
మన రోజువారీ ఆహారంలో పాలు ఒక ముఖ్యమైన భాగం. అయితే ఆవు పాలు తాగాలా లేక గేదె పాలు తాగాలా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఈ రెండు రకాల పాలకు వాటి సొంత ప్రయోజనాలు ఉన్నాయి. కానీ అవి మన శరీరంపై చూపించే ప్రభావాలు వేర్వేరుగా ఉంటాయి. ముఖ్యంగా జీర్ణక్రియ, మూత్రపిండాల ఆరోగ్యానికి సంబంధించి ఏది మంచిదో తెలుసుకోవడం ముఖ్యం.
ఆవు పాలు: గేదె పాలతో పోలిస్తే ఆవు పాలలో కొవ్వు, ప్రోటీన్ తక్కువగా ఉంటాయి. అందుకే అవి తేలికగా ఉండి.. సులభంగా జీర్ణమవుతాయి. ఆవు పాలలో విటమిన్ ఎ కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎముకలు, కంటి ఆరోగ్యానికి చాలా మంచివి.
గేదె పాలు: గేదె పాలలో కొవ్వు, ప్రోటీన్ అధికంగా ఉంటాయి. అందుకే అవి మరింత క్రీమీగా, చిక్కగా ఉంటాయి. దీనిని జీర్ణం చేయడం కొంచెం కష్టం. అయితే శక్తి, కండరాల నిర్మాణానికి ఎక్కువ ప్రోటీన్ అవసరమయ్యే వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది.
మూత్రపిండాలకు: గేదె పాలలో అధిక ప్రోటీన్ కంటెంట్ మూత్రపిండాలపై ఒత్తిడిని పెంచుతుంది. ఇది ఇప్పటికే బలహీనంగా ఉన్న మూత్రపిండాలకు మరింత హాని కలిగించవచ్చు. అయితే ఆవు పాలు తేలికగా ఉండటం వల్ల మూత్రపిండాలపై ఎటువంటి ఒత్తిడి ఉండదు. అందుకే వైద్యులు కిడ్నీ రోగులకు ఆవు పాలు తాగమని ఎక్కువగా సిఫార్సు చేస్తారు.
జీర్ణక్రియకు: పాలు తాగిన తర్వాత బరువుగా అనిపించడం, గ్యాస్ లేదా అజీర్తి వంటి సమస్యలు ఉన్నవారికి ఆవు పాలు మంచి ఎంపిక. ఇది త్వరగా జీర్ణమవుతుంది. మీరు ఆరోగ్యంగా ఉండి, జీర్ణ సమస్యలు లేకపోతే గేదె పాలు కూడా తాగవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..