నా జీవిత పోరాటంపై షార్ట్ ఫిల్మ్… అరణ్య సినిమా షూటింగ్ సమయంలో తీవ్ర అనారోగ్యానికి గురయ్యా… అప్పటి వరకు ఉన్న అన్ని అలవాట్లను మానేశానన్న హీరో రానా.. ఇలా తన జీవితంలో జరిగిన పలు కీలక సందర్భాలను నటుడు రానా ఆహా షోలో సమంతతో పంచుకున్నారు. ఆ ఇంటర్వ్యూలోని కీలక సంభాషణలు ఇవి…
నా డిసీజ్ అలా బయటపడింది…
థాయిలాండ్‌లో ‘అరణ్య’ షూటింగ్ కోసం సన్నద్ధమవుతోన్న సమయంలో రానా కళ్లకు డిఫరెంట్ లెన్స్ వాడాలని దర్శకుడు ప్రభు సూచించారట. కానీ, ఆ లెన్స్ రానా కళ్లకు పెట్టడానికి కుదరదని, దాని కోసం కళ్లకు ఒక చిన్న సర్జరీ చేసిన తరవాత లెన్స్ ఫిట్ చేయాలని డాక్టర్లు సూచించినట్లు రానా తెలిపారు. సర్జరీ చేయించుకుని ఒక 10 రోజులు విరామం తరవాత షూటింగ్‌కు వెళ్దామని ప్లాన్ చేసుకున్నాని హాస్పిటల్‌కు వెళ్లినప్పుడు ముందుగా బీపీ చూశారని తెలిపాడు. ఆ తర్వాత
డాక్టర్ మీకు ఎలా ఉంది, బాగానే ఉందా? అని అడిగారట. బాగానే ఉందని రానా సమాధానం చెప్పారట. నడిచేటప్పుడు బాగానే ఉందా? అని డాక్టర్ అడిగారట. నేను థాయిలాండ్ నుంచి వచ్చానండి.. అక్కడ చెట్లపై నుంచి అటూ ఇటూ దూకి మరీ వచ్చాను అని రానా చెప్పారట. అయితే, బీపీ కొంచెం తేడాగా ఉంది ఈరోజు సర్జరీ వద్దు ఇంకో రోజు చేద్దాం అని డాక్టర్ అన్నారట. దీంతో రానా అదే రోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో వేరే హాస్పిటల్‌కు వెళ్తే చాలా టెస్టులు చేశారట. టెస్టులు చేసిన ప్రతి డాక్టర్ మీరు బాగానే ఉన్నారా? అని రానాను అడిగారట. కానీ, తాను మాత్రం పర్ఫెక్ట్‌గా ఉన్నానని రానా అన్నారట.
వీళ్లేం డాక్టర్లని ఫీలయ్యారట….
మొత్తం మీద డాక్టర్లు అన్ని టెస్టులూ చేసి రానాకు బీపీ 220/192 ఉందని ఖరారు చేశారట. మామూలుగా ఒక మనిషికి ఉండాల్సిన బీపీ కన్నా రెండు రెట్లు అధికంగా ఉందన్నమాట. అయితే, ఆ హాస్పిటల్ హెడ్ వచ్చి రానాకు ఇంకొన్ని టెస్టులు చేయాలి అని చెప్పారట. రోజంతా హాస్పిటల్‌లోనే ఉన్నా ఇంకా క్లారిటీ రాకపోతే వీళ్లేం డాక్టర్లు అని రానా ఫీలయ్యారట. ఇక ఇది కాంప్లికేటెడ్ అని అర్థం చేసుకుని అదే రోజు రాత్రి తన తండ్రి సురేష్ బాబుతో కలిసి రానా అమెరికా వెళ్లారు.
