
మటన్ కర్రీ అనగానే చాలామందికి అది తయారుచేయడం కష్టమైన పనిగా అనిపిస్తుంది. ఎందుకంటే.. ముదురు మటన్ అయితే.. తొందరగా ఉడకదు.. ఇంకా చాలా సమయం పడుతుంది.. అందుకే.. చాలా మంది వేరే ప్రత్యామ్నాయాలను వెతుక్కుంటారు. అయితే, ఈ ప్రత్యేక రెసిపీతో మటన్ కర్రీని ఇంట్లోనే చాలా సులభంగా, తక్కువ సమయంలో, ముక్క మెత్తగా, గ్రేవీ రుచిగా తయారు చేసుకోవచ్చు. ఈ వంటకాన్ని ప్రెజర్ కుక్కర్‌లో చేసుకోవడం వల్ల సమయం ఆదా అవుతుంది. అంతేకాదు మటన్ ముక్కలు త్వరగా మెత్తగా ఉడుకుతాయి. రైస్, బగారా రైస్, బిర్యానీ, పులావ్ వంటి వాటిలోకి ఇది అద్భుతమైన కాంబినేషన్. అంతేకాకుండా, చపాతీ, పుల్కా, నాన్స్ వంటి రోటీలతో కూడా చాలా రుచిగా ఉంటుంది.
మటన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు: రుచికి సరిపడా, కారం, నూనె, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటో ఒకటి చాలు, ఎండుకొబ్బరి పొడి, పెరుగు, కొత్తిమీర కొద్దిగా (గార్నిష్ కోసం), పుదీనా: కొద్దిగా (తరిగినది), ధనియాలు లేదా ధనియాల పొడి, గసాలు – నానబెట్టినవి , జీడిపప్పు నానబెట్టినవి, గరం మసాలా..
మటన్ మ్యారినేషన్: మటన్‌ను శుభ్రంగా కడిగి, ఒకటిన్నర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు, ఒకటిన్నర స్పూన్ కారం వేసి బాగా కలపాలి. దీనికి మూత పెట్టి అరగంట పాటు పక్కన ఉంచాలి. ఇలా చేయడం వల్ల మసాలాలు మటన్‌కు బాగా పట్టి, రుచి పెరుగుతుంది.
మసాలా పేస్ట్ తయారీ: స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి, రెండు టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా రంగు మారడం మొదలుపెట్టినప్పుడు ధనియాలు వేసి కలిపి వేయించుకోవాలి (మీరు ధనియాల పొడి వాడుతుంటే ఈ దశను దాటవేయవచ్చు). వేయించిన ఉల్లిపాయలు, ధనియాలను చల్లార్చుకోవాలి.
మిక్సీ జార్‌లో చల్లారిన ఉల్లిపాయలు, ధనియాలతో పాటు నానబెట్టిన జీడిపప్పు, గసాలు, మూడు స్పూన్ల పెరుగు, ఎండుకొబ్బరి పొడి వేసి మెత్తని పేస్ట్‌గా గ్రైండ్ చేసుకోవాలి.
మటన్ వండటం: ఇప్పుడు ప్రెజర్ కుక్కర్ స్టవ్ మీద పెట్టి, నూనె వేయాలి. నూనె వేడెక్కాక పచ్చిమిరపకాయ చీలికలు, తరిగిన పుదీనా ఆకులు వేయాలి. ఆ తర్వాత మ్యారినేట్ చేసుకున్న మటన్‌ను కుక్కర్‌లో వేసి బాగా కలపాలి.
కుక్కర్‌కు మామూలు మూత పెట్టి, తక్కువ మంటపై ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. మటన్ నుండి నీరు బయటకు వచ్చి, నూనె పైకి తేలడం గమనించవచ్చు.
ఇప్పుడు టమాటో ముక్కలు వేసి కలపాలి. ఆ తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్‌ను వేసి బాగా కలపాలి. మిక్సీ జార్‌లో కొద్దిగా నీరు పోసి ఆ నీటిని కూడా గ్రేవీలో కలపాలి.
రుచికి సరిపడా ఉప్పు, అర స్పూన్ గరం మసాలా వేసి బాగా కలిపి, కుక్కర్ మూత పెట్టి మీడియం మంటపై నాలుగు నుండి ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
విజిల్స్ అన్ని అయిపోయిన తర్వాత, కుక్కర్ ఆవిరి పూర్తిగా తగ్గిన తర్వాత మూత తీయాలి. అద్భుతమైన మటన్ కర్రీ సిద్ధంగా ఉంటుంది. మీకు గ్రేవీ ఇంకా చిక్కగా కావాలంటే, మూత లేకుండా తక్కువ మంటపై ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవచ్చు. చివరగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.
ఈ మటన్ కర్రీ రైస్, బగారా రైస్, పులావ్, బిర్యానీ, చపాతీ, పుల్క, బట్టర్ నాన్ వంటి అనేక వంటకాలతో అద్భుతమైన కాంబినేషన్. ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ప్రయత్నించండి..
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..