
మామిడి సీజన్ వచ్చిందంటే చాలు.. ఆ మధుర ఫలాలను చూసి నోరు ఊరని వారుండరు. కానీ మధుమేహ వ్యాధిగ్రస్తులు మాత్రం అబ్బే మామిడి తింటే షుగర్ లెవల్స్ పెరిగిపోతాయి అనే భయంతో ఆ అమృతాన్ని దూరం పెడుతుంటారు. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇప్పుడు ఒక తీపి కబురు అందింది. మామిడి పండ్లు తినడం వల్ల షుగర్ పెరగడం పక్కన పెడితే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని తాజా పరిశోధనలు చెబుతున్నాయి.నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. టైప్-2 డయాబెటిస్ ఉన్నవారు సరైన పద్ధతిలో మామిడి తింటే అది వారి ఆరోగ్యానికి మేలు చేస్తుందని తేలింది.
సుమారు ఎనిమిది వారాల పాటు నిర్వహించిన ఈ అధ్యయనంలో పరిశోధకులు కొన్ని ఆసక్తికరమైన అంశాలను గుర్తించారు. రోజువారీ అల్పాహారంలో కేలరీలు, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారానికి బదులుగా మామిడిని తీసుకున్న వారిలో చక్కెర స్థాయిలు పెరగకపోగా, నియంత్రణలో ఉన్నట్లు గమనించారు. మామిడి తినడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరిగి గుండె ఆరోగ్యం మెరుగుపడిందని తేలింది. సరైన పరిమాణంలో తీసుకున్నప్పుడు ఇది బరువు పెరగకుండా చేయడంలో కూడా సహాయపడింది.
మామిడి పండు తింటే షుగర్ పెరుగుతుందా లేదా అనేది మీరు ఎంత తింటున్నారు, ఎలా తింటున్నారు..? అనే దానిపై ఆధారపడి ఉంటుంది.
మామిడి కేవలం రుచికి మాత్రమే కాదు, ఇది పోషకాల గని కూడా..
విటమిన్లు: విటమిన్ A, C, B6 పుష్కలంగా ఉంటాయి.
ఖనిజాలు: పొటాషియం, ఐరన్ లభిస్తాయి.
యాంటీఆక్సిడెంట్లు: శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే యాంటీఆక్సిడెంట్లు ఇందులో మెండుగా ఉన్నాయి.