AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నమ్మలేరు కానీ నిజం..! మోటార్‌సైకిల్ కంటే సన్నని కారు.. గిన్నిస్ రికార్డు కొట్టేసిన మెకానిక్!

ఇటలీ మెకానిక్ ఆండ్రియా మరాజీ 1993 నాటి ఫియట్ పాండాను కేవలం 50.20 సెం.మీ. వెడల్పుతో ప్రపంచంలోనే అత్యంత సన్నని నడిచే కారుగా మార్చారు. మోటార్‌సైకిల్ కంటే సన్నని ఈ ఎలక్ట్రిక్ కారు గిన్నిస్ రికార్డు సాధించి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పాత కారు భాగాలతోనే ఈ వినూత్న ప్రాజెక్ట్ పూర్తయింది.

నమ్మలేరు కానీ నిజం..! మోటార్‌సైకిల్ కంటే సన్నని కారు.. గిన్నిస్ రికార్డు కొట్టేసిన మెకానిక్!
World Narrowest CarImage Credit source: AI Image
Balaraju Goud
|

Updated on: Sep 11, 2026 | 2:55 PM

Share

మోటార్‌సైకిల్ కంటే సన్నగా ఉండే కారు ఉంటుందని ఊహించగలరా..? రోడ్డుపై చూస్తే ఇది నిజంగా కారు కాదేమో.. ఏదైనా ఫొటోషాప్ లేదా AI సృష్టించిన చిత్రం అనిపిస్తుంది. కానీ ఇది అక్షరాలా నడిచే కారు. కేవలం 50.20 సెంటీమీటర్ల వెడల్పు ఉన్న ఈ వాహనం ఇప్పుడు ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. ఇటలీకి చెందిన మెకానిక్ ఆండ్రియా మరాజీ చేసిన ఈ ప్రయోగం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పాత ఫియట్ పాండానే.. ఈ అద్భుతానికి ఆధారం!

ఆండ్రియా మరాజీ 1993లో తయారైన పాత Fiat Panda కారును ఈ అసాధారణ ప్రాజెక్ట్‌కు ఉపయోగించారు. స్క్రాప్‌కు వెళ్లాల్సిన ఆ కారుకు కొత్త జీవితం ఇవ్వాలనే ఆలోచనతో ఈ ప్రయోగాన్ని ప్రారంభించారు. సాధారణ ఫియట్ పాండా సుమారు 1.46 మీటర్ల వెడల్పు ఉంటుంది. కానీ మరాజీ దాని వెడల్పును దాదాపు మూడో వంతుకు తగ్గించి కేవలం 50.20 సెంటీమీటర్లకు తీసుకొచ్చారు. కారు మధ్య భాగాన్ని తొలగించి, మిగిలిన భాగాలను అత్యంత జాగ్రత్తగా తిరిగి అమర్చారు. ఈ భారీ మార్పులన్నీ కుటుంబానికి చెందిన ఆటో డిస్మాంట్లింగ్, రీసైక్లింగ్ వ్యాపారంలోనే చేపట్టారు. ప్రాజెక్ట్ పూర్తవడానికి దాదాపు 12 నెలల సమయం పట్టింది.

99 శాతం పాత కారు భాగాలే!

ఈ ప్రాజెక్ట్‌లో మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. కొత్తగా మొత్తం కారును తయారు చేయలేదు. పాత 1993 ఫియట్ పాండాలోని దాదాపు 99 శాతం ఒరిజినల్ భాగాలను తిరిగి ఉపయోగించినట్లు సమాచారం. నాలుగు చక్రాలు, బాడీలోని పలు భాగాలు, ఇతర ఒరిజినల్ కాంపోనెంట్లను కొత్త ఆకృతికి అనుగుణంగా మార్చారు. అందుకే ఈ వాహనం బయట నుంచి చూస్తే దాదాపు రెండు డైమెన్షన్లలో ఉన్న కారు లాగా కనిపిస్తుంది. అయితే ఇది కేవలం ప్రదర్శన కోసం తయారు చేసిన మోడల్ కాదు.. నిజంగానే పరిగెత్తగలదు.

