
చుండ్రు వల్ల తలస్నానం చేస్తున్నప్పుడు తలలో దురదగా ఉండటం, చర్మం పొడిబారడం లాంటి సమస్యలు చాలా మందిని వేధిస్తాయి. ఇలాంటి సమస్యలను తగ్గించుకోవడానికి రసాయనాలు వాడకుండా.. ఇంట్లోనే దొరికే సహజ పదార్థాలను ఉపయోగించవచ్చు. చుండ్రును తగ్గించే కొన్ని ఇంటి చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కొబ్బరి నూనెలో కొద్దిగా నిమ్మరసం కలిపి ఈ మిశ్రమంతో తల చర్మానికి మర్దనా చేయాలి. ఇది చుండ్రును తగ్గించి తలపై బ్యాక్టీరియా లేకుండా చేస్తుంది. అలాగే తల దురదను కూడా తగ్గిస్తుంది. మర్దనా చేసిన 30 నిమిషాల తర్వాత తల శుభ్రం చేసుకోవాలి.
మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం పేస్ట్ లా చేసి తలపై రాసుకోవడం చుండ్రును తగ్గిస్తుంది. మెంతుల్లో ఉండే యాంటీ ఫంగల్ గుణాలు తల చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఈ పేస్ట్ ను 30 నిమిషాలు ఉంచి తర్వాత శుభ్రం చేసుకోవడం మంచిది.
టీ ట్రీ ఆయిల్ ని కొబ్బరి నూనెలో కలిపి తలకు రాసుకోవడం వల్ల చుండ్రును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది తల చర్మంపై బ్యాక్టీరియాలను నివారించి. చర్మ సమస్యలను తగ్గిస్తుంది.
తాజా కలబందను పేస్ట్ లా చేసి తలపై అప్లై చేస్తే తల చర్మం శుభ్రపడి చుండ్రు తగ్గుతుంది. ఇది తల చర్మం పొడిబారకుండా కూడా చూస్తుంది.
పెరుగును తల చర్మానికి పట్టించి 20 నిమిషాలు ఉంచి తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు సమస్యలు తగ్గుతాయి. పెరుగులోని ఆమ్ల గుణాలు తల చర్మాన్ని శుభ్రంగా ఉంచడంలో సహాయపడతాయి.
వేప ఆకులను నీటిలో ఉడకబెట్టి ఆ నీటితో తలస్నానం చేయడం వల్ల చుండ్రు సమస్యలు తగ్గుతాయి. వేప ఆకుల్లో ఉండే సహజ యాంటీ సెప్టిక్ గుణాలు తల చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి.
తేనెతో దాల్చిన చెక్క పొడిని కలిపి ఈ మిశ్రమాన్ని తలపై రాసుకోవడం చుండ్రును తగ్గిస్తుంది. ఇది బ్యాక్టీరియా పెరుగుదలను అరికట్టడంలో సహాయపడుతుంది.
ఉసిరి రసం లేదా పొడిని తలకు రాస్తే చుండ్రు తగ్గుతుంది. ఉసిరిలోని పోషకాలు తల చర్మం ఇన్ఫెక్షన్లు, దురదను నియంత్రిస్తాయి.
చుండ్రు సమస్య మళ్లీ రాకుండా ఉండాలంటే తల చర్మం శుభ్రతకు ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఈ సహజ పద్ధతులను క్రమం తప్పకుండా పాటించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. వారానికి కొన్ని సార్లు ఈ పద్ధతులను అనుసరించడం ద్వారా మీ తల చర్మం ఆరోగ్యంగా మారుతుంది.
(NOTE: పై చిట్కాలు ఉపయోగించే ముందు తప్పని సరిగా పాచ్ టెస్ట్ చేయండి. ఈ మిశ్రమాన్ని చేతి వెనుక భాగంలో లేదా చెవి వెనుక భాగంలో చిన్నగా రాసి ఎలాంటి అలర్జీ, దురద రాకపోతే మాత్రమే తలకు వాడాలి)