
ఈ రోజుల్లో చాలా మంది డయాబెటిస్ తో బాధపడుతున్నారు. యువకులు, వృద్ధులు సహా లక్షలాది మంది దీనితో ఇబ్బంది పడుతున్నారు. డయాబెటిస్ అనేది దీర్ఘకాలిక వ్యాధి. దీనిలో రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయి. శరీరం తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయనప్పుడు లేదా ఉన్న ఇన్సులిన్ ను సరిగ్గా ఉపయోగించలేనప్పుడు ఇది సంభవిస్తుంది. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు తాము తినే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇలాంటి సందర్భాలలో చాలా మందికి చాలా సందేహాలు ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారు చేపలు తినవచ్చా అనే ప్రశ్న తరచుగా తలెత్తుతుంది. అయితే.. దీనిపై వైద్యులు పూర్తి స్పష్టత ఇస్తున్నారు. దీని గురించి వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.
డయాబెటిస్ ఉన్నవారికి చేపలు తినడంలో ఎటువంటి సమస్య లేదని, వాస్తవానికి ఇది లీన్ ప్రోటీన్ అద్భుతమైన మూలం అని వైద్య నిపుణులు అంటున్నారు. విటమిన్ డి, ఐరన్ వంటి అనేక విలువైన పోషకాలతో చేపలు సమృద్ధిగా ఉంటాయి. ఈ పోషకాలు శరీరానికి చాలా అవసరం. కండరాలను బలోపేతం చేయడంలో చేపలు ఉపయోగపడతాయని చెబుతారు.
చేపలను వండే పద్ధతి దాని పోషక విలువలను కాపాడుకోవడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అధిక ఉష్ణోగ్రతల వద్ద ఉడికించడం వల్ల చేపలలోని విటమిన్లు, ఖనిజాలు నశిస్తాయి. కాబట్టి, తక్కువ వేడి మీద కుండలో ఉడికించడం ఆరోగ్యకరమైన ప్రక్రియ. అలాగే, చేపల కూరలో నూనె వాడకం గురించి జాగ్రత్తగా ఉండండి. సాధారణంగా, చేపల కూరలో చాలా నూనె వాడతారు. కానీ, మీరు వీలైనంత తక్కువ నూనెతో వండేందుకు ప్రయత్నించాలి.
చేపల పులుసులో ఉపయోగించే సుగంధ ద్రవ్యాలు కూడా కొంత పోషక విలువలను కలిగి ఉంటాయి. కొన్ని సుగంధ ద్రవ్యాలలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. అయితే, సుగంధ ద్రవ్యాలు, ముఖ్యంగా మిరపకారం, ఉప్పును మితంగా వాడాలి. కారం ఎక్కువగా వాడటం వల్ల అసిడిటీ, గ్యాస్ట్రిటిస్ వంటి జీర్ణ సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏదైనా ఆహారాన్ని మితంగా తీసుకోవడం ముఖ్యం. డయాబెటిస్ ఉన్నవారు చేపలను సరిగ్గా ఉడికించి, మితంగా తీసుకోవడం ద్వారా పూర్తి పోషక ప్రయోజనాలను పొందవచ్చని వైద్య నిపుణులు అంటున్నారు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..