
మనుషులు స్పందించే అత్యంత బలమైన సామాజిక సంకేతాలలో కంటి చూపు ఒకటి. ఒక అపరిచిత వ్యక్తిని మనం నిరంతరాయంగా చూసినప్పుడు, మన మెదడులో ఒక చిన్న ‘స్ట్రెస్ రెస్పాన్స్’ మొదలవుతుంది. దీనివల్ల గుండె వేగం స్వల్పంగా పెరగడం, ఏకాగ్రత పదునుదేలడం జరుగుతాయి. ఈ శారీరక మార్పుల వల్లే, ఆ చూపులో ఏదో అర్థం ఉందని మన మెదడు పొరబడుతుంది.
ఇక్కడే ‘ప్రొజెక్షన్’ అనే ప్రక్రియ మొదలవుతుంది. అంటే, ఆ వ్యక్తి గురించి మనకు ఏమీ తెలియదు కాబట్టి, ఆ సమయంలో మనకు ఏది కావాలో దానికి అనుగుణంగా వారి గురించి ఒక ఊహాచిత్రాన్ని మన మనస్సు నిర్మిస్తుంది. ఉదాహరణకు, ఒంటరిగా ఉన్నవారు ఆ అపరిచితుడు కూడా ఒంటరిగానే ఉన్నాడని, ప్రేమ కోసం వెతుకుతున్నారని ఊహించుకుంటారు.
సైకాలజిస్టుల ప్రకారం, దీనిని “లిమెరెన్స్ ఆన్ జీరో డేటా” (Limerence on zero data) అని పిలుస్తారు. అంటే అవతలి వ్యక్తి గురించి ఎటువంటి సమాచారం లేకపోయినా, వారిపై ఒక భావోద్వేగ అనుబంధాన్ని పెంచుకోవడం. ఇక్కడ ఆ అపరిచితుడు మన ఊహలకు ఒక తెల్లటి కాన్వాస్ లాంటివాడు. వారు ఇంకా మనతో మాట్లాడి విసిగించలేదు, ప్లాన్స్ క్యాన్సిల్ చేయలేదు లేదా చిరాకు కలిగించే మెసేజ్‌లు పంపలేదు. అందుకే ఆ వ్యక్తి మన ఊహల్లో ఎంతో ‘పర్ఫెక్ట్’గా కనిపిస్తారు. ఈ తీవ్రమైన అనుభూతి మన సొంత అంతర్గత స్థితి నుండి పుడుతుందే తప్ప, అవతలి వ్యక్తితో దీనికి ఎటువంటి సంబంధం ఉండదు.
కళ్లు కలవడం అనేది మానవ చరిత్రలో కొత్తేమీ కాదు. కానీ, 2023లో టిక్‌టాక్, ఎక్స్ (ట్విట్టర్) వేదికగా జెన్-జీ యువత దీనికి ఒక పేరు పెట్టి ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలుపెట్టింది. సిట్యుయేషన్ షిప్స్, టాకింగ్ స్టేజ్ వంటి క్లిష్టమైన డేటింగ్ పద్ధతుల్లో విసిగిపోయిన ఈ తరానికి ‘ఐకాంటాక్ట్‌షిప్’ ఎంతో హాయిగా అనిపిస్తుంది. ఇందులో అర్థం లేని సిగ్నల్స్ డీకోడ్ చేయాల్సిన పనిలేదు, మోసపోయే అవకాశం లేదు. అంతా మన నియంత్రణలోనే ఉంటుంది. మనకు నచ్చినట్లు ఊహించుకునే స్వేచ్ఛ ఉండటమే దీనికి ఇంత క్రేజ్ రావడానికి ప్రధాన కారణం.
ఐకాంటాక్ట్‌షిప్ అనేది చాలా వరకు హానికరం కాని ఒక అందమైన పగటి కల మాత్రమే. ఆకర్షణను ప్రాసెస్ చేయడానికి మన మెదడు అనుసరించే ఒక సహజమైన పద్ధతి ఇది. అయితే, ఇది తరచుగా జరుగుతున్నా లేదా నిజమైన బంధాల కంటే ఊహాజనిత బంధాలే మీకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తున్నా, అప్పుడు కాస్త ఆలోచించాల్సిందే. నిజమైన సంభాషణలు మీ ఊహలను ఎక్కడ చెడగొడతాయో అనే భయంతో మీరు మనుషులను కలవడం మానేస్తుంటే, అది ఒక హెచ్చరికగా భావించాలి.
అపరిచితులతో కలిసే ఆ చిన్న చూపును ఒక మధురమైన జ్ఞాపకంగా లేదా చిన్నపాటి ఉత్సాహంగా ఆస్వాదించండి. అంతకు మించి దాని గురించి లోతుగా ఆలోచించి ఒత్తిడికి గురవ్వాల్సిన అవసరం లేదు. మనసును తేలికపరిచే ఇలాంటి ‘ఐకాంటాక్ట్‌షిప్స్’ మన దైనందిన జీవితంలో ఒక చిన్నపాటి మెరుపు లాంటివని గుర్తుంచుకుంటే చాలు!