Mobile Phone Charge: కారులో మొబైల్‌ ఛార్జ్‌ చేసే అలవాటు మీకూ ఉందా? డేంజర్‌ బాస్‌..

ఇంట్లో సాకెట్ నుంచి వచ్చే కరెంట్ స్థిరంగా ఉంటుంది. కానీ కారులో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. కారు శక్తి ఇంజిన్‌కు అనుసంధానించబడిన ఆల్టర్నేటర్ నుంచి వస్తుంది. మీరు ఇంజిన్ వేగాన్ని మార్చినప్పుడు లేదా హెడ్‌లైట్‌లను ఆన్ లేదా ఆఫ్ చేసినప్పుడు కారు పవర్‌లో పెద్ద మొత్తంలో హెచ్చుతగ్గులు వస్తాయి...

Mobile Phone Charge: కారులో మొబైల్‌ ఛార్జ్‌ చేసే అలవాటు మీకూ ఉందా? డేంజర్‌ బాస్‌..
Phone Charging In Car

Updated on: Jan 11, 2026 | 8:46 AM

నేటి వేగవంతమైన జీవనశైలిలో ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మీ ఫోన్‌ను ఛార్జ్ చేయడం మర్చిపోవడం సర్వసాధారణం. అలాంటి సందర్భాలలో, చాలా మంది ప్రయాణించేటప్పుడు తమ ఫోన్‌లను ఛార్జ్ చేస్తుంటారు. ఇక కారులో ప్రయాణించేవారైతే USB పోర్ట్‌పై ఆధారపడతారు. ఇది అనుకూలమైన పనిగా అనిపించవచ్చు.. కానీ మీ ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌కు ఈ అలవాటు చాలా ప్రమాదకరమని తెలుసా? అవును.. కారులో మీ ఫోన్‌ను ఛార్జ్ చేయడం వల్ల బ్యాటరీ జీవితకాలం ఎలా తగ్గుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇంట్లో సాకెట్ నుంచి వచ్చే కరెంట్ స్థిరంగా ఉంటుంది. కానీ కారులో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. కారు శక్తి ఇంజిన్‌కు అనుసంధానించబడిన ఆల్టర్నేటర్ నుంచి వస్తుంది. మీరు ఇంజిన్ వేగాన్ని మార్చినప్పుడు లేదా హెడ్‌లైట్‌లను ఆన్ లేదా ఆఫ్ చేసినప్పుడు కారు పవర్‌లో పెద్ద మొత్తంలో హెచ్చుతగ్గులు వస్తాయి. ఈ అస్థిర కరెంట్ ఫోన్ బ్యాటరీని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా బ్యాటరీ క్రమంగా బలహీనపడుతుంది. కార్ల USB పోర్ట్‌లు ప్రధానంగా మ్యూజిక్ సిస్టమ్‌లు లేదా డేటా బదిలీ కోసం వాడుతుంటారు. ఛార్జింగ్ కోసం కాదు. ఈ పోర్ట్‌ల అవుట్‌పుట్ సాధారణంగా 0.5 ఆంప్స్ వరకు ఉంటుంది. ఇంత తక్కువ పవర్‌తో ఫోన్‌ను ఛార్జ్ చేయడానికి 4 గంటల కంటే ఎక్కువ సమయం పడుతుంది. ఎక్కువసేపు నెమ్మదిగా ఛార్జింగ్ చేయడం వల్ల ఫోన్ వేడిని ఉత్పత్తి చేస్తుంది. ఇది ఫోన్ బ్యాటరీ హానికరం.

ఇంజిన్ నడుస్తున్నప్పుడు చాలా మందికి తమ ఫోన్‌లను ప్లగ్ చేసే అలవాటు ఉంటుంది. ఇంజిన్ స్టార్ట్ చేసినప్పుడు పెద్ద విద్యుత్ ఉప్పెన (పవర్ స్పైక్) ఉత్పత్తి అవుతుంది. ఈ అధిక-వోల్టేజ్ కరెంట్ ఛార్జర్ ద్వారా నేరుగా ఫోన్‌కి వెళ్లవచ్చు. ఇది ఫోన్ అంతర్గత సర్క్యూట్రీ లేదా బ్యాటరీని శాశ్వతంగా దెబ్బతీస్తుంది. వేసవిలో కారు లోపల ఉష్ణోగ్రత ఇప్పటికే ఎక్కువగా ఉంటుంది. ఫోన్ ప్రత్యక్ష సూర్యకాంతిలో ఉండి ఛార్జింగ్‌లో ఉంటే అది ఇంకా అధికంగా వేడెక్కుతుంది. ఇలా వేడెక్కడం వల్ల బ్యాటరీ సామర్థ్యం త్వరగా తగ్గిపోతుంది. దీనివల్ల బ్యాటరీ ఉబ్బిపోతుంది. అలాగే మీరు వాడుతున్న కారు పాతది అయితే ఇంజిన్ ఆఫ్‌లో ఉన్నప్పుడు మీరు మీ ఫోన్‌ను ఛార్జ్ చేస్తే, అది కారు బ్యాటరీని కూడా ప్రభావితం చేస్తుంది. ఫోన్‌ను ఛార్జ్ చేయడం వల్ల కారు బ్యాటరీ నుంచి ఎనర్జీ లభిస్తుంది. ఇది భవిష్యత్తులో కారును స్టార్ట్ చేయడం కష్టతరం చేస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇందుకోసం ఎల్లప్పుడూ బ్రాండెడ్, సర్టిఫైడ్ కార్ ఛార్జర్‌లను ఉపయోగించండి. అలాగే కారు ఇంజిన్‌ను స్టార్ట్ చేసిన తర్వాత మాత్రమే మీ ఫోన్‌ను ఛార్జ్ చేయండి. ఛార్జింగ్ చేస్తున్నప్పుడు ఫోన్‌ను సూర్యకాంతిలో లేదా డాష్‌బోర్డ్‌లో ఉంచవద్దు. అవసరమైతే తప్ప వీలైనంత వరకు కారులో ఫోన్‌ను ఛార్జ్ చేయకపోవడమే మంచిది.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ కథనాల కోసం క్లిక్‌ చేయండి.