అసలు అర్బన్‌ నక్సల్స్‌ అంటే ఎవరు..? టీవీ9 ఎక్స్‌క్లూజీవ్..

|

Jan 24, 2020 | 10:32 PM

అర్బన్‌ నక్సల్స్‌ ఈ మధ్య కాలంలోనే వాడుకలోకి వచ్చినా.. తరచూ వినిపిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక స్వరానికి పాలకులు పెట్టిన పేరే ఇదని ప్రజాసంఘాలంటున్నాయి. విద్యార్ధులను ఉగ్రవాదం వైపు ఉసిగొలిపే వారే అర్బన్‌ నక్సల్స్‌ అని నిఘా వర్గాలంటున్నాయి. ప్రొఫెసర్‌ కాశిం అరెస్టుతో.. తెలంగాణలోనూ అర్బన్ నక్సల్స్‌ ప్రకంపనలు మొదలయ్యాయి. 60 మందిపై ఉప్పా చట్టం కింద కేసులు నమోదయ్యాయి. మావోయిస్టు స్టేట్ కమిటీ సభ్యులతోపాటు, సెంట్రల్ కమిటీ సభ్యులూ ఉన్నారు. తెలంగాణ ప్రజాఫ్రంట్‌ తెలంగాణ విద్యార్థి విభాగం, […]

అసలు అర్బన్‌ నక్సల్స్‌ అంటే ఎవరు..? టీవీ9 ఎక్స్‌క్లూజీవ్..
Follow us on

అర్బన్‌ నక్సల్స్‌ ఈ మధ్య కాలంలోనే వాడుకలోకి వచ్చినా.. తరచూ వినిపిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక స్వరానికి పాలకులు పెట్టిన పేరే ఇదని ప్రజాసంఘాలంటున్నాయి. విద్యార్ధులను ఉగ్రవాదం వైపు ఉసిగొలిపే వారే అర్బన్‌ నక్సల్స్‌ అని నిఘా వర్గాలంటున్నాయి. ప్రొఫెసర్‌ కాశిం అరెస్టుతో.. తెలంగాణలోనూ అర్బన్ నక్సల్స్‌ ప్రకంపనలు మొదలయ్యాయి. 60 మందిపై ఉప్పా చట్టం కింద కేసులు నమోదయ్యాయి. మావోయిస్టు స్టేట్ కమిటీ సభ్యులతోపాటు, సెంట్రల్ కమిటీ సభ్యులూ ఉన్నారు. తెలంగాణ ప్రజాఫ్రంట్‌ తెలంగాణ విద్యార్థి విభాగం, చైతన్య మహిళా సమాఖ్య, డెమొక్రటిక్ స్టూడెంట్ యూనియన్ నేతలూ ఉన్నారు. పట్టణాలు, నగరాల్లో ఉంటూ మావోయిస్టు రిక్రూట్‌మెంట్‌, షెల్టర్‌ ఇస్తున్నారని అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. హత్యానేరం, బాంబుపేలుళ్ల ఆరోపణలతో ఇప్పటికే కొందరిని అరెస్టు చేయగా, మరికొందరిపైనా ఉక్కుపాదం మోపేందుకు రంగం సిద్ధమైంది.

మొట్టమొదటిసారి భీమా కోరేగావ్‌ కేసులో అర్బన్ నక్సల్‌ పదం ప్రతిధ్వనించింది. వరవరరావు, వెర్నన్ గోన్యాల్‌వెజ్, అరుణ్ ఫెరీరా, సుధా భరద్వాజ్, గౌతంలను అరెస్టులతో మావోయిస్టుల అర్బన్‌ నెట్‌వర్క్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మావోయిస్టు పార్టీకి పౌరహక్కుల నేతలు సహకరిస్తున్నారని, వీరి ద్వారా నగరాలు, పట్టణాల్లో విద్యార్థులను మావోయిస్టు పార్టీవైపు ఆకర్షిస్తున్నారని మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధాని మోదీ హత్యకు కుట్ర పన్నారన్న ఆరోపణలున్నాయి. ఆ తర్వాతకాలంలో దేశవ్యాప్తంగా పదుల సంఖ్యలో ఈకేసుల్లో అరెస్టులు జరిగాయి. ఢిల్లీలో సాయిబాబు, హైదరాబాద్‌లో ఎన్‌జీఆర్ఐ ఉద్యోగి నక్కా వెంకట్రావు, అక్కచెల్లెళ్లు అనూష, భవానీ, అన్నపూర్ణల అరెస్టులు కలకలం రేపాయి.

