
ప్రపంచంలో పర్యాటకులు ఎక్కువగా సందర్శించే ప్రదేశాల జాబితాను రఫ్ గైడ్స్ తన తాజా వార్షిక నివేదికలో వెల్లడించింది. 2026 సంవత్సరానికి గాను ప్రపంచంలోని 26 ఉత్తమ పర్యాటక ప్రదేశాల జాబితాను విడుదల చేసింది. అయితే, భారతదేశం నుంచి ఒకే ఒక్క రాష్ట్రానికి ఈ జాబితాలో చోటు దక్కింది. 26 ఉత్తమ పర్యాటక గమ్యస్థానాల్లో కేరళ 16వ స్థానంలో నిలిచింది. దేవభూమిగా, పర్యాటకుల స్వర్గధామంగా మనదేశంలో పేరొందిన కేరళ.. ఇప్పుడు ప్రపంచ పర్యాటకుల దృష్టిని కూడా ఆకర్షిస్తోంది.
రఫ్ గైడ్స్ విడుదల చేసిన వార్షిక ప్రయాణ నివేదిక 2026లో రోమ్, లిస్బన్ వంటి యూరోపియన్, బాలి, హనోయ్ వంటి ఆసియా అందాల వరకు అనేక గమ్యస్థానాలకు చోటు దక్కింది.
మనదేశంలో దేవభూమిగి పేరుగాంచిన కేరళ ప్రతీ పర్యాటకుడి కలల గమ్యస్థానం. ఈ రాష్ట్రం సముద్రం బ్యాక్ వాటర్స్, హిల్ స్టేషన్లు, సుగంధ ద్రవ్యాల తోటలతో నిండి ఉంది. గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని కలిగి ఉంది. ముఖ్యంగా అలప్పుజ ప్రాంతం బ్యాక్ వాటర్ స్వర్గధామం. ఇక్కడి ప్రజలు ప్రామాణికమైన భారతీయ గ్రామ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. మున్నార్, వయనాడ్ లాంటి చల్లని కొండలు, టీ తోటలు, జలపాతాలు, వన్యప్రాణుల అభయారణ్యాలు ఇలా ఎన్నో ఆకర్షణీయ అంశాలు ప్రయాణికులకు పూర్తిగా భిన్నమైన కొత్త అనుభూతిని కలిగిస్తాయి.
హిల్ స్టేషన్లలో ప్రయాణ అనుభూతి పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. ఇక్కడి సాంప్రదాయ కథాకళి ప్రదర్శనలు పర్యాటకులను కట్టి పడేస్తాయి. ఆయుర్వేద చికిత్సా కేంద్రాలు, తెక్కడి అడవులలో ఏనుగులు, సుందర వనాలు ఆకర్షణీయంగా ఉంటాయి.
2025లో కేరళ అధికారిక పర్యాటక వెబ్‌సైట్ ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా సందర్శించే రాష్ట్ర పర్యాటక వెబ్‌సైట్‌లలో ఒకటిగా ర్యాంక్ సాధించింది. మొత్తం సందర్శకుల పరంగా కేరళ.. థాయిలాండ్ సైట్ తర్వాత రెండో స్థానంలో ఉంది. ఇటీవల కాలంలో కేరళ పర్యాటకుల ఆతిథ్యంలో అనేక ప్రశంసలను కూడా అందుకుంది.
కేరళలో పర్యాటకులను ఆకట్టుకునే అనేక అంశాలు ఉండటంతో ప్రతీ సంవత్సరం లక్షలాది మంది టూరిస్టులు ఆ రాష్ట్రాన్ని సందర్శిస్తుంటారు. కొత్త అనుభూతులతో తమ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. ప్రకృతి, వారసత్వ సంపద, సంస్కృతుల గొప్ప మిశ్రమాన్ని ప్రయాణికులు ఎంజాయ్ చేస్తారు. కొచ్చి సాంస్కృతిక ఉత్సవాలు, అక్కడి ఆహ్లాదకరమైన వాతావరణం పర్యాటనలను మంత్రముగ్ధులను చేస్తుంది. సూర్యాస్తమయ కోరుకునేవారు ఇక్కడి దృశ్యం చూసి థ్రిల్ అవుతారు. ఇక్కడి ప్రాంతాలను సందర్శించేందుకు కొత్తగా వివాహమైన జంటలు, కుటుంబాలు పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటారు. పర్యాటకుల స్వర్గధామంగా పేరొందిన కేరళ మీకు సరికొత్త అనుభవాలు, మరిచిపోని అనుభూతాలను ఖచ్చితంగా ఇస్తుంది.