
జీవితంలో ఎదగాలంటే చిన్నపాటి ఒత్తిడి మంచిదే. కానీ కొందరు చిన్న విషయాలకే టెన్షన్ పడిపోతుంటారు. అతిగా ఆలోచిస్తూ ఆందోళనకు గురవుతుంటారు. అసలు జరగనే లేని విషయాలను తలుచుకుంటూ మెదడును చితక్కొట్టేస్తుంటారు. ఇలా అయిన దానికీ కాని దానికి టెన్షన్ పడేవారిలో మానసిక సమస్యలతో పాటు శారీరక సమస్యలు కూడా ఎదురవుతుంటాయి. ఏ పనీ సరిగ్గా చేయలేరు. వీరిలో గుండె జబ్బుల రిస్క్ ఎక్కువగా ఉంటుందని వయసు చిన్నదే అయినా పెద్దవారిలో కనపడేలా వీరిలో ఏజింగ్ ప్రక్రియ ముందే మొదలవుతుందని అంటున్నారు. ఈ అలవాటు నుంచి బయటపడాలంటే కొన్ని సింపుల్ టెక్నిక్స్ ను సూచిస్తున్నారు. అవేంటో చూసేయండి.
సోషల్ మీడియా, టెలివిజన్ మీ రోజులో గంటల తరబడి అనవసరమైన సమాచారంతో మీ మనస్సును పాడుచేస్తుంటాయి. మీ ఫోన్‌లో ఎక్కువ సమయం స్క్రోలింగ్ చేయడానికి బదులుగా, కనీసం 30 నిమిషాల స్క్రీన్ సమయాన్ని నాన్-ఫిక్షన్ పుస్తకం చదవడానికి భర్తీ చేయండి. చదవడం మీ మెదడును ఉత్తేజపరుస్తుంది, ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది మరియు మీ జ్ఞానాన్ని విస్తరిస్తుంది. ఇది ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది మరియు అవసరం లేని స్క్రీన్ వినియోగం కంటే మరింత అర్థవంతమైన రీతిలో విశ్రాంతి తీసుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మనకు నచ్చిన స్నేహితులు, బంధువులతో సంభాషణలో మునిగిపోతే కూడా ఒత్తిడి దూరం అవుతుంది.
కృతజ్ఞతా భావం మీ జీవితాన్ని మార్చగల ఓ గొప్ప టెక్నిక్. ఇది మీలో పాజిటివిటీ పెంచి నెగిటివ్ థాట్స్ ను తగ్గిస్తుంది. మీరు కోల్పోయిన వాటిమీద ధ్యాస పెట్టే బదులు మీ దగ్గర ఇప్పటికే ఉన్న అద్భుతమైన విషయాలను గుర్తించి గౌరవించండి. ఇధి మీ దృష్టి కోణాన్ని పూర్తిగా మార్చేస్తుంది. లేని వాటి కన్నా ఉన్నవాటిని గుర్తించగలిగిన రోజు వాటితో మీరు అద్భుతాలు చేయగలరు. మీ జీవితంలో ప్రతి రోజు, మీరు కృతజ్ఞతతో ఉన్న మూడు విషయాలను రాస్తూ ఉండండి. అవి ఎంత చిన్నవైనా కావచ్చు. ఇది మీలో ఒత్తిడిని తగ్గించి ఆనందాన్ని పెంచుతుంది. ఈ విషయం సైంటిఫిక్ గా కూడా రుజువైంది. జీవితంలోని సానుకూలతలపై దృష్టి పెట్టడం ద్వారా, మీరు మీ మనస్సును అడ్డంకులకు బదులుగా అవకాశాలను చూడటానికి ట్రైనింగ్ ఇచ్చినట్టవుతుంది. ఇది ఆరోగ్యకరమైన, మరింత ఆశావాద మనస్తత్వానికి దారితీస్తుంది.
ప్రతి సాయంత్రం మీకోసం మీరు ఆలోచించడానికి కొన్ని నిమిషాలు కేటాయించుకోండి. మీకు ఏది బాగా పనిచేసింది, దేనిలో మెరుగుదల అవసరం, ఆరోజు మీరేదైనా కొత్తగా నేర్చుకున్న విషయం ఇలా ప్రతిదాని మీద ఓ కన్నేస ఉంచండి. ఇది మీపై మీకు క్లారిటీని పెరిగేలా చేస్తుంది. భావోద్వేగపరంగా సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది మరియు భవిష్యత్తులో నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలా చేయడానికి ఒక అద్భుతమైన మార్గం ధ్యానం లేదా డీప్ బ్రీతింగ్ చాలా పనిచేస్తాయి. కేవలం 10 నిమిషాల నిశ్శబ్ద సమయం కూడా మీ మనసును శాంతపరుస్తుంది, ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తుంది మరియు సానుకూలతను పెంచుతుంది.
రాత్రిపూట మీ మనస్సు ఒత్తిడికి గురికాకుండా ఉండటానికి, మీ ఆలోచనలు, పనులు లేదా బాధలను వ్రాయడానికి కొన్ని నిమిషాలు కేటాయించండి. మెదడులో మీరు పోగేసే చెత్త మానసిక గందరగోళానికి కారణమవుతుంది. ఇది తరువాతి రోజును కూడా ఎఫెక్ట్ చేస్తుంది. మంచిగా నిద్రపట్టాలన్నా మరుసటి రోజు మీరు ఉత్సాహంగా ఉండాలన్నా ఆ ముందు రోజు మీరు చేసే ఈ చిన్న పని ఎంతో ముఖ్యం. గోరు వెచ్చని నీటితో స్నానం, ఒక మంచి హెర్బల్ టీని ఆస్వాదించండి లేదా ప్రశాంతమైన సంగీతాన్ని వినండి. మీరు నిద్రపోతున్నప్పుడు మీ మెదడు పూర్తిగా రీఛార్జ్ అయ్యేలా చేయడానికి సాయంత్రం ఆలస్యంగా కెఫిన్ తీసుకోవడం లేదా పెద్ద మొత్తంలో భోజనం చేయడం ఆపేయండి.