
చలికాలం వచ్చిందంటే మార్కెట్లో ఎటు చూసినా తాజా క్యారెట్లు దర్శనమిస్తాయి. కేవలం రుచికరమైనవే కాకుండా క్యారెట్లు ఈ సీజన్‌లో మన శరీరానికి అవసరమైన విటమిన్లు, యాంటీఆక్సిడెంట్ల గని అని చెప్పవచ్చు. అయితే క్యారెట్లను పచ్చిగా తినడం కంటే వండి తింటేనే ఎక్కువ లాభమని పరిశోధనలు చెబుతున్నాయి. క్యారెట్లలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. అయితే ఇది కొవ్వులో కరిగే విటమిన్. మనం క్యారెట్లను కొంచెం నూనె లేదా నెయ్యితో కలిపి వండినప్పుడు, దానిలోని బీటా-కెరోటిన్ సులభంగా విడుదలవుతుంది. ఫలితంగా పచ్చి క్యారెట్ల కంటే వండిన క్యారెట్ల నుండి మన శరీరం 7 రెట్లు ఎక్కువ విటమిన్ ఏ ని గ్రహిస్తుందని పరిశోధనల్లో తేలింది.
చలికాలంలో జలుబు, దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్లు సర్వసాధారణం. క్యారెట్‌లోని విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచి, బాక్టీరియాపై పోరాడేలా శరీరాన్ని బలోపేతం చేస్తాయి.
క్యారెట్లలో ఉండే బీటా కెరోటిన్ కంటి చూపును మెరుగుపరుస్తుంది. చలికాలంలో కళ్లు పొడిబారడం వంటి సమస్యలను ఇది సమర్థవంతంగా నివారిస్తుంది.
ఈ సీజన్‌లో జీర్ణక్రియ నెమ్మదించి మలబద్ధకం వచ్చే అవకాశం ఉంది. క్యారెట్‌లో ఉండే ఫైబర్ కడుపును శుభ్రపరచడంలో, జీర్ణక్రియను క్రమబద్ధీకరించడంలో సహాయపడుతుంది.
చలి గాలికి చర్మం పొడిబారి నిర్జీవంగా మారుతుంది. క్యారెట్‌లోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని లోపలి నుండి పోషించి, సహజమైన కాంతిని ఇస్తాయి.
క్యారెట్లలో క్యాలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువ. ఇది తిన్న తర్వాత కడుపు నిండుగా అనిపించి, త్వరగా ఆకలి వేయకుండా చేస్తుంది. తద్వారా శీతాకాలంలో పెరిగే బరువును నియంత్రించవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..