరుగుతుంది. ఇది మనందరికీ తెలిసిందే. అయితే ఓ ఆహార పదర్థాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే కచ్చితంగా మీరు బతికే కాలం పెరుగుతుందట. ఇదేదో సరదగా చెబుతోన్న విషయం కాదు.. శాస్త్రవేత్తలు అధ్యయనం చేసి మరీ దీన్ని చెబుతున్నారు. వాల్‌నట్‌ను క్రమం తప్పకుండా తీసుకుంటే కచ్చితంగా మీ జీవిత కాలం పెరుగుతుందని హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల బృందం చెబుతోంది.
వాల్‌నట్స్ ఆకస్మిక మరణాలు తగ్గిస్తుందని, జీవిత కాలాన్ని పెంచుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ విషయమై హార్వర్డ్ వర్సిటీకి చెందిన శాస్ర్తవేత్త యాన్ పింగ్ లి మాట్లాడుతూ.. వాల్‌నట్స్‌ను మత ఆహారంలో భాగం చేసుకునే వారి ఆయుర్దాయం పెరుగుతుంది. శరీరానికి అవసరమయ్యే ఎన్నో రకాల పోషకాలు వాల్‌నట్స్ ద్వారా అందుతాయి. వారంలో ఐదు లేదా అంతకంటే ఎక్కువ వాల్‌నట్‌లను తీసుకోవడం ద్వారా ఆకస్మిక మరణం వచ్చే ప్రమాదం 14 శాతం తగ్గుతుందని అధ్యాయనంలో తేలింది. వాల్‌నట్స్ ద్వారా గుండె సంబంధిత వ్యాధుల కారణంగా మరణించే ప్రమాదం 25 శాతం తగ్గి కనీస ఆయుర్దాయం 1.3 ఏళ్లు పెరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
అయితే శాస్త్రవేత్తలు ఈ విషయాలను గాలి లెక్కలు వేసే చెప్పట్లేదు.. ఇందుకోసం వారు 67,014 మంది మహిళలు, 26,326 మంది పురుషులను పరిగణలోకి తీసుకున్నారు. 1986 నుంచి వారి ఆరోగ్యానికి సంబంధించిన డేటాపై విశ్లేషణ చేసిన తర్వాత పరిశోధకులు ఈ నిర్ధారణకు వచ్చారు. ఆహారంలో వాల్‌నట్స్ ఎక్కువగా తీసుకునే వారికి ఆకస్మిక మరణం, గుండె జబ్బులతో మరణించిన సందర్భాలు తక్కువగా ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు.