AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bengali Style Fish Curry: బెంగాలీ స్పెషల్ చేపల పులుసు.. వేడివేడి అన్నంలోకి తింటే ముద్ద ముద్దకు స్వర్గమే!

మనదేశంలో చేపల కూరను ఇష్టపడని నాన్-వెజ్ ప్రియులు ఉండరు. ముఖ్యంగా కోస్తా ప్రాంతాల వారు ఒక్కో దగ్గర ఒక్కో పద్ధతిలో చేపల పులుసును వండుతుంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో చింతపండు పులుసుతో ఘాటుగా చేపల కూర వండితే.. పశ్చిమ బెంగాల్ లో మాత్రం చాలా డిఫరెంట్‌గా, లైట్‌గా వండుతారు. బెంగాలీయుల ఇళ్లల్లో ప్రతిరోజూ వండే అత్యంత ప్రసిద్ధ సాంప్రదాయ వంటకం 'మాఛేర్ ఝోల్'. అంటే బెంగాలీ స్టైల్ చేపల పులుసు అని అర్థం.

Bengali Style Fish Curry: బెంగాలీ స్పెషల్ చేపల పులుసు.. వేడివేడి అన్నంలోకి తింటే ముద్ద ముద్దకు స్వర్గమే!
Bengali Style Fish Curry Recipe,
Bhavani
|

Updated on: May 26, 2026 | 10:20 PM

Share

బెంగాలీ చేపల కూర అనగానే ఆవనూనె తప్పనిసరి. ఆవనూనెలో చేపలను వేయించడం వల్ల ఈ వంటకానికి ప్రత్యేకమైన రుచి మరియు సువాసన వస్తాయి. ఈ కర్రీ కోసం ఎక్కువగా రవ్వ లేదా కట్ల చేపలను ఉపయోగిస్తారు. ఘాటైన ఆవనూనె, తాజా ఆవాల పేస్ట్, ఐదు రకాల పోపు దినుసుల మిశ్రమమైన ‘పాంచ్ ఫోరన్’ వేసి వండే ఈ కర్రీ రుచి చాలా విభిన్నంగా, కమ్మగా ఉంటుంది. మరి వేడివేడి అన్నంలోకి అమృతంలా ఉండే ఈ బెంగాలీ చాపల కూరను ఇంట్లోనే ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.

కావలసిన పదార్థాలు:

చేప ముక్కలు – 500 గ్రాములు (శుభ్రం చేసినవి) ఆలుగడ్డలు (బంగాళాదుంపలు) – 2 (పొడవుగా కోసినవి – బెంగాలీ కర్రీలో ఆలుగడ్డ తప్పనిసరి) టమోటా – 1 (సన్నగా తరిగినది) పచ్చిమిర్చి – 4 (నిలువుగా చీల్చినవి) ఆవనూనె – 4 టేబుల్ స్పూన్లు కొత్తిమీర తరుగు – కొద్దిగా ఉప్పు – రుచికి సరిపడా

మసాలాలు..

పాంచ్ ఫోరన్ (ఆవాలు, జీలకర్ర, మెంతులు, సోంపు, నల్లజీలకర్ర మిశ్రమం) – 1 టీస్పూన్ ఆవాల పేస్ట్ (ఆవాలు, కొద్దిగా నీళ్లు పోసి నూరినది) – 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ – 1 టీస్పూన్ పసుపు పొడి – 1 టీస్పూన్ కారం పొడి – 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి – 1 టీస్పూన్ జీలకర్ర పొడి – 1 టీస్పూన్

తయారీ విధానం

ముందుగా శుభ్రం చేసిన చేప ముక్కలకు అర టీస్పూన్ పసుపు, అర టీస్పూన్ ఉప్పు పట్టించి 15 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. ఆ తర్వాత కడాయిలో ఆవనూనె వేసి బాగా పొగలు వచ్చే వరకు వేడి చేయాలి. నూనె కాగాక చేప ముక్కలను వేసి రెండు వైపులా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కన తీసుకోవాలి (ఎక్కువ గట్టిగా ఫ్రై చేయకూడదు).

అదే నూనెలో పొడవుగా కట్ చేసిన బంగాళాదుంప ముక్కలను వేసి కొద్దిగా పసుపు చల్లి, అవి కాస్త రంగు మారే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.

మిగిలిన నూనెలో ‘పాంచ్ ఫోరన్’ పోపు దినుసులు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఆ తర్వాత అల్లం పేస్ట్, టమోటా ముక్కలు వేసి మెత్తగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిగిలిన పసుపు మరియు కొద్దిగా నీళ్లు పోసి పేస్ట్‌లా చేసి కడాయిలో వేయాలి. ఈ మసాలా నుండి నూనె పైకి తేలే వరకు 2 నిమిషాలు వేపాలి.

మసాలా వేగాక అందులో ముందుగా వేయించి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసి కలపాలి. ఆపై గ్రేవీకి సరిపడా (సుమారు 2 కప్పులు) వేడి నీళ్లు మరియు రుచికి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టాలి. ఆలుగడ్డ ముక్కలు మెత్తగా ఉడికే వరకు ఈ పులుసును బాగా మరిగించాలి.

పులుసు మరుగుతున్నప్పుడు వేయించిన చేప ముక్కలను అందులో వేయాలి. చివరగా సిద్ధం చేసి పెట్టుకున్న ఆవాల పేస్ట్‌ను పావు కప్పు నీళ్లలో కలిపి పులుసులో పోయాలి. తక్కువ మంటపై 3 నుండి 4 నిమిషాలు ఉడికించి, పైనుంచి కొద్దిగా పచ్చిమిర్చి, కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే ఎంతో రుచికరమైన సాంప్రదాయ బెంగాలీ ‘మాఛేర్ ఝోల్’ రెడీ!

చిన్న చిట్కా: ఆవాల పేస్ట్‌ను ఎప్పుడూ కర్రీ దించే ముందు మాత్రమే వేయాలి. ముందే వేసి ఎక్కువ సేపు మరిగిస్తే కూర చేదు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే ఆవనూనె వాడేటప్పుడు అది బాగా కాగిన తర్వాతే చేపలను వేయాలి, లేదంటే పచ్చి ఆవాల వాసన వస్తుంది.

Follow Us