
ఇంట్లో మధ్యాహ్నం లేదా రాత్రి భోజనం చేసిన తర్వాత కొద్దిగా అన్నం మిగలడం చాలా సహజం. చాలామంది ఆ చల్లారిన అన్నాన్ని మళ్లీ తినడానికి ఇష్టపడరు. దీంతో చివరికి అది వృథాగా చెత్తబుట్టలో పడుతుంది. అయితే ఇకపై మిగిలిన అన్నాన్ని పారేయాల్సిన అవసరం లేదు. కొన్ని సాధారణ పదార్థాలతో ఎంతో రుచికరమైన ఫ్రైడ్ రైస్ తయారుచేసుకోవచ్చు. ఫ్రిజ్‌లో పెట్టిన మిగిలి పోయిన అన్నాన్ని ముందుగా బయటకు తీసి కొద్దిసేపు గది ఉష్ణోగ్రతలో ఉంచాలి. ఇలా చేస్తే అన్నం గట్టిగా ఉండకుండా సులభంగా కలుస్తుంది. ఈలోగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో, క్యారెట్, బీన్స్ వంటి కూరగాయలను చిన్న ముక్కలుగా తరిగి సిద్ధం చేసుకోవాలి.
గ్యాస్ మీద బాణలి పెట్టి కొద్దిగా నూనె వేడి చేయాలి. అందులో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి వేయించాలి. అవి చిటపటలాడుతూ మంచి వాసన వచ్చే వరకు వేయిస్తే రుచి మరింత పెరుగుతుంది. ఆ తర్వాత తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బంగారు రంగులోకి మారే వరకు వేయించాలి. తరువాత టమాటోలు, కూరగాయలు వేసి ఉప్పు, పసుపు, కారం పొడి కలిపి బాగా ఉడికించాలి. ఈ ఫ్రైడ్ రైస్‌ను మరింత రుచికరంగా చేయాలంటే ఒక గుడ్డును బాణలిలో పగలగొట్టి వేయించాలి. గుడ్డు మెత్తగా ఉడికిన తర్వాత కూరగాయలతో కలిపేయాలి. శాకాహారులు అయితే పనీర్ ముక్కలు లేదా వేయించిన నట్స్ వేసుకోవచ్చు. మసాలాలు బాగా ఉడికిన తర్వాత మిగిలిపోయిన అన్నాన్ని బాణలిలో వేయాలి. అన్నం విరగకుండా జాగ్రత్తగా కలుపుతూ మసాలా అన్నంలో బాగా పట్టేలా చేయాలి. మధ్యస్థ మంటపై ఐదు నిమిషాల పాటు వేయిస్తే అన్నం మంచి రంగు, రుచి తెచ్చుకుంటుంది.
వంట పూర్తయ్యే సమయంలో కొత్తిమీర చల్లి, ఇష్టమైతే కొద్దిగా నిమ్మరసం పిండాలి. దీంతో ఫ్రైడ్ రైస్‌కు ప్రత్యేకమైన రుచి వస్తుంది. వేడివేడిగా ఈ ఫ్రైడ్ రైస్‌ను సర్వ్ చేస్తే ఇంట్లో చిన్నా పెద్దా అందరూ ఇష్టంగా తింటారు. ఇకపై మిగిలిపోయిన అన్నం వృథా కాకుండా మీ వంటగదిలో కొత్త రుచిని సృష్టించుకోవచ్చు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.