
గుడ్డు.. ప్రతి వంటగదిలో అత్యంత ముఖ్యమైన, పోషక విలువలున్న ఆహారం. అయితే వీటిని ఫ్రిజ్‌లో నిల్వ చేయాలా లేక వంటగది షెల్ఫ్‌లో ఉంచాలా అనే చర్చ తరచుగా జరుగుతూనే ఉంటుంది. ఈ అంశంపై సోషల్ మీడియాలో కూడా ప్రజలు రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. నిజానికి దీనికి సరైన సమాధానం వాతావరణం, పరిశుభ్రత పద్ధతులు, కొంచెం సైన్స్‌పై ఆధారపడి ఉంటుంది. గుడ్లను ఎక్కడ నిల్వ చేయాలో, ఎప్పుడు రిఫ్రిజిరేటర్ అవసరమో తెలుసుకుందాం.
అమెరికా వంటి పాశ్చాత్య దేశాలలో గుడ్లను విక్రయించే ముందు కడిగి శుభ్రపరుస్తారు. ఈ కడిగే ప్రక్రియలో గుడ్డు ఉపరితలంపై సహజంగా ఉండే బ్లూమ్ అనే రక్షణ పొర తొలగిపోతుంది. ఈ పొర గుడ్డును బ్యాక్టీరియా నుండి రక్షిస్తుంది. ఈ పొర తొలగితే సాల్మొనెల్లా వంటి హానికరమైన బ్యాక్టీరియా గుడ్డులోకి ప్రవేశించే ప్రమాదం పెరుగుతుంది. అందుకే బ్యాక్టీరియా పెరగకుండా నిరోధించడానికి ఈ దేశాలలో గుడ్లను తప్పనిసరిగా 4°C లేదా అంతకంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద రిఫ్రిజిరేటర్‌లో ఉంచుతారు.
యూరప్, ఆసియాలోని అనేక దేశాల మాదిరిగానే.. మన దేశంలో గుడ్లను సాధారణంగా క్లీన్ చేయకుండా అమ్ముతారు. దీనివల్ల వాటి సహజ రక్షణ పొర చెక్కుచెదరకుండా ఉంటుంది. అయినప్పటికీ దేశ వాతావరణం దీనిపై పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. వాతావరణం వేడిగా, తేమగా ఉన్నప్పుడు, గుడ్లు త్వరగా చెడిపోయే ప్రమాదం ఉంది. బ్యాక్టీరియా వేగంగా పెరుగుతుంది. కాబట్టి ఈ సీజన్లలో గుడ్లను రిఫ్రిజిరేటర్‌లో ఉంచడం ఉత్తమం. వాతావరణం చల్లగా ఉంటే క్లీన్ చేయని గుడ్లు బయట సుమారు 4 నుండి 5 రోజుల వరకు తాజాగా ఉండగలవు. మీరు సూపర్ మార్కెట్‌లోని ఫ్రిజ్ నుండి గుడ్లను కొనుగోలు చేస్తే వాటిని ఇంట్లో కూడా రిఫ్రిజిరేటర్‌లో ఉంచడం సురక్షితం.
గుడ్లను వాటి కార్టన్ లేదా ట్రేలోనే ఉంచండి. రిఫ్రిజిరేటర్ తలుపులో నిల్వ చేయవద్దు. ఎందుకంటే తలుపు తరచుగా తెరవడం, మూయడం వల్ల అక్కడ ఉష్ణోగ్రత మారుతూ ఉంటుంది. ఫ్రిజ్‌లోపల మధ్యలో లేదా వెనుక భాగంలో ఉంచాలి.
మీరు ఫ్రిజ్ నుండి గుడ్డును తీసి, తిరిగి ఫ్రిజ్‌లో పెట్టడం మంచిది కాదు. ఎందుకంటే చల్లని గుడ్డును బయట పెట్టినప్పుడు దాని ఉపరితలంపై తేమ పేరుకుపోతుంది. ఈ తేమ బ్యాక్టీరియా పెరగడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. అందువల్ల ఒకసారి ఫ్రిజ్‌లో ఉంచిన తర్వాత వాటిని వాడుకునే ముందు మాత్రమే బయటకు తీయాలి. కాగా గుడ్లను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల వాటి రుచి మారదు, పోషక విలువలు తగ్గవు. దీనికి విరుద్ధంగా వాటి నిల్వ జీవితం, తాజాదనం పెరుగుతాయి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..