Social Media Tips: పొరపాటున కూడా ఇవి షేర్ చేయకండి.. మీ పరువు పోవడం ఖాయం!
సోషల్ మీడియాలో మనం చేసే ప్రతి పోస్ట్, లైక్, షేర్, కామెంట్ మన గురించి ఒక అభిప్రాయాన్ని కలిగిస్తుంది. వీటి ద్వారా మన స్వభావాన్ని ఇతరులు ఈజీగా లెక్కించేస్తారు. హుందాతనం అనేది కేవలం దుస్తుల్లో లేదా మాటల్లో మాత్రమే కాదు.. ఆన్‌లైన్‌లో మన ప్రవర్తనలో కూడా కనిపిస్తుంది. సోషల్ మీడియాలో వ్యక్తిగత గౌరవం, ఇతరుల గోప్యత, సానుకూల దృక్పథం వంటి విలువలను పాటిస్తే మీ వ్యక్తిత్వంపై ఇతరుల మదిలో మంచి ముద్ర అభిప్రాయాన్ని ఏర్పరచుకోవచ్చు. చెత్త కామెంట్లు, దిగజారుడు పోస్ట్‌లు పెడితే మీ పరువు, ప్రతష్టలు మసకబారుతాయి..

సోషల్ మీడియా.. ఇప్పుడిది ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. ఉదయం నిద్రిలేచింది మొదలు.. రాత్రి నిద్రపోయే వరకు గంటల తరబడి సోషల్ మీడియాలో గడుపుతున్నారు. అయితే ఇన్‌స్టా, ఫేస్‌బుక్, ఎక్స్ తదితర సోషల్ మీడియా వేదికలపై మనం చేసే ప్రతి పోస్ట్, లైక్, కామెంట్, షేర్ మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. హుందాగా, సభ్యతగా ఉండే వ్యక్తులకు సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేయాలో.. ఏం పోస్ట్ చేయకూడదో బాగా తెలుసు. డిజిటల్ ప్రపంచంలో కూడా మర్యాద, గౌరవం, ప్రైవసీలకు విలువ ఇచ్చే వారు కొన్ని విషయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సోషల్ మీడియాలో షేర్ చేయరు. కొందరు ముందు వెనుక ఆలోచించకుండా సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు, కామెంట్స్, రీషేరింగ్‌తో ఆ తర్వాత ఇబ్బందులపాలవుతున్నారు. హుందాతనం కలిగిన వారు సోషల్ మీడియాలో ఫాలో అయ్యే.. అలాంటి ఐదు ముఖ్యమైన అలవాట్లు ఏమిటో తెలుసుకుందాం..
1.వ్యక్తిగత గొడవలను సోషల్ మీడియాలో పెట్టరు
కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా సహోద్యోగులతో ఏర్పడిన విభేదాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం హుందాతనం కాదు. నిజంగా పరిపక్వత కలిగిన వ్యక్తులు సమస్యలను నేరుగా మాట్లాడి పరిష్కరించుకోవడానికే ప్రాధాన్యం ఇస్తారు. సానుభూతి కోసం లేదా ఇతరులను తప్పుబట్టేందుకు సోషల్ మీడియాను వేదికగా మార్చుకోరు.
2.సంపదను ప్రదర్శిస్తూ గొప్పలు చెప్పుకోరు
ఖరీదైన కార్లు, బ్రాండెడ్ వస్తువులు, విలాసవంతమైన జీవనశైలిని సోషల్ మీడియాలో పదేపదే చూపిస్తూ ఇతరులను ఆకట్టుకోవాలని ప్రయత్నించరు. నిజమైన విజయాన్ని షో ఆఫ్స్‌తో కాకుండా తమ వ్యక్తిత్వంతో చాటుకోవాలని వారు నమ్ముతారు.
3.ఇతరుల ప్రైవసీని గౌరవిస్తారు
స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా సహోద్యోగుల ఫోటోలు, వ్యక్తిగత వివరాలు వారి అనుమతి లేకుండా సోషల్ మీడియాలో పోస్ట్ చేయరు. ఇతరుల వ్యక్తిగత ప్రైవసీని గౌరవించడం మంచి సంస్కారానికి నిదర్శనమని భావిస్తారు. హుందాతనం కలిగిన వారు ఇతరులు వ్యక్తిగత వివరాలను సోషల్ మీడియాలో షేర్ చేసి.. వారిని అసౌకర్యానికి గురిచేసే చర్యలకు దూరంగా ఉంటారు.
4.నెగెటివ్ పోస్టులు, ట్రోలింగ్‌కు దూరం
ఎవరినైనా అవమానించే పోస్టులు పెట్టడం, ట్రోలింగ్ చేయడం లేదా అనవసరమైన వాదనల్లో పాల్గొనడం హుందాతనం కలిగిన వ్యక్తుల స్వభావం కాదు. సోషల్ మీడియాలో సానుకూల వాతావరణాన్ని కొనసాగించేందుకు ప్రయత్నిస్తారు. ఇతరులను గౌరవిస్తూ హుందాగా నడుచుకుంటారు.
5. జీవితంలోని ప్రతి చిన్న విషయాలు పంచుకోరు
ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియాలో అప్‌డేట్ చేయాల్సిన అవసరం లేదని వారు భావిస్తారు. వ్యక్తిగత జీవితం, డిజిటల్ జీవితం మధ్య సమతుల్యతను కాపాడుకుంటారు.
సోషల్ మీడియాలో హుందాతనం ఎందుకు ముఖ్యం?
డిజిటల్ ప్రపంచంలో ఒకసారి పోస్ట్ చేసిన సమాచారం చాలా కాలం వరకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అందుకే ఆలోచించి పోస్ట్ చేయడం, ఇతరుల గౌరవాన్ని కాపాడడం, గోప్యతకు విలువ ఇవ్వడం చాలా ముఖ్యం. ఇవి మీ వ్యక్తిత్వాన్ని మరింత హుందాగా, బాధ్యతాయుతంగా చూపిస్తాయి.
