పిల్లలు ఇష్టంగా తినే కమ్మనైన కొబ్బరిపాల చికెన్ కర్రీ.. పాతకాలం నాటి స్టైల్‌లో ముక్క మెత్తగా..
చికెన్‌తో కొత్త రుచి ప్రయత్నించాలనుకునేవారికి కొబ్బరిపాల చికెన్ కర్రీ మంచి ఎంపిక. పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, మసాలాలతో చికెన్‌ను మ్యారినేట్ చేసి.. ఉల్లిపాయలు, కరివేపాకుతో వేయించిన తర్వాత కొబ్బరిపాలు కలిపి నెమ్మదిగా ఉడికిస్తే చిక్కటి గ్రేవీ సిద్ధమవుతుంది. వేడి అన్నం, రోటీ, ప్లెయిన్ బిర్యానీతో ఈ కర్రీని ఆస్వాదించవచ్చు..

మాంసాహార ప్రియులు ఆదివారం అనే కాకుండా.. ఎప్పుడు పడితే అప్పుడు చికెన్ (కోడి కూర) ను ఇష్టంగా వండుకుంటారు.. ఫ్రై, కర్రీతోపాటు పలు రకాలుగా వండుకుని తింటారు. అయితే, చికెన్ ను డిఫెరెంట్ స్టైల్ లో తినాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్.. అదేంటంటే.. కొబ్బరి పాలతో కమ్మనైన చికెన్ కర్రీ.. ఇంట్లోనే అత్యంత రుచికరమైన కొబ్బరి పాల చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. ఈ వంటకం అన్నం, ప్లెయిన్ బిర్యాని, లేదా రోటీలలోకి అద్భుతమైన కాంబినేషన్. స్పెషల్ గెస్టులు వచ్చినప్పుడు కూడా సులభంగా, రుచిగా తయారు చేయగల రెసిపీ ఇది.. పాతకాలంలో కూడా దీనిని ఇష్టంగా వండుకోని తినేవారు..
కావలసిన పదార్థాలు:
- చికెన్: 1 కిలో (శుభ్రం చేసి పెట్టుకున్నది)
- పసుపు: చిటికెడు
- కారం: 2 టేబుల్ స్పూన్లు
- ఉప్పు: రుచికి సరిపడా
- అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 1/2 టేబుల్ స్పూన్లు (ఫ్రెష్‌గా దంచుకున్నది మరింత రుచికరంగా ఉంటుంది)
- చిక్కటి పెరుగు: 2-3 టేబుల్ స్పూన్లు (లేదా నిమ్మరసం)
- కొబ్బరికాయ: 1 (చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నది)
- నీరు: 1 గ్లాసు (కొబ్బరి పాలు తీయడానికి)
- నూనె: 4 టేబుల్ స్పూన్లు
- బిర్యానీ మసాలాలు: (బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వంటివి)
- ఉల్లిపాయలు: 2 (సన్నగా చిలికలుగా కట్ చేసుకున్నవి)
- కరివేపాకు: గుప్పెడు
- ధనియాల పొడి: 1 టేబుల్ స్పూన్
- గరం మసాలా: 1/2 టేబుల్ స్పూన్
- కొత్తిమీర: సన్నగా తరిగినది (చివరగా గార్నిష్ కోసం)
తయారీ విధానం:
చికెన్ మ్యారినేషన్: శుభ్రం చేసి పెట్టుకున్న 1 కిలో చికెన్‌ను ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోండి. దీంట్లో చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, ఒకటిన్నర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రెండు నుండి మూడు టేబుల్ స్పూన్ల చిక్కటి పెరుగు వేసి బాగా కలపండి. పెరుగు ఇష్టపడని వారు ఈ ప్లేస్‌లో నిమ్మరసాన్ని కూడా పిండుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని అంతా చికెన్‌కు బాగా పట్టించి, కనీసం ఒక గంట పాటు మాగ్నెట్ చేసి పక్కన పెట్టుకోండి.
కొబ్బరి పాలు తయారీ: ఒక మిక్సీ జార్ తీసుకొని, ఒక కొబ్బరికాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి జార్‌లోకి వేయండి. ముందుగా నీళ్లు వేయకుండా ఒకసారి మిక్సీ పట్టండి. తరువాత ఒక గ్లాసు నీటిని కలిపి మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోండి. ఈ పేస్ట్‌ను ఒక జల్లెడ బుట్టలో వేసి వడకట్టి చిక్కటి కొబ్బరి పాలను సపరేట్ చేసుకోండి. కొబ్బరిలో మిగిలిన పిప్పిని ఎండబెడితే ఎండుకొబ్బరిలా ఉపయోగపడుతుంది లేదా ఇతర కూరల్లో వేసుకోవచ్చు. తీసిన కొబ్బరి పాలను పక్కన పెట్టుకోండి.
కూర వండటం ప్రారంభం: స్టవ్ వెలిగించి మందపాటి కడాయిని పెట్టండి. నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి అయ్యాక బిర్యానీ మసాలాలు వేయండి. తరువాత సన్నగా తరిగి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలను వేసి మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత గుప్పెడంత కరివేపాకు వేసి ఒకసారి కలపండి.
చికెన్ ఉడికించడం: ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్‌ను కడాయిలోకి ట్రాన్స్‌ఫర్ చేయండి. హై ఫ్లేమ్‌లో రెండు నుండి మూడు నిమిషాల పాటు చికెన్‌ను నూనెలో బాగా కలిపి వేయించాలి. చికెన్ ముక్కలు నూనెలో కొద్దిగా వేగాక, మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో దాదాపు 60 నుండి 70% వరకు చికెన్ ఉడికే వరకు కుక్ చేయాలి. చికెన్ నుంచి నీరు వచ్చి, ఆయిల్ పైకి తేలడం మొదలవుతుంది.
మసాలాలు – కొబ్బరి పాలు కలపడం: ఆయిల్ పైకి తేలుతున్న ఈ సమయంలో, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అర టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలపండి. ఇప్పుడు మనం తీసిపెట్టుకున్న కొబ్బరి పాలను దీంట్లోకి వేసి, మళ్ళీ ఒకసారి మిక్స్ చేయండి.
చివరి కుకింగ్: కడాయికి మూత పెట్టి, స్టవ్‌ను సిమ్ లో పెట్టుకొని దాదాపు పావుగంట (15 నిమిషాలు) పాటు బాగా కుక్ చేయాలి. లో ఫ్లేమ్‌లో కుక్ చేయడం వల్ల చికెన్ పర్ఫెక్ట్‌గా ఉడికి, సాఫ్ట్‌గా మారుతుంది.
15 నిమిషాల తర్వాత, మూత తీసి సన్నగా తరిగిన కొత్తిమీరను వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేయండి. కొబ్బరి పాలతో కూడిన కమ్మనైన చికెన్ కర్రీ ఇప్పుడు సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. చూడటానికి ఆయిల్ అంతా పైకి తేలి, చికెన్ పర్ఫెక్ట్‌గా కుక్ అయి ఉంటుంది. ఇది రైస్, ప్లెయిన్ బిర్యాని, లేదా చపాతీలతో చాలా రుచికరంగా ఉంటుంది. ఈ రెసిపీని పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు.
