
వయసు 94.. సంపద సుమారు రూ. 86 లక్షల కోట్లు. ప్రపంచ దిగ్గజ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ పరిచయం అక్కరలేని పేరు. కోక్, ఐస్ క్రీంలు వంటివి అమ్ముతూ తన జీవితాన్ని మొదలు పెట్టిన వారెన్ ఇప్పుడు ఏకంగా ట్రిలియన్ కోట్ల సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు. బెర్క్ షైర్ హత్ వే వంటి కంపెనీలను స్థాపించి నెంబర్ వన్ స్థానానికి అతి తక్కువ కాలంలోనే ఎదిగాడు. చిన్ననాటి నుంచే పెట్టుబడులపై ఇష్టం పెంచుకున్న ఇతడు అంచెలంచెలుగా ఎదిగాడు. ఇప్పుడు కోట్లకు పడగలెత్తాడు. దీనికి ప్రధాన కారణం వారెన్ బఫెట్ వ్యాపార సూత్రాలే కాదు అతడి మెంటల్ స్టామినా కూడా. తన బుర్రను ఉపయోగించి స్టాక్ మార్కెట్లలో లాభాలు రాబట్టడం ఎలాగో తెలుసుకున్నాడు. ఈ వయసులోనూ అంతే పదునుగా ఆలోచించగలడు. దీనికి కారణం తన అలవాట్లే అంటాడు. మరి ఆయనలా మీరు కూడా బాగా డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారా? అయితే మరెందుకు ఆలస్యం. ఆయన చెప్పిన 5 బ్రెయిన్ టెక్నిక్స్ గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం రండి.
చాలా మంది సీఈవోలు ఉదయం 4 గంటలకే నిద్రలేవడం గురించి ఎంతో గొప్పగా చెప్తుంటారు. కానీ వారెన్ బఫెట్ మాత్రం రోజుకి కచ్చితంగా 8 గంటలు నిద్రపోతాడట. నాకు ఉదయం నాలుగు గంటలకే లేచి పనికి వెళ్లిపోవాలనే కోరికేం ఉండదు. అని అతడు 2017లో ఒక సందర్భంలో చెప్పాడు. సైన్స్ కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తుంది. మంచి నిద్ర దీర్ఘాయుష్షును పెంచుతుంది.
ట్రిలియన్ డాలర్ల కంపెనీలను నిర్వహించే ఈ బిలియనీర్ ఇప్పటికీ బుర్రకు పదును పెట్టే ఆటలంటే తెగ ఇష్టపడతాడట. అందరిలా బిట్ కాయిన్లు గట్రా అంటూ ఎంతసేపు బిజినెస్ మీద మనసు పెట్టకుండా బ్రిడ్జ్ లాంటి ఆటలు ఆడటం తనకెంతో ఇష్టమని ఇది మెదడుకు మంచి వ్యాయామమని వారెన్ తెలిపాడు.
మన మొహమాటమే మన శత్రువంటాడు ఈ బిజినెస్ మ్యాన్. తాను రోజూ ఎన్నో సమావేశాలకు వెళ్లాల్సి ఉంటుందని తెలిపాడు. అయితే, తకు వెళ్లడం ఇష్టం లేకపోతే మాత్రం నో చెప్పేందుకు వెనకాడడట. తనకు సమావేశాల కంటే కూడా ఖాళీగా దొరికే కాస్త సమయమే ఎక్కువ విలువైందని చెప్తాడు. బిల్ గేట్స్ కూడా వారెన్ బఫెట్ విధానాన్ని సమర్థిస్తాడు.
వారెన్ బఫెట్ తన సమయాన్ని ఎక్కువ శాతం పుస్తకాలు చదివేందుకే ఇష్టపడతాడట. తన రోజులో కనీసం 6 గంటలు రీడింగ్ కోసం కేటాయిస్తానని అతడు చెప్పిన మాటలు నిజంగానే ఆశ్చర్యపరుస్తాయి. అలాగే నిరంతరం వ్యాపారం లేదా పెట్టుబడి గురించి ఆలోచించడం తనను సంతోషంగా ఉంచుతుందని బికమింగ్ వారెన్ బఫెట్ పుస్తకంలో రాసుకొచ్చాడు. క్రమం తప్పకుండా పుస్తకాలు చదివే అలవాటే తననెప్పుడూ మానసికంగా చురుగ్గా ఉంచుతుందని తెలిపాడు. ఇది మెదడుకు పదును పెట్టి ఆలోచనల్లో మరింత క్లారిటీనిస్తుందని పరిశోధకులు కూడా చెప్తున్నారు.
మనకు జీవితం ఎన్నో ఇచ్చింది. మన మీద ఆధారపడి ఉన్న కుటుంబం, ఉద్యోగులు, మన కోసం పనిచేస్తున్నవారు ఇలా ఎంతో మందిని నడిపించాల్సిన అవసరం ఉంటుంది. ఇంత చక్కటి జీవితాన్ని ఏది పడితే అది తిని నాశనం చేసుకోవడం సరికాదని బఫెట్ నమ్ముతాడు. సమతులాహారం తీసుకోవడంలోనే అంతా ఉందంటాడు.