ఆర్థిక వ్యవస్థ సర్కస్ సింహం కాదని కేంద్ర మాజీ ఆర్థికశాఖ మంత్రి పి.చిదంబరం అన్నారు. రింగ్‌మాస్టర్ చేష్టలకు ఇది ప్రతిస్పందించదని ఆయన చెప్పారు. ఈ విషయంలో ఆర్‌బీఐ గవర్నర్, సెబీ చైర్మన్లతోపాటు డీఈఏ కార్యదర్శికి కూడా చిదంబరం పరోక్షంగా చురకలంటించారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం నేరుగా ప్రజల చేతుల్లో డబ్బు పెట్టాలి మినహా ఎవరూ సాయం చేయరని ఆయన అన్నారు. ఆర్థిక వ్యవస్థను నిర్ణయించేది మార్కెట్ అని, డిమాండ్, సప్లై, కొలుగోలు సామర్థ్యంతోపాటు ప్రజల మనోభావాలపై ఇది ఆధారపడి ఉంటుందని చెప్పుకొచ్చారు. వస్తువులను కొనేందుకు, సేవలను పొందేందుకు చాలా మంది వద్ద డబ్బు లేదు.. అట్టడుగు స్థితి కుటుంబాలకు నేరుగా చేతుల్లో డబ్బు పెట్టకుండా ఆర్థిక వ్యవస్థ పుంజుకోదని ఆర్థిక మంత్రికి చెప్పాలంటూ ఆర్థిక పెద్దలకు చిదంబరం సూచించారు.