అరెస్టులపై నిరసనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. సామాన్య ప్రజలపై అర్బన్‌ నక్సలైట్లు, జాతి వ్యతిరేకులని ముద్రవేసి అరెస్టు చేస్తున్నారని ఆరోపణలున్నాయి. ప్రజాస్వామ్యంలో అసమ్మతి సహజం. అది లేకుంటే ప్రజాస్వామ్యమే లేదు. ప్రభుత్వ నిర్ణయాల్ని ప్రశ్నిస్తే వారు అర్బన్‌ మావోయిస్టులా అంటూ నినదిస్తున్నారు. ఆదూర్‌ గోపాలకృష్ణన్‌, శ్యామ్‌ బెనగల్‌, అపర్ణా సేన్‌, రేవతి వంటివారు ప్రధానికి లేఖలు కూడా రాశారు. మీ టూ అర్బన్‌ నక్సల్‌ ఉద్యమాలూ జరిగాయి. ప్రకాష్‌ రాజ్‌, కమల్‌ హాసన్‌ వంటివాళ్లు సినిమా స్టార్లు మద్దతిచ్చారు. మానవహక్కుల కోసం పోరాడే వారిని, కవులు, రచయితలు, జర్నలిస్టులు, ప్రొఫెసర్లను అర్బన్ నక్సలైట్లగా ప్రకటిస్తోందని ఆరోపించారు. ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహను అర్బన్‌ నక్సలైట్‌గా పేర్కొంటూ కర్ణాటక బిజెపి పెట్టిన ట్వీట్‌ను గుర్తు చేశారు. జస్టిస్ చలమేశ్వర్ కూడా అర్బన్‌ నక్సల్‌ అంటూ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పరోక్షంగా ఖండించారు.

ఇటు అర్బన్‌ నక్సల్‌ ఉద్యమానికి లెఫ్ట్‌, కాంగ్రెస్ పార్టీలు మద్దతు ఇవ్వడాన్ని రైట్‌ వింగ్‌ సంస్థలు ప్రశ్నిస్తున్నాయి. కాంగ్రెస్ భూస్వామ్య విధానాలకు వ్యతిరేకంగా నక్సల్‌బరీ ఉద్యమాలు పుట్టాయి. ఇప్పుడు అదే పార్టీ మద్దతు ఇవ్వడాన్ని ప్రశ్నిస్తున్నారు. సానుభూతి పలుకులు చెబుతున్న కాంగ్రెస్‌… అరుణ్‌ఫెరేరా, వేర్నాస్ గోన్సాల్వెజ్, గౌతం, రోనా విల్సన్, వినాయక్ సేన్, జీన్ సాయిబాబా ఎవరి ప్రభుత్వాల్లో అరెస్టు అయ్యారో గుర్తు చేసుకోవాలన్నారు. వరవరరావు, ఫాదర్సాండ్ స్వామి, ఆనంద్ తుంబ్దే ఈ 30 ఏళ్ళ నుండి మావోయిజాన్ని నగరాల్లో సజీవంగా ఉంచుతున్నారని నిజం కదా అన్ని ప్రశ్నిస్తున్నారు.

అటు పోలీసులు కూడా అర్బన్‌ నక్సల్‌ పదం కొత్తది కాదంటున్నారు. గతంలో కూడా ఉందని… నగరాల్లో ఉండి సహకరించేవారిపై ఈ తరహా కేసులు పెట్టామంటున్నాయి. ఇటీవల కాలంలో అత్యధికంగా వినిపిస్తోంది అ పదం. కొందరు అనుకూలంగా పుస్తకాలు రాశారు. మరికొందరు విశ్లేషణలు, వ్యాసాలు రాశారు. ఎవరి వాదన వారిదే. ఎవరి కోణం వారిదే.