
సేమ్యా పాయసం అనేది ఏ పండగ వచ్చినా లేదా చుట్టాలు వచ్చినప్పుడు వెంటనే గుర్తుకొచ్చే ఒక రుచికరమైన, త్వరగా తయారు చేయగల స్వీట్.. ఈ ప్రత్యేక రెసిపీని ఎప్పుడైనా చేసుకోని ఇష్టంగా తినొచ్చు.. అయితే..పాయసం చల్లారిన తర్వాత చిక్కబడి గట్టిపడిపోకుండా, క్రీమీ కన్సిస్టెన్సీలో తయారు చేయడం అనేది.. అందరికీ సాధ్యం కాదు.. కొన్ని చిట్కాలను అవలంభించడం ద్వారా.. సేమియా పాయసం అద్భుతంగా తయారవుతుంది.. ఇంకా తొందరగా ఈ రెసిపీని సిద్ధం చేసుకోవచ్చు.. ఏ పద్ధతిని అనుసరించడం ద్వారా రుచికరమైన.. సరైన పాయసాన్ని పొందవచ్చొ ఈ కథనంలో తెలుసకుందాం..
1. మొదటగా, కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. అందులో ఐదు నుండి ఆరు చాప్ చేసిన బాదం ముక్కలు వేసి తక్కువ మంటపై లేత బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి.
2. తర్వాత రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసి, వాటిని కూడా లేత బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి. చివరగా ఒక టేబుల్ స్పూన్ ఎండుద్రాక్ష వేసి, అవి గుండ్రంగా ఉబ్బేంత వరకు వేయించి, ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి.
3. అదే కడాయిలో మిగిలిన నెయ్యిలో ఒక కప్పు సేమియా వేసి, తక్కువ మంటపై (అధిక మంటపై కాకుండా) మంచి బంగారు రంగు వచ్చేవరకు చక్కగా వేయించుకోవాలి. సేమియా త్వరగా వేగిపోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
4. సేమియా ఇలా మంచి రంగులో వేగిన తర్వాత, అందులో మూడు కప్పుల నీళ్లు పోసి, మీడియం ఫ్లేమ్‌లో ఐదు నుండి ఆరు నిమిషాలు సేమియాని పూర్తిగా ఉడకనివ్వాలి. మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు అంటుకుంటుంది.
5. సేమియా బాగా ఉడికిన తర్వాత, సేమియా కొలిచిన కప్పుతోనే మూడు కప్పుల పాలు (ముందుగా కాచి చల్లార్చినవి) పోయాలి. అంటే, ఒక కప్పు సేమియాకు మూడు కప్పుల నీళ్లు, మూడు కప్పుల పాలు వినియోగించాలి.
6. అలాగే, అర కప్పు పంచదార, మూడు టేబుల్ స్పూన్ల స్వీటెన్డ్ కండెన్స్డ్ మిల్క్ కూడా వేయాలి. కండెన్స్డ్ మిల్క్ వేయడం వల్ల పాయసానికి రిచ్ రుచి వస్తుంది. ఇది తప్పనిసరిగా వేయడానికి ప్రయత్నించాలి, లేనివారు వదిలేసినా పర్వాలేదు. అర టీ స్పూన్ కుంకుమపువ్వు కూడా వేయాలి, దీని ఫ్లేవర్ పాయసానికి చాలా బాగుంటుంది.
7. ఇవన్నీ వేసాక, అడుగు నుంచి మొత్తం బాగా కలిపి, మరొక రెండు నుండి మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించాలి. పాయసం రెండు మూడు పొంగులు వచ్చేంతవరకు, మధ్యమధ్యలో కలుపుకుంటూ కుక్ చేయాలి.
8. ఫైనల్‌గా, వేయించి పెట్టుకున్న డ్రైఫ్రూట్స్, అర టీ స్పూన్ యాలకుల పొడి, చిటికెడు ఉప్పు వేయాలి. ఏ స్వీట్‌కైనా చిటికెడు ఉప్పు వేస్తే దాని రుచి సమతుల్యంగా ఉంటుంది.
9. ఇవన్నీ వేసి మొత్తం బాగా కలిపి, పాయసం కాస్త పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేయాలి. ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుంది. ఇలా చేయడం వల్ల చల్లారిన తర్వాత కూడా పాయసం క్రీమీగా, చిక్కబడకుండా, సరైన కన్సిస్టెన్సీలో ఉంటుంది.
ఈ పద్ధతిలో తయారు చేసిన సేమ్యా పాయసం అసాధారణమైన రుచితో ఉంటుంది.. ఇంకెందుకు ఆలస్యం ఈ బక్రీద్ స్పెషల్ రెసీపిని మీరు కూడా తయారు చేసుకోండి..
బక్రీద్ స్పెషల్ పాతకాలపు చిట్కా.. ఎంత ముదురు మటన్ అయినా ఇది వేస్తే మెత్తగా ఉడుకుతుంది
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..