
జ్వరం వచ్చినప్పుడు స్నానం చేయవచ్చా లేదా అనే విషయంలో చాలామందిలో సందేహాలు, అపోహలు ఉంటాయి. జ్వరం ఉన్నప్పుడు వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీర స్థితిని బట్టి సరైన జాగ్రత్తలు పాటిస్తూ స్నానం చేయడం వల్ల ఎటువంటి హానీ జరగదని వైద్యులు చెబుతున్నారు. వైద్యుల ప్రకారం జ్వరం ఉన్నప్పుడు స్నానం చేయడం పూర్తిగా నిషేధం కాదు. అయితే మీరు ఎలా స్నానం చేస్తున్నారు. నీటి ఉష్ణోగ్రత ఎంత ఉందనేది చాలా ముఖ్యం.
గోరువెచ్చని నీటితో స్నానం : స్వల్ప జ్వరం ఉన్నప్పుడు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల ఎంతో ఉపశమనం లభిస్తుంది. ఇది చర్మంపై ఉన్న చెమట, బ్యాక్టీరియాను తొలగించి శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుతుంది. అంతేకాకుండా మానసిక ప్రశాంతతను ఇచ్చి మంచి నిద్ర పట్టేలా చేస్తుంది.
చల్లని నీటితో స్నానం చేయకూడదు: జ్వరాన్ని తగ్గించడానికి కొందరు చల్లని నీటితో స్నానం చేస్తుంటారు. కానీ, ఇది చాలా ప్రమాదకరం. చల్లని నీరు పడటం వల్ల శరీరం వణకడం ప్రారంభిస్తుంది. ఇది అంతర్గతంగా శరీర ఉష్ణోగ్రతను మరింత పెంచుతుంది.
అతి వేడి నీటితోనూ ప్రమాదమే: చాలా వేడిగా ఉన్న నీటితో స్నానం చేయడం వల్ల రక్తనాళాలు వ్యాకోచించి శరీర ఉష్ణోగ్రత ఇంకా పెరుగుతుంది. కాబట్టి, మితిమీరిన వేడి నీటిని అస్సలు ఉపయోగించకూడదు.
స్పాంజ్ బాత్ ఒక సురక్షితమైన మార్గం: తీవ్రమైన జ్వరం లేదా విపరీతమైన నీరసం ఉన్నప్పుడు స్నానం చేయడానికి బదులుగా స్పాంజ్ బాత్ చేయడం ఉత్తమం. ఒక శుభ్రమైన కాటన్ గుడ్డను గోరువెచ్చని నీటిలో ముంచి, పిండి శరీరాన్ని ముఖ్యంగా నుదురు, మెడ, చంకలు, కాళ్ళు తుడవాలి. ఇది శరీర ఉష్ణోగ్రతను సురక్షితంగా తగ్గించడంలో బాగా సహాయపడుతుంది.
స్నానం చేసిన వెంటనే తడిని బాగా తుడిచి, పొడి దుస్తులు ధరించాలి. తలస్నానం చేయడం వీలైనంత వరకు నివారించడం మంచిది. లేదా తల ఆరబెట్టుకోవడం అత్యవసరం. ఫ్యాన్ లేదా ఏసీ గాలి నేరుగా తగలకుండా చూసుకోవాలి. జ్వరం ఉన్నప్పుడు శుభ్రత పాటించడం అవసరమే. కానీ, శరీర స్థితిని బట్టి గోరువెచ్చని నీటితో స్నానం చేయడం లేదా తడి గుడ్డతో తుడవడమే సరైన మార్గం. జ్వరం తీవ్రంగా ఉంటే మాత్రం వైద్యుడిని సంప్రదించి తగిన విశ్రాంతి తీసుకోవాలి.