‘‘అమెరికాలో మేయో క్లినిక్ అని ఉంది. ప్రపంచంలో ఎక్కడా మన ప్రశ్నలకు సమాధానాలు దొరకకపోతే అక్కడ దొరుకుతాయి. అక్కడ మూడు రోజులు అన్ని పరీక్షలు చేశారు. అమెరికన్ హాస్పిటల్స్‌లో ఎమోషన్ అనేది లేకుండా ఏదైనా సూటిగా చెప్పేస్తారు. అక్కడ డాక్టర్ శాంతి స్వరూప్ బేగే నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. ఆయన నా దగ్గరకు వచ్చి నీకు పుట్టికతోనే అత్యధిక రక్తపోటు ఉంది.. కానీ, ఎవ్వరూ దాన్ని గుర్తించలేకపోయారు అని చెప్పారు. దాని వల్ల శరీరంలో కొన్ని అవయవాలు దెబ్బతిన్నాయి అన్నారు. గుండె చుట్టూ కాల్షియం పేరుకుపోయింది అన్నారు. అలాగే, నీ కిడ్నీలు పాడైపోయాయి అని చెప్పారు. ఇప్పటికిప్పుడే నువ్వు శస్త్రచికిత్స చేసుకోకపోతే 70 శాతం గుండెపోటు వచ్చే అవకాశం, 30 శాతం చనిపోయే అవకాశం ఉంది అన్నారు. ఆరు నెలల్లో ఇది జరగొచ్చు అన్నారు’’ అని రానా వెల్లడించారు.
అలా చెప్తే నమ్మాలో లేదో…
మనం బాగా ఉన్నప్పుడు డాక్టర్ ఇలా చెప్తే నమ్మాలో లేదో కూడా తెలియదని రానా అన్నారు. దీన్ని జీర్ణించుకోవడం చాలా కష్టమైందన్నారు. ‘‘వైద్యం కోసం కొద్ది రోజులు అమెరికాలో గడినప్పుడు ఆ పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి నాకు చాలా కష్టం అనిపించింది. మరోవైపు, ‘అరణ్య’ షూటింగ్ కోసం మొత్తం యూనిట్ థాయిలాండ్‌లో ఉంది. నేను అప్పటికి ప్రభు గారికి ఏం చెప్పలేదు. అమెరికా వెళ్లి నాలుగు రోజుల్లో వచ్చేస్తా అని చెప్పాను అంతే. నాన్న ఎలాంటి పరిస్థితుల్లో అయినా చాలా దృఢంగా కనిపిస్తారు. కానీ, అప్పుడు ఆయన నాకు చాలా బలహీనంగా కనిపించారు. నాకు పరిస్థితి అర్థమైపోయింది. ఇక అమెరికా హాస్పిటల్స్‌లో వాళ్లు అడిగే ప్రశ్నలకే మొదట మనం చచ్చిపోతాం’’ అని తనకు ఎదురైన గడ్డుకాలం గురించి రానా వివరించారు.
అన్నీ ఆపేశా….
తాను చాలా విలాసవంతమైన జీవితాన్ని అనుభవించానని.. అయితే, ఆ జీవితాన్ని వెంటనే ఆపేయాలని డాక్టర్లు సూచించారని రానా చెప్పారు. ‘‘ఆల్కహాల్, సిగరెట్, ఉప్పు, మాంసం వీటన్నింటినీ మానేయాలని చెప్పారు. చాలా తక్కువ ఆహారం తీసుకోవాలన్నారు. ఒక్క రోజులో నా అలవాట్లన్నీ మానేశాను’’ అని రానా వెల్లడించారు. నిజానికి ఒకానొక దశలో రానా సోషల్ మీడియాలో కనిపించడం మానేశారు. ఒక్క ఫొటో మాత్రం బయటికి వచ్చింది. ఆ ఫొటోలో బాగా సన్నబడి కనిపించారు. ఈ ఫొటోతో రకరకాల రూమర్లు చక్కర్లు కొట్టాయి. కానీ, ఆ వైద్యం కోసం రానా తీసుకున్న డైట్ వల్ల అంత బక్కపలచగా తయారయ్యారట. సర్జరీ పూర్తయిన తరవాత మళ్లీ కోలుకోవడానికి, పాత రానాలా తయారవడానికి ఆయన పడిన కష్టం అంతా ఇంతా కాదు. నిజంగా ఈ జర్నీ చాలా మందికి స్ఫూర్తి. త్వరలోనే తన జీవిత పోరాటంపై ఒక షార్ట్ ఫిల్మ్ విడుదల చేయబోతున్నారు రానా.