Banana Flower Chutney: అరటి పువ్వును కూరగానే తింటున్నారా? అయితే ఈ మ్యాజిక్ చట్నీని మిస్ అయినట్లే!
చాలా మంది అరటి పువ్వును క్లీన్ చేయడం కష్టమని పక్కన పెట్టేస్తుంటారు. కానీ, ఆ కష్టం వెనుక దాగి ఉన్న ఆరోగ్యం రుచి తెలిస్తే మీరు అస్సలు వదులుకోరు. సాధారణంగా వేపుడు రూపంలో తినే అరటి పువ్వును, ఈసారి ఇలా చట్నీగా మార్చి చూడండి. ఇది మీ ఇడ్లీ, దోసెలకు ఒక కొత్త రుచిని అద్దడమే కాకుండా, మీ శరీరానికి అవసరమైన పోషకాలను మెండుగా అందిస్తుంది. ముఖ్యంగా కిడ్నీ సమస్యలతో బాధపడేవారికి ఇది ఒక అద్భుతమైన ఆహార ఔషధం.

అరటి పువ్వులో ఉండే సహజసిద్ధమైన పీచు పదార్థం యాంటీ ఆక్సిడెంట్లు మన జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. చింతపండు పులుపు, ఎండుమిర్చి ఘాటు, కొబ్బరి రుచి కలిసిన ఈ చట్నీని ఒక్కసారి రుచి చూస్తే.. మీరు మళ్ళీ మళ్ళీ ఇదే కావాలంటారు. మరీ ముఖ్యంగా, కేరళ తమిళనాడు ప్రాంతాల్లో ఈ వంటకం ఎంతో ప్రసిద్ధి. ఇంట్లోనే కేవలం 10 నిమిషాల్లో ఈ హెల్తీ చట్నీని ఎలా సిద్ధం చేసుకోవాలో, ఆ సింపుల్ ట్రిక్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు :
సన్నగా తరిగిన అరటి పువ్వు (1 కప్పు).
పచ్చి కొబ్బరి తురుము (1/2 కప్పు),
చింతపండు (చిన్న సైజు),
ఎండుమిర్చి (4-5),
ధనియాలు (1 టీస్పూన్),
ఉప్పు.
తాలింపు: నూనె, ఆవాలు, మినపప్పు, కరివేపాకు.
తయారీ విధానం:
అరటి పువ్వు పైపొరలు తీసి లోపలి భాగం మాత్రమే వాడండి. తరిగిన ముక్కలను ఉప్పు నీటిలో లేదా మజ్జిగలో వేస్తే రంగు మారకుండా, చేదు లేకుండా ఉంటాయి.
పాన్‌లో కొద్దిగా నూనె వేసి ఎండుమిర్చి, ధనియాలను దోరగా వేయించి చల్లారనివ్వండి.
మిక్సీలో అరటి పువ్వు ముక్కలు, కొబ్బరి, వేయించిన మిర్చి, చింతపండు, ఉప్పు వేసి తగినన్ని నీళ్లతో మెత్తగా రుబ్బుకోవాలి.
ఆవాలు, మినపప్పు, కరివేపాకుతో తాలింపు వేసి చట్నీలో కలిపితే.. ఘుమఘుమలాడే అరటి పూల చట్నీ రెడీ!
