
అలసటకు ప్రధాన కారణాలలో ‘స్లీప్ అప్నియా’ ఒకటి. నిద్రలో గొంతు భాగంలోని శ్వాస మార్గం కొంతసేపు మూసుకుపోవడం వల్ల శ్వాస ఆగిపోతూ మళ్లీ మొదలవుతుంటుంది. ప్రతిసారీ ఇలా జరిగినప్పుడు మెదడు చిన్నగా మేల్కొనే సంకేతం పంపుతుంది. ఈ అంతరాయాలు మనకు తెలియకపోయినా, అవి నిద్రను ముక్కలు చేస్తాయి. ఫలితంగా శరీరం గాఢనిద్ర దశకు చేరుకోలేకపోతుంది. అలాగే ‘ఇన్‌సోమ్నియా’ (నిద్రలేమి) సమస్య ఉన్నవారిలో కూడా నిద్రపోవడానికి ఎక్కువ సమయం పట్టడం, రాత్రి మధ్యలో పలుమార్లు మేల్కొనడం వంటివి జరుగుతాయి. మొత్తం నిద్ర సమయం సాధారణంగా కనిపించినా, అది విరామాలతో కూడి ఉండటంతో శరీరానికి కావాల్సిన పూర్తి విశ్రాంతి దక్కదు.
డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక ఆరోగ్య సమస్యలు కూడా శరీర శక్తిని పిండేస్తాయి. టెన్షన్ ఎక్కువగా ఉన్నప్పుడు మెదడు ఎప్పుడూ అప్రమత్త స్థితిలోనే ఉండటంతో, శరీరం పూర్తిగా రిలాక్స్ కాలేకపోతుంది. వీటితో పాటు గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం, ఊపిరితిత్తులు, మూత్రపిండాల సమస్యలు కూడా రోజంతా అలసటను కలిగిస్తాయి. ఈ వ్యాధులున్నప్పుడు సాధారణ పనులు చేయడానికి కూడా శరీరం ఎక్కువ శక్తిని వినియోగించుకోవాల్సి వస్తుంది. అంతేకాకుండా, రాత్రివేళ తరచూ బాత్రూంకి వెళ్లాల్సి రావడం, శరీర నొప్పులు కూడా నిద్రకు భంగం కలిగిస్తాయి.
జీవనశైలి అలవాట్లు కూడా నిద్ర నాణ్యతను దెబ్బతీస్తాయి. రాత్రివేళ ఎక్కువగా తినడం, మసాలా ఆహారం తీసుకోవడం, ఆల్కహాల్ సేవించడం వంటివి శరీర అంతర్గత గడియారాన్ని గందరగోళానికి గురిచేస్తాయి. పడుకునే ముందు మొబైల్ లేదా ల్యాప్‌టాప్ వాడటం వల్ల వచ్చే ‘బ్లూ లైట్’ నిద్రను ప్రేరేపించే మెలాటోనిన్ హార్మోన్‌ను అడ్డుకుంటుంది. అలాగే, శారీరక వ్యాయామం లేకపోవడం, తగినంత నీరు తాగకపోవడం, పోషకాహార లోపం వల్ల కూడా రోజంతా మత్తుగా, అలసటగా అనిపిస్తుంది.
నిరంతరం అలసటగా అనిపిస్తే దాన్ని చిన్న సమస్యగా తీసుకోకండి.
ఒకవేళ మీరు పైన చెప్పిన జాగ్రత్తలు తీసుకున్నా, రోజంతా అలసటగా అనిపిస్తుంటే, నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం మంచిది. రక్త పరీక్షలు లేదా స్లీప్ స్టడీ ద్వారా సమస్యను గుర్తించి, సరైన చికిత్స తీసుకోవడం ద్వారా మీ శక్తిని, ఉత్సాహాన్ని మీరు తిరిగి పొందవచ్చు. ‘నిద్ర’ అనేది విలాసం కాదు, అది మీ ఆరోగ్యానికి పునాది అని గుర్తుంచుకోండి!