నిద్ర అనేది శరీరానికి చాలా అవసరం. ఒక్క రోజు సరిగ్గా నిద్రపోకపోయినా.. దాని ఎఫెక్ట్ చాలా చూపిస్తుంది. సరైన నిద్ర లేకపోతే.. మనిషి మనిషిలోనే ఉండడు. దీని వల్ల ఒత్తిడి, ఆందోళన వంటివి కూడా ఎక్కువ అవుతాయి. ఒక్కోసారి రాత్రి పూట నిద్ర సరిగ్గా పట్టదు. కానీ ఉదయం ఖచ్చితంగా ఆఫీస్‌కి వెళ్లాల్సి ఉంటుంది. దీంతో ఆఫీస్‌లో ఉండగానే మధ్యలో నిద్ర వస్తూ ఉంటుంది. ఒక్కోసారి మీకు మీటింగ్స్ ఉన్నప్పుడు కూడా నిద్ర ముంచుకు వస్తూ ఉంటుంది. కానీ పడుకోవడానికి వీలు ఉండదు. ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది. పని చేస్తున్నప్పుడు నిద్ర పోవడం దాదాపు అసాధ్యం అనే చెప్పాలి. మీరు నిద్రపోతున్నట్టు బాస్ చూస్తే.. మిమ్మల్ని మందలించడం ఖాయం. అంతేకాకుండా జాబ్ పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇలాంటి సమయంలో చాలా ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు. మరి ముఖ్యమైన సమయాల్లో నిద్ర రాకుండా ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మీకు ఆఫీస్‌లో ముఖ్యమైన మీటింగ్స్ ఉన్నప్పుడు.. రాత్రి పూట ఖచ్చితంగా నిద్ర పోయేలా చూడండి. నిద్ర కోసం ఓ షెడ్యూల్‌ని ఏర్పాటు చేసుకోండి. నిద్ర పోయే సమయంలో ఫోన్లకు, టీవీలకు దూరంగా ఉండండి. రాత్రి పూట 7 నుంచి 9 గంటలు నిద్రపోతే.. ఉదయం రీఫ్రెష్‌గా ఉండొచ్చు.
శారీరక శ్రమ మీ మొత్తం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉండటమే కాకుండా పగటి పూట మగతను దూరం చేస్తుంది. ఉదయం లేదా భోజన విరామ సమయంలో వాకింగ్ లేదా చిన్న పాటి వ్యాయామాలు చేయడం వల్ల నిద్రను దూరం చేసుకోవచ్చు. చిన్నపాటి ఎక్సర్ సైజులు చేయడం వల్ల.. శరీరంలో రక్త ప్రవాహాన్ని ప్రేరేపిస్తుంది. మీ మెదడు రక్త ప్రసరణకు సరిపడా ఆక్సిజన్ సరఫరా చేస్తుంది. దీంతో మీరు రోజంతా యాక్టీవ్‌గా ఉండొచ్చు.
మీరు పని చేసే ప్రదేశం ముందు మీకు సౌకర్యవంతంగా ఉండేలా ఏర్పాటు చేసుకోండి. చుట్టూ మీకు నచ్చిన వస్తువులను లేదా మొక్కలను ఉంచుకోవాలి. అంతే కాకుండా తగిన సూర్య కాంతి ప్రసరించేలా చూడండి. దీని వల్ల మీరు పరధ్యానానికి గురి కాకుండా ఉంటారు. నిద్ర మగత ఎగిరిపోతుంది. అప్పుడప్పుడు కళ్లను నీటితో కడుక్కోవడం చేస్తూ ఉండండి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు.