
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చిన్న వయస్సులోనే జుట్టు రాలడం అనేది పురుషులలో ఒక పెద్ద ఆందోళనగా మారింది. జుట్టు రాలడం అనేది కేవలం వయస్సు మీద పడటం వల్లో లేదా వంశపారంపర్యంగానో వస్తుందని చాలామంది భావిస్తుంటారు. కానీ మన రోజువారీ ఆహారపు అలవాట్లు, ముఖ్యంగా మనం ఇష్టంగా తాగే తీపి పానీయాలు జుట్టు రాలడాన్ని వేగవంతం చేస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కూల్ డ్రింక్స్, ప్యాక్ చేసిన పండ్ల రసాలు, ఎనర్జీ డ్రింక్స్, ఫ్లేవర్డ్ షేక్స్ ఇప్పుడు యువత జీవనశైలిలో భాగమయ్యాయి. ఆర్‌ఎంఎల్ హాస్పిటల్ మెడికల్ విభాగం డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ సుభాష్ గిరి అభిప్రాయం ప్రకారం.. ఈ డ్రింక్స్‌లో ఉండే అత్యధిక చక్కెర శరీరంలోని హార్మోన్ల వ్యవస్థను దెబ్బతీస్తుంది. ఇది తల చర్మం ఆరోగ్యంపై ప్రభావం చూపి, జుట్టు మూలాలను బలహీనపరుస్తుంది.
అధిక చక్కెర వల్ల శరీరం జుట్టుకు అవసరమైన విటమిన్లు, ఖనిజాలను సరిగ్గా గ్రహించదు. పోషకాలు అందక జుట్టు పల్చబడటం ప్రారంభమవుతుంది. చక్కెర పానీయాలు శరీరంలో మంటను పెంచి చుండ్రు, స్కాల్ప్ ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయి. మీరు ఇప్పటికే జుట్టు రాలడం లేదా పల్చబడటం వంటి సమస్యలను ఎదుర్కొంటుంటే.. ఈ మార్పులు తప్పనిసరి..
తీపికి దూరం: కూల్ డ్రింక్స్, సోడాలు, ప్యాక్ చేసిన జ్యూస్‌లను క్రమంగా తగ్గించి, పూర్తిగా మానేయడానికి ప్రయత్నించండి.
ప్రత్యామ్నాయాలు ఎంచుకోండి: వీటికి బదులుగా స్వచ్ఛమైన నీరు, కొబ్బరి నీళ్లు లేదా పంచదార లేని తాజా పండ్ల రసాలను తీసుకోండి.
పౌష్టికాహారం: మీ ఆహారంలో ప్రోటీన్, పండ్లు, ఆకుకూరలు, తృణధాన్యాలు ఉండేలా చూసుకోండి.
జీవనశైలి మార్పులు: ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా లేదా ధ్యానం చేయండి. ప్రతిరోజూ కనీసం 7-8 గంటల గాఢ నిద్ర జుట్టు ఆరోగ్యానికి చాలా ముఖ్యం.
జుట్టు రాలడం ప్రారంభమైనప్పుడు కేవలం షాంపూలు, నూనెలు మార్చడం కంటే.. లోపలికి తీసుకునే ఆహారంపై దృష్టి సారించడం ముఖ్యం. తీపి పానీయాలకు స్వస్తి చెప్పి, ఆరోగ్యకరమైన అలవాట్లను అలవరచుకోవడం ద్వారా జుట్టును రక్షించుకోవచ్చు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..