
రసం, సూప్, పప్పు, చట్నీ, కర్రీ.. ఇలా రూపం ఏదైనా మన భోజనంలో తప్పకుండా కనిపించే ఏకైక ఐటమ్ టమాటా. కూరలకు అద్భుతమైన రుచిని, రంగును జోడించే టమోటాలో కేవలం టేస్ట్ మాత్రమే కాదు.. ఊహించని రేంజ్‌లో పోషకాలు దాగున్నాయి. అసలు టమోటాను మన డైలీ డైట్‌లో చేర్చుకోవడం వల్ల బాడీలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. కానీ చాలా మందికి అవి తెలియదు. టమోటాలలో విటమిన్ ఎ, బి, సి లతో పాటు గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు శరీరానికి మేలు చేసే సిట్రిక్ ఆమ్లం, మాలిక్ ఆమ్లం, అత్యంత పవర్‌ఫుల్ యాంటీఆక్సిడెంట్ అయిన లైకోపీన్ ఇందులో దండిగా దొరుకుతాయి.
మొండి కొవ్వును కరిగిస్తుంది
బరువు తగ్గాలని ప్లాన్ చేసే వారికి టమాటా ఒక వరం. టమాటాలు శరీరంలో కొవ్వును సహజంగా కరిగించడానికి సహాయపడే అమైనో ఆమ్లాలను ఉత్పత్తి చేస్తాయి. పైగా ఇందులో వాటర్ కంటెంట్, ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువసేపు కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది. దీనివల్ల అనవసరమైన క్రేవింగ్స్ తగ్గి బరువు ఈజీగా తగ్గుతారు.
టమాటాల్లో ఉండే ఫైబర్, పొటాషియం, విటమిన్ సి, కోలిన్ గుండెను పటిష్టంగా ఉంచుతాయి. ఇందులోని విటమిన్ బి కాంప్లెక్స్ బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడమే కాకుండా రక్తపోటును అదుపులో ఉంచుతుంది. తద్వారా హార్ట్ ఎటాక్ ముప్పు చాలా వరకు తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు.
టమాటాకు ఆ ఎరుపు రంగును ఇచ్చే లైకోపీన్ అనే యాంటీఆక్సిడెంట్‌కు క్యాన్సర్ కణాలతో పోరాడే శక్తి ఉంది. ముఖ్యంగా పురుషులలో వచ్చే ప్రొస్టేట్ క్యాన్సర్ ముప్పును ఇది భారీగా తగ్గిస్తుంది. అలాగే ఇందులోని విటమిన్ కె మరియు కాల్షియం వయసు పైబడిన వారిలో వచ్చే ఆస్టియోపోరోసిస్ వంటి ఎముకల వ్యాధులను రాకుండా చూస్తాయి.
టమాటాలోని లైకోపీన్ మీ చర్మాన్ని సూర్యుని హానికరమైన యూవీ కిరణాల నుండి కాపాడుతుంది. మొటిమలు, మచ్చలను నివారించి స్కిన్‌ను గ్లోయింగ్‌గా మారుస్తుంది. ఇందులో ఉండే విటమిన్ ఎ, సి తో పాటు ల్యూటిన్, ఫైటోకెమికల్స్ వయసు రీత్యా వచ్చే కంటి చూపు సమస్యలను నివారిస్తాయి.
టమాటాలలో ఉండే యాంటీఆక్సిడెంట్లు జీర్ణవ్యవస్థను క్లీన్ చేసి గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలను దూరం చేస్తాయి. లోపలి నుండి రోగనిరోధక శక్తిని పెంచి సీజనల్ వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి.
టమాటాలను పచ్చిగా తినడం కంటే.. లైట్‌గా ఉడికించి లేదా కొద్దిగా ఆలివ్ ఆయిల్, నెయ్యి వేసి వండుకుని తింటే అందులోని లైకోపీన్ అనే పోషకాన్ని మన శరీరం చాలా వేగంగా అబ్జార్బ్ చేసుకుంటుంది. అయితే కిడ్నీలో రాళ్లు ఉన్నవారు మాత్రం టమోటా గింజలను కాస్త అవాయిడ్ చేయడం మంచిది.
(గమనిక: ఈ కథనంలో పేర్కొన్న సమాచారం కేవలం అవగాహన, ఆరోగ్య సమాచారం కోసం మాత్రమే. దీనిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నా లేదా కొత్త డైట్ ప్రారంభించాలన్నా ఖచ్చితంగా నిపుణులైన డాక్టర్ లేదా న్యూట్రిషనిస్ట్‌ను సంప్రదించి సలహా తీసుకోవాలి.)