
పూరీ, పకోడీ, గారెలు వంటి వంటకాలను చాలా మంది ఇష్టంగా తింటారు. ఇవి రుచిగా, క్రిస్పీగా ఉండేలా ఎక్కువ నూనెలో వేపుతారు. అయితే వేపిన తర్వాత మిగిలిన నూనెను పారబోయలేం కదా అనే ఆలోచనతో దాన్ని మళ్లీ వంటల్లో వాడటం చాలా మందిలో సాధారణంగా కనిపించే అలవాటే. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది ఆరోగ్యానికి చాలా హానికరం. మళ్లీ వేడిచేసిన నూనెలో అనేక రసాయన మార్పులు జరుగుతాయి. దీని వల్ల విషపూరిత పదార్థాలు విడుదలై శరీరాన్ని దెబ్బతీస్తాయి.
నూనెను మళ్లీ మళ్లీ వేడి చేస్తే అందులోని కొవ్వు పదార్థాలు మారిపోతాయి. అవి హానికరమైన ట్రాన్స్‌ఫ్యాట్స్‌గా మారి గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తాయి. ఇది గుండెపోటు, రక్తనాళాల రంధ్రాలను తక్కువ చేసేందుకు కారణమవుతుంది. అంతేకాకుండా శరీరంలో ఫ్రీ రాడికల్స్ పెరిగి కణాలను దెబ్బతీస్తాయి. దీని ప్రభావంతో క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశముంది. తరచుగా మళ్లీ వేడిచేసిన నూనెలో వండిన ఆహారం తింటే, రక్తపోటు సమస్యలు కూడా వచ్చే అవకాశముంది.
ఇంకా మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే మళ్లీ వేడిచేసిన నూనెలో వండిన ఆహారంలో దుర్వాసన ఏర్పడుతుంది. ఇది ఆహారాన్ని తినడానికి అనువుగా ఉండకుండా చేస్తుంది. అంతేకాకుండా శరీరానికి హాని చేసే రసాయనాలు ఆహారంలో కలిసిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా మాంసాహారం వేపిన నూనెలో మరొకసారి వండడం అత్యంత ప్రమాదకరం. దీని వల్ల ఆహారంలో విషపూరిత పదార్థాలు పెరిగి అనేక రుగ్మతలకు దారి తీస్తాయి.
ఒక్కోసారి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే నూనెను మళ్లీ వాడొచ్చు. కానీ ఏ ఆహారం ఫ్రై చేశాం, ఏ నూనె వాడాం, ఎంతసేపు వేడిచేశాం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. సాధారణంగా మాంసాహారం వేపిన నూనెను తిరిగి వాడకూడదు. ఇతర పదార్థాలను ఫ్రై చేసిన నూనెను గరిష్టంగా మూడు సార్లు మాత్రమే ఉపయోగించాలి. ఎక్కువసార్లు వేడిచేసిన నూనెలో వండిన ఆహారం తింటే శరీరానికి హానికరమైన ప్రభావాలు ఉంటాయి.
వంట నూనెలను సురక్షితంగా ఉపయోగించేందుకు కొన్ని మార్గాలను పాటించాలి. ఫ్రై చేసిన నూనెను మళ్లీ వాడకుండా ఉండటం ఆరోగ్యానికి మంచిది. నూనెను తక్కువ వేడి చేయడం లేదా తక్కువ నూనెలోనే వంట చేయడం అలవాటు చేసుకోవాలి. ఒకే నూనెను మళ్లీ మళ్లీ వేడిచేయకుండా ఉండాలి. వాడిన నూనెలను పారబోసేయకుండా ఇతర వినియోగాలకు మార్చుకోవడం ఉత్తమమైన పరిష్కారం.