ఆవు పాలు vs బర్రె పాలు.. దేనిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది..?
క్యాల్షియం అంటే పాలు మాత్రమే అనే భావన చాలామందిలో ఉంది. అయితే నువ్వులు, కరివేపాకు, పొన్నగంటి కూర, మునగాకు, తోటకూర, మెంతికూర, రాగులు, ఉలవలు వంటి అనేక ఆహారాల్లో పాల కంటే ఎక్కువ క్యాల్షియం లభిస్తుంది. ముఖ్యంగా నువ్వులు క్యాల్షియం సమృద్ధిగా కలిగిన ఆహారాలలో ఒకటి. ఎముకల ఆరోగ్యానికి క్యాల్షియంతో పాటు విటమిన్-డి కూడా అత్యంత కీలకం

క్యాల్షియం అనేది మన శరీరానికి, ముఖ్యంగా ఎముకల ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమైన పోషకం. అయితే, క్యాల్షియం అంటే పాలు మాత్రమే అనే అపోహ చాలా మందిలో ఉంది. అది కరెక్ట్ కాదు.. అనేక ఆహార పదార్థాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పాల కంటే అధిక క్యాల్షియం ఉన్న, తక్కువ ఖర్చులో లభించే అనేక ఇతర ఆహార పదార్థాలు ఏంటి..? నిపుణులు ఏం చెబుతున్నారో ఈ కథనంలో తెలుసుకుందాం..
రోజువారీ క్యాల్షియం అవసరాలు:
శరీరానికి వయసును బట్టి క్యాల్షియం అవసరాలు మారుతాయి. 21 సంవత్సరాలు పైబడిన పెద్దలకు రోజుకు 450 మిల్లీగ్రాములు క్యాల్షియం అవసరం. ఎదుగుదల వయసులో ఉన్న 20 సంవత్సరాల లోపు పిల్లలకు 600 మిల్లీగ్రాములు, గర్భిణులకు, బాలింతలకు రోజుకు 900 మిల్లీగ్రాముల క్యాల్షియం తప్పనిసరి.
పాలలోని క్యాల్షియం:
సాధారణంగా, 100 గ్రాముల చిక్కటి ఆవుపాలలో సుమారు 128 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. గేదెపాలు చిక్కగా ప్యూర్‌గా ఉంటే.. 170 నుంచి 210 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. అయితే. అమ్మేటప్పుడు నీరు కలపడం వల్ల, వాటిలో కూడా సుమారు 120 మిల్లీగ్రాముల క్యాల్షియం మాత్రమే లభిస్తుందని పేర్కొంటున్నారు నిపుణులు.. ఆవు పాలు, బర్రె పాలు రెండూ పోషకాహార పరంగా మంచి ఆహారాలే. అయితే కాల్షియం పరంగా చూస్తే బర్రె పాలలో కొంచెం ఎక్కువ కాల్షియం ఉంటుంది.
మనకు కావాల్సిన క్యాల్షియం కోసం పెద్ద మొత్తంలో పాలు తాగడం ఆర్థికంగా భారమని, దానికంటే మెరుగైన ప్రత్యామ్నాయాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు..
పాల కంటే అధిక క్యాల్షియం గల ఆహారాలు (100 గ్రాములకు):
- గోరుచిక్కుడు: 130 మిల్లీగ్రాములు
- శనగలు: 202 మిల్లీగ్రాములు
- బాదం పప్పు: 230 మిల్లీగ్రాములు
- సోయాబీన్: 240 మిల్లీగ్రాములు
- ఉలవలు: 287 మిల్లీగ్రాములు
- రాగులు: 344 మిల్లీగ్రాములు
- గోంగూర: 344 మిల్లీగ్రాములు
- మెంతికూర: 395 మిల్లీగ్రాములు
- తోటకూర: 397 మిల్లీగ్రాములు
- ఎండుకొబ్బరి: 400 మిల్లీగ్రాములు
- మునగాకు: 440 మిల్లీగ్రాములు
- పొన్నగంటి కూర: 510 మిల్లీగ్రాములు (పాల కంటే 4-5 రెట్లు ఎక్కువ)
- కరివేపాకు: 830 మిల్లీగ్రాములు
- నువ్వులు: 1450 మిల్లీగ్రాములు (పాల కంటే 13 రెట్లు ఎక్కువ)
నువ్వుల ప్రాముఖ్యత:
నువ్వులు అత్యధిక క్యాల్షియం కలిగిన ఆహారాలలో ఒకటి. మన పూర్వీకులు అమ్మాయిలు పెద్ద మనుషులైనప్పుడు నువ్వుల ఉండలు, గర్భిణులకు చిమ్మిలి ఉండలు ఇవ్వడం వెనుక ఇదే కారణం. 30-35 గ్రాముల నువ్వుల ఉండ (ఒక నిమ్మకాయ సైజు) ఒక పిల్లవాడికి అవసరమైన 600 మిల్లీగ్రాముల క్యాల్షియంను అందిస్తుంది. దీనికి అయ్యే ఖర్చు సుమారు 5-6 రూపాయలు మాత్రమే. ఆకుకూరలు, కరివేపాకు పొడి వంటివి రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా కూడా తక్కువ ఖర్చులో పుష్కలంగా క్యాల్షియం పొందవచ్చు.
విటమిన్ డి ప్రాముఖ్యత:
క్యాల్షియం శరీరానికి సరిగ్గా అందాలంటే విటమిన్ డి అత్యవసరం. విటమిన్ డి లోపం ఉంటే, మనం తీసుకున్న క్యాల్షియం వృధా అవుతుంది. కాబట్టి, విటమిన్ డి స్థాయిలను పరీక్షించుకుని, అవసరమైతే ఎండలో కూర్చోవడం లేదా విటమిన్ డి సప్లిమెంట్లను తీసుకోవడం మంచిది.
క్యాల్షియం కోసం పాలపై, క్యాల్షియం మాత్రలపై ఆధారపడటం మానేసి, నువ్వులు, వివిధ రకాల ఆకుకూరలు వంటి సహజమైన, సమృద్ధిగా క్యాల్షియం లభించే ఆహారాలను మన రోజువారీ భోజనంలో భాగం చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే.. ఏమైనా సందేహాలున్నా.. సమస్యలున్నా.. నేరుగా నిపుణులను సంప్రదించడం మంచిది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
