AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kadai Chicken Fry Recipe: ధాబా స్టైల్ ‘కడాయ్ చికెన్ ఫ్రై’.. వేడి వేడి రోటీల్లోకి అదిరిపోయే టేస్ట్.. ప్లేట్లు నాకేయడం ఖాయం!

సండే వచ్చినా లేదా ఇంట్లో ఏదైనా స్పెషల్ డిన్నర్ ప్లాన్ చేసినా.. చాలా మంది చికెన్ వండడానికే ఇష్టపడతారు. అయితే ఎప్పుడూ ఒకే రకమైన చికెన్ గ్రేవీ లేదా రొటీన్ ఫ్రై తిని బోర్ కొడితే.. ఈసారి ముఖం తిప్పుకోకుండా, ధాబాలలో దొరికే స్టైల్‌లో ఘాటైన 'కడాయ్ చికెన్ ఫ్రై' (Kadai Chicken Fry) ట్రై చేయండి. కడాయ్ చికెన్ అనగానే హోటల్స్‌లో మాత్రమే పర్ఫెక్ట్‌గా వస్తుందని చాలా మంది అనుకుంటారు.

Kadai Chicken Fry Recipe: ధాబా స్టైల్ 'కడాయ్ చికెన్ ఫ్రై'.. వేడి వేడి రోటీల్లోకి అదిరిపోయే టేస్ట్.. ప్లేట్లు నాకేయడం ఖాయం!
Kadai Chicken Fry Recipe Telugu
Bhavani
|

Updated on: May 30, 2026 | 6:36 PM

Share

ఇంట్లోనే లభించే కొన్ని ప్రత్యేకమైన మసాలా దినుసులను తాజాగా వేయించి పొడి చేసుకుని వండితే.. ఆ సువాసన, టేస్ట్ అచ్చం మనం హైవే ధాబాలలో తినే కడాయ్ చికెన్‌ను తలపిస్తుంది. ముఖ్యంగా వేడి వేడి రోటీలు, చపాతీలు, నాన్ లేదా పుల్కాల్లోకి ఈ స్పైసీ చికెన్ ఫ్రై అద్భుతమైన కాంబినేషన్. మరి లేట్ చేయకుండా ఈ టేస్టీ ధాబా స్టైల్ వంటకం తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం.

కావలసిన పదార్థాలు

ఫ్రెష్ కడాయ్ మసాలా కోసం

ధనియాలు – 2 పెద్ద చెంచాలు

జీలకర్ర – 1 చెంచా

మిరియాలు – 1 చెంచా

ఎండుమిర్చి – 4 లేదా 5

సొంపు – అర చెంచా

చికెన్ ఫ్రై తయారీ కోసం:

చికెన్ – 500 గ్రాములు

ఉల్లిపాయలు – 2 (సన్నగా తరిగినవి)

టొమాటోలు – 2 (మెత్తగా ప్యూరీ లేదా తరుగు)

క్యాప్సికమ్ – 1 (పెద్ద ముక్కలుగా తరిగినవి)

ఉల్లిపాయ క్యూబ్స్ – 1 కప్పు (పెద్ద ముక్కలుగా కట్ చేసినవి)

అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 పెద్ద చెంచా

కారం పొడి – 1 చెంచా

పసుపు – అర చెంచా

కసూరి మేతి – 1 చెంచా

ఫ్రెష్ క్రీమ్ లేదా వెన్న – 1 చెంచా (ఆప్షనల్)

కొత్తిమీర తరుగు – కొద్దిగా

ఉప్పు – రుచికి సరిపడా

నూనె లేదా నెయ్యి – 3 నుండి 4 పెద్ద చెంచాలు

తయారీ విధానం

మొదట స్టవ్ ఆన్ చేసి పాన్‌లో ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిర్చి, సొంపు వేసి తక్కువ మంటపై దోరగా వేయించాలి. మంచి సువాసన వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఆ తర్వాత వీటిని మిక్సీ జార్‌లో వేసి మరీ మెత్తగా కాకుండా, కొంచెం బరకగా (Coarse Powder) గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇదే ఈ కూరకు అసలైన రుచిని ఇస్తుంది.

కడాయిలో ఒక చెంచా నూనె వేసి వేడయ్యాక.. పెద్ద ముక్కలుగా తరిగిన క్యాప్సికమ్, ఉల్లిపాయ క్యూబ్స్‌ను వేసి కేవలం రెండు నిమిషాలు హై ఫ్లేమ్‌పై వేయించి పక్కకు తీసుకోవాలి (ఇవి మరీ మెత్తబడకూడదు, క్రంచీగా ఉండాలి). ఇప్పుడు అదే కడాయిలో మిగిలిన నూనె వేసి, శుభ్రం చేసిన చికెన్ ముక్కలు, కొద్దిగా పసుపు, ఉప్పు వేసి చికెన్‌లోని నీరంతా పోయి ముక్కలు కొద్దిగా ఫ్రై అయ్యే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు అదే నూనెలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. ఇప్పుడు టొమాటో ప్యూరీ, కారం వేసి మసాలా నుండి నూనె పైకి తేలే వరకు బాగా ఉడికించాలి.

గ్రేవీ బాగా ఉడికాక, అందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి బాగా కలపాలి. దీనిపై మనం మొదటి స్టెప్‌లో తయారు చేసుకున్న కడాయ్ మసాలా పొడిని 2-3 చెంచాలు వేసి ముక్కలకు పట్టించాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు చల్లి మూత పెట్టి చికెన్ పూర్తిగా ఉడికే వరకు (సుమారు 8-10 నిమిషాలు) చిన్న మంటపై మగ్గనివ్వాలి.

చికెన్ బాగా ఉడికి ఫ్రై లాగా మారాక.. ముందుగా వేయించి పెట్టుకున్న క్యాప్సికమ్, ఉల్లిపాయ ముక్కలను ఇందులో కలపాలి. చివరగా కసూరి మేతిని చేత్తో నలిపి వేయాలి, అలాగే కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ లేదా వెన్న మరియు కొత్తిమీర తరుగు చల్లుకుని ఒక నిమిషం పాటు కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.

Follow Us