Tamarind Recipes: చింతపండుతో ఈ 4 రకాల వెరైటీలు తెలిస్తే.. ఇక వంట గదిలో మీరే క్వీన్

చింతపండు పులిహోర అంటే కేవలం గుడి ప్రసాదమే కాదు.. అదొక ఎమోషన్. అయితే సాధారణ బియ్యంతో చేసే పులిహోరతో పాటు, ఆరోగ్యకరమైన చిరుధాన్యాలతో (Millets) చేసే వరాగు చింతపండు పులిహోర గురించి మీకు తెలుసా? అలాగే ఘాటైన మిరియాల రుచితో చేసే పులిహోర చేస్తే ఆ మజానే వేరు. ఒక నాలుగు రకాల నోరూరించే చింతపండు వంటకాల తయారీ విధానం ఇప్పుడు చూద్దాం.

Tamarind Recipes: చింతపండుతో ఈ 4 రకాల వెరైటీలు తెలిస్తే.. ఇక వంట గదిలో మీరే క్వీన్
Tamarind Recipes

Updated on: Jan 17, 2026 | 7:01 PM

పులిహోరలో ఎన్నో రకాలు.. ప్రతిదీ దేనికదే డిఫరెంట్ టేస్ట్. ఆంధ్ర స్టైల్ పులిహోర ఘుమఘుమల నుండి, క్షణాల్లో తయారయ్యే ఇన్స్టంట్ చింతపండు పేస్ట్ వరకు.. మన వంటింట్లో సులభంగా చేసుకోగలిగే నాలుగు వెరైటీ రెసిపీలను ఇక్కడ తెలుసుకుందాం. పండగైనా, ప్రయాణమైనా ఈ చింతపండు పులిహోర ఉంటే చాలు, భోజనం అదిరిపోవాల్సిందే!

1. వరాగు (సామలు) చింతపండు రైస్

ఆరోగ్యం కోరుకునే వారికి ఇది ఉత్తమ ఎంపిక. సామలను పసుపు వేసి కుక్కర్‌లో ఉడికించి పక్కన పెట్టుకోవాలి. బాణలిలో ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, మెంతులు, ఎండుమిర్చి వేసి వేయించి, చింతపండు పులుసు, ఉప్పు, పసుపు, ధనియాల పొడి వేసి బాగా మరిగించాలి. చివరగా ఉడికించిన సామలను వేసి కలిపితే రుచికరమైన ‘వరాగు పులిహోర’ సిద్ధం.

2. ఆంధ్రా స్టైల్ పులిహోర

ఇది అందరికీ ఇష్టమైన సాంప్రదాయ పద్ధతి. వేడి అన్నం మధ్యలో గుంతలా చేసి చింతపండు పులుసు, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, నువ్వుల నూనె వేసి మూత పెట్టాలి. ఆ తర్వాత ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి పోపు వేసి బాగా మరిగించి, అన్నంలో కలిపితే ఆంధ్రా స్టైల్ పులిహోర ఘుమఘుమలాడుతుంది.

3. చింతపండు అన్నం

ముందుగానే చింతపండు పేస్ట్ తయారు చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహోర చేసుకోవచ్చు. ధనియాలు, నువ్వులు, మెంతులు, కరివేపాకు, ఎండుమిర్చి వేయించి పొడి చేసుకోవాలి. చింతపండు పులుసులో ఈ పొడి, ఉప్పు, కొద్దిగా బెల్లం వేసి దగ్గర పడే వరకు ఉడికించి నిల్వ చేసుకోవాలి. అవసరమైనప్పుడు అన్నంలో కలుపుకోవచ్చు.

4. మిరియాల చింతపండు అన్నం

ఇది కొంచెం ఘాటుగా, భిన్నంగా ఉంటుంది. మిరియాలు, మెంతులు, నల్ల నువ్వులు, పప్పులను వేయించి పొడి చేసుకోవాలి. చింతపండు పులుసును బెల్లం, ఉప్పుతో ఉడికించి, ఈ మిరియాల పొడిని కలిపి అన్నంలో వేయాలి. వర్షాకాలంలో ఈ అన్నం ఎంతో రుచిగా ఉంటుంది.