ఒక్క వ్యక్తికే సీటు.. ఎలక్ట్రిక్ మోటార్

సాధారణ ఫియట్ పాండాతో పోలిస్తే ఇందులో ఇంటీరియర్ స్పేస్ పూర్తిగా మారిపోయింది. ఒక్క వ్యక్తి మాత్రమే ఇందులో ప్రయాణించగలరు. డ్రైవర్ కోసం చిన్న స్టీరింగ్ వీల్‌ను ఏర్పాటు చేశారు. సాధారణ పెట్రోల్ ఇంజిన్ స్థానంలో ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ ఉపయోగించారు. కారు నాలుగు చక్రాలపైనే నడుస్తుంది. ముందు భాగంలో ఒక హెడ్‌లైట్, వెనుక రెండు లైట్లు వంటి మార్పులు కూడా చేశారు. ఈ విచిత్రమైన వాహనం 3.40 మీటర్ల పొడవు, 1.45 మీటర్ల ఎత్తు కలిగి ఉంది. బరువు సుమారు 264 కిలోగ్రాములు. దీని గరిష్ట వేగం గంటకు దాదాపు 15 కిలోమీటర్లు. పూర్తి ఛార్జ్‌తో సుమారు 25 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని తాజా నివేదికలు పేర్కొంటున్నాయి.

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లోకి..

ఆండ్రియా మరాజీ రూపొందించిన ఈ వాహనం 2025 జూన్ 21న ఇటలీలోని బాగ్నోలో క్రెమాస్కోలో కొలిచారు. వెడల్పు 50.20 సెంటీమీటర్లుగా నమోదవడంతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ దీనిని “Narrowest driveable car”గా అధికారికంగా గుర్తించింది. అంటే.. ఇది ప్రపంచంలోనే నడపగలిగే అత్యంత సన్నని కారు అన్నమాట. అయితే ఇంత చిన్నగా తయారు చేసిన ఈ వాహనం రోడ్డుపై సాధారణ కారులా తిరగడానికి మాత్రం అనుమతి లేదు. దీని పరిమాణం, భద్రత, రోడ్డు వినియోగానికి సంబంధించిన నిబంధనల కారణంగా ఇది ప్రధానంగా ఎగ్జిబిషన్లు, ఆటో ఈవెంట్లు, ప్రదర్శనల కోసం ఉపయోగించే ప్రత్యేక వాహనంగా ఉంది.

సోషల్ మీడియాలో ఎందుకు ఇంత వైరల్?

ఈ కారు ఫొటోలు, వీడియోలు చూసిన చాలామంది మొదట ఇది నిజమైన వాహనమేనా అని అనుమానించారు. కొందరికి ఇది AIతో తయారు చేసిన చిత్రం లేదా వీడియోలా అనిపించింది. కానీ రోడ్డుపై స్వయంగా కదులుతున్న దృశ్యాలు బయటకు రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరిగింది. ఒకప్పుడు స్క్రాప్‌గా మారాల్సిన 1993 ఫియట్ పాండాను కేవలం 50.20 సెంటీమీటర్ల వెడల్పున్న ఎలక్ట్రిక్ కారుగా మార్చడం, దానిని నిజంగా నడిచేలా చేయడం.. ఆండ్రియా మరాజీ సృజనాత్మకతకు నిదర్శనంగా నిలిచింది. చిన్నదిగా చేయడం మాత్రమే కాదు.. అసాధ్యంగా కనిపించే ఆలోచనను ఆచరణలోకి తీసుకురావడమే ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత. ఇప్పుడు ఈ “Flat Fiat” ప్రపంచంలోనే అత్యంత సన్నని నడిచే కారుగా గిన్నిస్ రికార్డ్స్‌లో నిలిచిపోయింది.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us