
మతి మరుపు అనేది వృద్ధాప్యంలో ఉన్నవారిలో ఎక్కువగా ఉంటుంది. అయితే, ఇప్పుడున్న జీవిన శైలి, తీసుకునే ఆహార పదార్థాల కారణంగా చిన్న వయస్సు వారు కూడా తరచూ మతి మరుపునకు గురవుతున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లో పనులు మర్చిపోవడం, బయటకు వెళ్లిన సమయంలో అక్కడ ఏదైనా కొనుగోలు చేసేది మర్చిపోవడం, వస్తువులు ఎక్కడ పెట్టామో గుర్తుకు రాకపోవడం, సోషల్ మీడియా ఖాతాల పాస్‌వర్డ్‌లు, బ్యాంక్ కార్డుల పిన్‌లు మర్చిపోవడం లాంటివి ఇటీవల కాలంలో సాధారణంగా మారిపోయాయి. ఈ క్రమంలోనే మంచి ఆహారాన్ని తీసుకోవడం, మంచి దైనందిన అలవాట్లతో ఈ మతిమరుపు సమస్యకు చెక్ పెట్టవచ్చు. అందుకు సంబంధించిన వివరాలు చూద్దాం.
జ్ఞాపకశక్తి, మానసిక ఆరోగ్యాన్ని మెరుపర్చడంలో మనం తీసుకునే ఆహారం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. రోజువారీగా తీసుకునే ఆహారంలో బాదం, వాల్‌నట్స్, విటమిన్ ఇ ఉండేలా చూసుకోవాలి. ఒమేగా కొవ్వు ఆమ్లాలు, విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా కలిగిన గుమ్మడికాయల గింజలను ఆహారంలో చేర్చుకోవాలి. ఇది మైండ్ చురుగ్గా ఉండేందుకు సహకరిస్తుంది. ఇక, బ్లూబెర్రీస్‌లో ఉండే ఆంథోసైనిన్ యాంటీఆక్సిడెంట్లు మెదడును ఒత్తిడి నుంచి రక్షిస్తాయి. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి. ఫ్లేవనాయిడ్లు, కెఫిన్ పుష్కలంగా కలిగిన డార్క్ చాక్లెట్లు కూడా జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను మెరుగుపరుస్తాయి.
అకాడోలో లభించే ఆరోగ్యకరమైన కొవ్వులు మెదడు కణాలను బలోపేతం చేసి జ్ఞాపకశక్తిని పెంచుతాయి. రాగులు, ఓట్స్, తృణధాన్యాలు వంటివి మెదడుకు శక్తినిస్తాయి. పాలకూర, బ్రోకోలి వంటి ఆకుకూరల్లో విటమిన్ కె, లుటీన్, ఫోలేట్ ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.
తగినంత నిద్ర
తగినంత నిద్ర లేకపోతే మెదడు తన పనిని తాను సమర్థవంతంగా చేయలేదు. అందుకే సరిపడా నిద్రపోవాలి. తగినంత నిద్రతో మన మెదడు చురుగ్గా మారుతుంది. రోజులోని సమాచారన్నంత ప్రాసెస్ చేస్తుంది.
వ్యాయామం
మెదడులో కొత్త కణాల సృష్టికి, రక్త ప్రవాహాన్ని పెంచేందుకు శరీర వ్యాయామం ఎంతో అవసరం. వ్యాయామం చేయడం వల్ల కూడా జ్ఞాపకశక్తి మెరుపడుతుంది.
తగినంత తాగునీరు
మంచినీరు తరచూ తగినంత తీసుకోవడం వల్ల మెదడు హైడ్రేటెడ్‌గా ఉంటుంది. దీంతో మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
ఒత్తిడి
తీవ్రమైన ఒత్తిడి మెదడుకు హానికరం కావచ్చు. అందుకే, యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటి పద్ధతులు పాటిస్తూ ఒత్తిడిని తగ్గించుకోవాలి.