Self Growth: మాట విలువ తెలుసుకోండి.. ఒక్క మాట ఎంత నష్టం చేస్తుందో తెలుసా?

Personality Development: ఒకరి గురించి మరొకరి దగ్గర చెడుగా మాట్లాడే ముందు ఆలోచించాలి.. ఎందుకంటే మాటలు తిరిగి తీసుకోలేం. ముందు వెనుక ఆలోచించకుండా ఏమైనా మాట్లాడితే..ఎదుటి వ్యక్తిపై దాని ప్రభావం మీరు ఊహించిన దాని కంటే ఎక్కువగా ఉండే అవకాశముంది. ఆ వ్యక్తి మనస్సును తీవ్రంగా గాయపరిచే అవకాశం ఉంది.

Self Growth: మాట విలువ తెలుసుకోండి.. ఒక్క మాట ఎంత నష్టం చేస్తుందో తెలుసా?
Self Growth

Updated on: Aug 19, 2026 | 6:50 PM

కాలు జారితే తీసుకోవచ్చు, కానీ నోరు జారితే వెనక్కి తీసుకోలేం అనేది బాగా ప్రచారంలో ఉన్న ఒక పెద్ద సామెత. ఆలోచించకుండా మాట్లాడితే వచ్చే నష్టాలు, దాన్ని సరిదిద్దుకోవడం ఎంత కష్టమో ఇది తెలియజేస్తుంది. మనం మాట్లాడే మాటలు ఇతరుల మనసుపై చాలా ప్రభావం చూపుతాయి. కోపంలో లేదా ఆలోచించకుండా మాట్లాడిన మాటలు ఎదుటివారిని బాధించవచ్చు. అందుకే నాలుకకు పదునెక్కువ? అంటుంటాము. ఒకరినుద్దేశించి ఏదైనా మాట్లాడే ముందు ఆ మాటలు అవసరమా, అవి ఇతరులను బాధిస్తాయా అని ఆలోచించాలి. మాట విలువ గురించి చెప్పే ఓ కథను ఇప్పుడు చూద్దాం..

ఒక గ్రామంలో ఓ వృద్ధుడు తన పొరుగింట్లో ఉండే యువకుడి గురించి తప్పుడు ప్రచారం చేశాడు. అతను దొంగ అని గ్రామంలో అందరికీ చెప్పాడు. స్థానికంగా ఓ దొంగతనం జరిగింది. వృద్ధుడి మాటలు నమ్మిన కొందరు స్థానికులు.. యువకుడిపై అనుమానం వ్యక్తం చేయడంతో అతను అరెస్టయ్యాడు. అయితే విచారణలో యువకుడు నిర్దోషి అని తేలింది. దీంతో అతడు తీవ్రంగా అవమానానికి గురై, తనపై తప్పుడు ఆరోపణలు చేసిన వృద్ధుడిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు.

కోర్టులో వృద్ధుడు తన మాటలను తేలిగ్గా తీసుకున్నాడు.’నేను కేవలం కొన్ని మాటలే అన్నాను.. ఎవరినీ నష్టపరచాలని అనుకోలేదు’ అని చెప్పాడు. అప్పుడు న్యాయమూర్తి అతనికి ఓ చిన్న పని అప్పగించారు. యువకుడి గురించి తాను చెప్పిన మాటలన్నింటినీ ఓ కాగితంపై రాసి, ఆ కాగితాన్ని చిన్న చిన్న ముక్కలుగా చించి ఇంటికి వెళ్లే మార్గంలో గాలిలోకి విసిరేయాలని చెప్పారు. మరుసటి రోజు ఆ కాగితపు ముక్కలన్నింటినీ తిరిగి సేకరించి తీసుకురావాలని ఆదేశించారు. వృద్ధుడు ఎంత ప్రయత్నించినా వాటిని తిరిగి సేకరించలేకపోయాడు. గాలి వాటిని ఎక్కడికో తీసుకెళ్లింది.

ఇవి కూడా చదవండి

అప్పుడు న్యాయమూర్తి అసలు విషయాన్ని వివరించారు. గాలిలో కలిసిపోయిన కాగితపు ముక్కలను తిరిగి సేకరించడం ఎంత కష్టమో.. ఒకసారి నోటి నుంచి బయటకు వచ్చిన మాటలను వెనక్కి తీసుకోవడం కూడా అంతే కష్టం. తప్పుడు మాటలు ఒక వ్యక్తి గౌరవాన్ని, ప్రతిష్ఠను దెబ్బతీయవచ్చు అన్నారు. చివరికి తన తప్పును తెలుసుకున్న వృద్ధుడు ఆ యువకుడికి క్షమాపణ చెప్పాడు.

నీతి: నిజం తెలియకుండా ఎవరి గురించి తప్పుడు మాటలు మాట్లాడకూడదు. మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. ఎందుకంటే మాటలు తిరిగి తీసుకోలేం.. కానీ వాటి ప్రభావం చాలా కాలం ఉంటుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us