సాధారణంగా వెండి పట్టీలు (Silver Jewelry) లేదా వెండితో చేసిన ఇతర ఆభరణాలు తళతళమెరుస్తుంటాయి. అయితే కొద్ది రోజుల తర్వాత అవి బాగా మెరుపును కోల్పోతాయి. నల్లగా మారిపోతాయి. గాలి తగలడం వల్ల వెండినగలపై ఉండే ఆక్సైడ్ పూత కరిగిపోవడం వల్లనే ఇలా జరుగుతుంది. అందుకే వెండి ఆభరణాలను సైతం బంగారు నగల్లాగే గాలి చొరబడని డబ్బాల్లో, ఇతర లోహాలకు దూరంగా భద్రపరచాల్సి ఉంటుంది. అయితే ఈ విషయం తెలియక కొందరు వెండి నగలను ఇష్టమొచ్చినట్లు ఎక్కడంటే అక్కడ ఉంచుతారు. ఫలితంగా అవి కొద్దికాలానికి మెరుపును కోల్పోయి నల్లగా మారిపోతాయి. వీటిని ఒంటిపై ధరించలేం. అలాగనీ స్వర్ణకారుల వద్దకు వెళితే మెరుగు పట్టేందుకు ఎంత తీసుకుంటాడోనన్న ఆందోళన వెంటాడుతుంది. ఈక్రమంలో స్వర్ణకారుల వద్దకు వెళ్లకుండానే ఇంట్లోనే కొన్ని రెమెడీస్ ట్రై చేయడం ద్వారా వెండి ఆభరణాలు మళ్లీ మెరిసేలా చేసుకోవచ్చు.
వెండిని పాలిష్ చేయాలంటే..
*వేడి నీటిలో వైట్ వెనిగర్ వేసి దానికి ఉప్పు కలపండి. అందులో వెండి వస్తువులను వేసి అరగంట పాటు అలాగే ఉంచాలి. దీని వల్ల వెండిపై పడిన మురికి, ధూళి సులభంగా తొలగిపోతాయి. కొంత సమయం తర్వాత వినియోగంలో లోని టూత్ బ్రష్ తో వెండి నగలను సున్నితంగా తుడవండి. ఇలా చేయడం వల్ల వెండి నగలు వెంటనే మెరుపు సంతరించుకుంటాయి.
* వెండి వస్తువులను టూత్‌పేస్ట్, టూత్ పౌడర్‌తో కూడా మెరిసేలా చేయవచ్చు. అయితే దీనికి తెల్లటి కోల్గేట్ టూత్‌పేస్ట్ లేదా టూత్ పౌడర్ మాత్రమే బాగా పని చేస్తుంది. ఒక బ్రష్ తీసుకుని మధ్యలో వేడి నీళ్లు పోస్తూ వెండి నగలను శుభ్రం చేయాలి. ఫలితంగా తక్కువ సమయంలోనే వెండి మిలమిలా మెరుస్తుంది.
*వేడి నీటిలో ఒక చెంచా బేకింగ్ సోడా వేసి అందులో వెండి వస్తువులను వేయండి. అరగంట తర్వాత వాటిని బ్రష్‌తో శుభ్రం చేస్తే ఆభరణాలకు మంచి షైన్ వస్తుంది. బ్రష్‌కు బదులు ఫాయిల్ (Foil) పేపర్‌ను ఉపయోగిస్తే వెండి ఆభరణాలు మరింత ధగధగలాడుతాయి.
*కరోనా కాలం నుంచి ప్రతి ఇంట్లో హ్యాండ్ శానిటైజర్ తప్పనిసరై పోయింది. దీనిని వెండిని పాలిష్ చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. దీని కోసం, మీరు ఒక పాత్రలో కొద్దిగా స్ప్రే శానిటైజర్‌ను తీసుకుని అందులో వెండి ఆభరణాలను వేయాలి. ఒక అర్ధ గంట తర్వాత బ్రష్‌తో రుద్ది మళ్లీ శానిటైజర్‌లో ముంచండి. కాసేపయ్యాక నగలను బయటకు తీసి గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. ఫలితంగా వెండి ఆభరణాలు మంచి మెరుపును సంతరించుకుంటాయి.
* వెండి మరీ నల్లగా లేకుంటే నిమ్మరసంలో కొద్దిగా ఉప్పు కలిపి కూడా శుభ్రం చేసుకోవచ్చు. ఇది కాకుండా, వేడి నీటిలో డిటర్జెంట్ వేసి వెండి ఆభరణాలను కాసేపు ఉంచాలి. ఆ తర్వాత బ్రష్ తో రుద్ది శుభ్రం చేస్తే మంచి ఫలితముంటుంది.
ఇలా భద్రపరచుకోండి..కాగా ఈ రోజుల్లో వెండి ఆభరణాల్ని భద్రపరచుకునేందుకు యాంటీ-టర్నిష్ పేపర్/క్లాత్ వంటి ప్రత్యేకమైన క్లాత్స్ మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. ఒకవేళ అవి అందుబాటులో లేని పక్షంలో మస్లిన్ క్లాత్ , టిష్యూ పేపర్లలోనూ వెండి నగల్ని అమర్చి లాకర్‌లో పెట్టవచ్చు. నగల్ని ఉంచే డబ్బాల్లో సిలికాజెల్ సాచెట్స్ లేదంటే యాక్టివేటెడ్ చార్‌కోల్‌ను ఉంచాలి. తద్వారా ఆ డబ్బాలో ఉండే తేమను అవి పీల్చుకుంటాయి. ఫలితంగా వెండి నగలు ఎక్కువ కాలం మన్నుతాయి.
Also Read:Tamilnadu: పొలంలో విషం తిని 12 నెమళ్ళు మృతి.. రైతుని అరెస్ట్ చేసిన పోలీసులు
Neha Shetty: ‘నన్ను టిల్లు నమ్మకపోయినా.. మీ అందరూ నమ్మారు’.. ఎమోషనల్ పోస్ట్ చేసిన నేహా శెట్టి.