చలికాలంలో వేడివేడి టీ తాగుతుంటే ఎంత హాయిగా ఉంటుందో మాటల్లో వివరించలేము. ఉదయం నిద్రలేవగానే టీ తాగితే చలి సగం వదిలిపోయిన్లే అనిపిస్తుంది. ఆ కారణంతో టీ, కాఫీ, లెమన్ టీ, బాదం టీ వంటివాటిని మీరు ఇప్పటికే తాగి ఉంటారు. మరీ కొత్తిమీర(పార్స్లీ) టీ ఎప్పుడైనా తాగారా..? కొత్తిమీరను కూరల్లో కదా ఉపయోగించేది.. దానితో టీ కూడా చేస్తారా అని ఆశ్చర్యపోతున్నారా..? అయితే మీకు కేవలం కొత్తిమీర టీ గురించి మాత్రమే కాదు.. దాని ప్రయోజనాలు కూడా తెలియనట్లే. కొత్తిమీర టీలో అనేక పోషకాలతో పాటు యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. అయితే కొత్తిమీర టీని ఎలా చేయాలో, దాని ప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
కొత్తిమీర టీ తయారీ విధానం:
కొత్తిమీర టీని తయారు చేసేందుకు 1 టీస్పూన్ ఎండిన కొత్తిమీర ఆకులు, 1 టేబుల్ స్పూన్ తాజా ఆకులను సమాన నిష్పత్తిలో తీసుకోండి. తర్వాత టీపాయ్‌లో ఒక కప్పు నీటిని మరిగించాలి. తరిగిన పొడి పార్స్లీ ఆకులను వేడినీటిలో కలపండి. తర్వాత రుచి కోసం ఒక చెంచా తేనె, కొన్ని చుక్కల నిమ్మరసం జోడించండి. ఒక రెండు నిమిషాల తర్వాత మీ కొత్తిమీర టీని మీరు ఆస్వాదిస్తూ తాగవచ్చు.
రక్త ప్రసరణలో మెరుగుదల: కొత్తిమీర టీలో ఐరన్ పుష్కలంగా ఉన్నందున ఇది రక్త ప్రసరణను మెరుగుపరిచి, రక్తహీనత ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కొత్తిమీరలోని ఫోలిక్ యాసిడ్.. హోమోసిస్టీన్ ప్రభావాలను నివారించడం ద్వారా రక్త నాళాల నిర్వహణకు సహాయపడుతుంది. హోమోసిస్టీన్ రక్త నాళాలను దెబ్బతీసి, గుండె ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.
రోగనిరోధక శక్తి: శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో కొత్తిమీర టీ సహాయపడుతుంది. విటమిన్ సీ, ఏ లను కలిగి ఉన్న కొత్తిమీర టీ.. రక్తంలో ల్యూకోసైట్లు ఏర్పడటానికి కూడా సహాయపడుతుంది. కొత్తిమీరలో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచుతాయి.
ఎముకల దృఢత్వం: కొత్తిమీరలో ఉన్న విటమిన్ కె శరీరంలో ఆస్టియోబ్లాస్ట్ చర్యను పెంచి ఎముకల నిర్మాణంలో సహాయపడుతుంది. ఎముకల సాంద్రతను పెంచే అనేక ప్రొటీన్‌లను యాక్టివేట్ చేసేందుకు కూడా కొత్తిమీర పనిచేస్తుంది.
క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల నివారణ: శరీరంలోని కణాలను రక్షించే యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు , కెరోటినాయిడ్లు కొత్తిమీరలో పుష్కలంగా కనిపిస్తాయి. ఊబకాయం, పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి కొత్తిమీరలోని ఫ్లేవనాయిడ్లు ఉపకరిస్తాయి. రొమ్ము క్యాన్సర్‌లో క్యాన్సర్ కణాల విస్తరణను తగ్గుముఖం పట్టించేందుకు ఉపకరించే కెరోటినాయిడ్లలో లుటిన్ ఒకటి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..