తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఐటీ దాడులు రాజకీయ రంగును పులుముకున్నాయి. ముఖ్యంగా ఏపీలో ఈ ఐటీ దాడులు కాస్త.. వైసీపీ వర్సెస్ టీడీపీగా మారాయి. ఇరు పార్టీల నేతలు ఆరోపణలకు దిగుతున్నారు. వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుచరుడిని విచారిస్తేనే ఇంత భారీగా దొరికిందంటే.. ఇక ఆయన్ను విచారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గురువారం రోజున ఐటీ శాఖ విడుదల చేసిన రూ.2000 వేల కోట్ల లావాదేవీలు అక్రమంగా జరిగాయని ఓ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అంబటి ఈ ఆరోపణలు చేశారు. చంద్రబాబుపై పూర్తిస్థాయి దర్యాప్తుకు సమయం ఆసన్నమైందని.. ఇప్పుడు లాగింది కేవలం తీగ మాత్రమేనన్నారు. కదలాల్సిన డొంక చాలా పెద్దదేనని.. ఈ విషయాన్ని వైసీపీ ఎప్పటికప్పుడు చెప్తూనే ఉందన్నారు.