అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా ఎన్నో సమస్యలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా బరువు పెరగడం అనేది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ పెద్ద సమస్యగా ఉంది. చాలామంది తమ బరువు తగ్గించుకోవడానికి రకరకాల చర్యలు తీసుకుంటారు. కొందరు జిమ్‌లో వర్కవుట్లు చేస్తారు.. మరికొందరు డైట్లను అనుసరిస్తారు. అయితే, కొందరికి మాత్రమే ఫలితాన్నిస్తుంది.. మరికొందరు మాత్రం యాథావిధిగా అదే బరువుతో బాధపడుతుంటారు. దీనికి కారణం వారు అనుసరించిన బరువు తగ్గించే పద్ధతిపై కూడా ఆధారపడి ఉంటుంది. ఇంకా ప్రతి ఒక్కరి శరీర నిర్మాణం భిన్నంగా ఉండడం కూడా కారణమేనని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. అందువల్ల, బరువు తగ్గించే చర్యల ప్రభావం ప్రతి ఒక్కరిపై భిన్నంగా ఉంటుంది. అయితే.. మీరు కూడా శరీర బరువును తగ్గించాలని అనుకుంటుంటే.. ఈ 5 హోం రెమెడీస్ అద్భుతంగా పనిచేస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. వీటిని రోజూ ఉదయం చేయడం వల్ల మీ బరువు స్వయంచాలకంగా తగ్గుతుంది. అదే సమయంలో ఈ చర్యలను రోజూ పాటిస్తే.. శరీరం ఆకృతిని పొందేందుకు ఎక్కువ సమయం కూడా పట్టదని పేర్కొంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రతిరోజూ మీరు ఉదయం నిద్రలేవగానే.. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగడం అలవాటు చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీ శరీరంలోని అంతర్గత జీర్ణవ్యవస్థ చక్కగా ఉంటుంది. పొట్ట కూడా సరిగ్గా శుభ్రమవుతుంది. గోరువెచ్చని నీటిని తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి.
ఫ్రెష్ అయ్యాక రోజూ కనీసం అరగంట పాటు యోగా చేయడం అలవాటు చేసుకోండి. ముఖ్యంగా యోగాలో సూర్య నమస్కారాలు చేయండి. ఈ వ్యాయామం శరీరంలోని 13.91 కేలరీలను బర్న్ చేస్తుంది. అటువంటి పరిస్థితిలో, మీరు రోజూ 30 నిమిషాలపాటు యోగా, సూర్య నమస్కారాలు చేయడం వల్ల 270-280 కేలరీల బర్న్ చేయవచ్చు. దీని వల్ల పెరిగిన బరువు త్వరలోనే నియంత్రణలోకి వస్తుంది. ఇంకా నడకను అలావాటు చేసుకోవడం, వ్యాయామం చేయడం మంచిది.
శరీర బరువును సమతుల్యంగా ఉంచడంలో మీ అల్పాహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీని కోసం మీరు ప్రోటీన్ కలిగిన తేలికపాటి అల్పాహారం తీసుకోండి. అటువంటి అల్పాహారం మీ కడుపుని చాలా కాలం పాటు నిండుగా ఉంచుతుంది. దీని కారణంగా మీకు త్వరగా ఆకలి అనిపించదు. ఇంకా అతిగా తినకుండా ఉంటారు. మీకు కావాలంటే ఉదయం అల్పాహారంలో గుడ్లు, పోహా, గింజలు లేదా మొలకెత్తిన తృణధాన్యాలను తీసుకోవచ్చు.
శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవాలంటే తగినంత సూర్యరశ్మిని పొందడం అవసరం. ఈ సూర్యరశ్మి పెరిగిన కొవ్వును తగ్గించి శరీరాన్ని ఫిట్‌గా ఉంచడానికి పనిచేస్తుంది. సూర్యుని కిరణాలు చర్మం లోపల కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి. అందువల్ల, వీలైనంత వరకు, ప్రతిరోజూ కాసేపు సూర్యరశ్మికి ఉండేందుకు ప్రయత్నించాలి.
శరీర బరువును తగ్గించుకోవడానికి – ఫిట్‌గా ఉండటానికి రోజూ 7-8 గంటలు నిద్రపోవడం చాలా ముఖ్యం. మీరు మంచిగా తిన్నా కానీ తగినంత నిద్ర లేకపోతే చాలా త్వరగా అనారోగ్యానికి గురవుతారు. మీ బరువు కూడా అనియంత్రితంగా పెరుగుతుంది. కావున సమయానికి నిద్రపోవడానికి, ఉదయాన్నే లేవడానికి ప్రయత్నించండి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం..