ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో అధికార వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. జగన్ ప్రతిష్టాత్మకంగా భావించి తీసుకొచ్చిన మూడు రాజధానుల బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపాలని చైర్మన్ షరీఫ్ నిర్ణయించారు. అయితే, ఇప్పుడు ఏం జరుగుతుందనే ఆసక్తి రాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది. అసలు సెలక్ట్ కమిటీ అంటే ఏంటి? దాన్ని విధులు ఏంటి? సెలక్ట్ కమిటీకి పంపడం వల్ల వైసీపీకి నష్టం జరుగుతుందా? టీడీపీకి లాభం జరుగుతుందా? మూడు రాజధానులు అటకెక్కినట్టుగా భావించాలా? ఈ అంశాలను తెలుసుకుందాం.
ఓ బిల్లు వల్ల ప్రజలకు భారీగా నష్టం జరుగుతుందని భావిస్తే సభ్యులు సెలక్ట్ కమిటీకి పంపాలని కోరతారు. శాసనమండలి సెలక్ట్ కమిటీకి పంపాలని ప్రతిపాదించింది కాబట్టి, మండలి నుంచే సెలక్ట్ కమిటీని కూడా ఎంపిక చేయాలి. శాసనసభలో స్పీకర్ కమిటీలను వేస్తారు. శాసనమండలిలో చైర్మన్ కమిటీలను నియమిస్తారు. శాసనమండలిలో ఏయే పార్టీకి ఎంత మంది సభ్యులు ఉన్నారో తెలుసుకుని, వారి పర్సంటేజీ ప్రకారం ఆయా పార్టీలకు ప్రాతినిధ్యం ఉండేలా సభ్యులను ఎంపిక చేస్తారు. అంటే ప్రస్తుతం శాసనమండలిలో టీడీపీకి మెజారిటీ సభ్యులు ఉన్నారు కాబట్టి ఆ పార్టీకి చెందిన వారే ఎక్కువ మంది సెలక్ట్ కమిటీలో ఉంటారు.
ఓ బిల్లు సెలక్ట్ కమిటీకి వెళ్లిన తర్వాత ఆ కమిటీ సభ్యులు బిల్లు వల్ల ప్రభావితం అయ్యే వారి వాదనలను వింటారు. అంటే అమరావతి రైతులతో పాటు విశాఖపట్నం, కర్నూలు జిల్లాల వారి వాదనలను కూడా వినాలి. మొత్తం 13 జిల్లాల్లోని వారి అభిప్రాయాలు కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా నిపుణులు, వివిధ వర్గాల వారి అభిప్రాయాలను తెలుసుకుంటుంది. అనంతరం ఆ బిల్లులో మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటే వాటిని ప్రతిపాదిస్తుంది. అనంతరం ఆ బిల్లును మళ్లీ అసెంబ్లీకి పంపుతుంది. సెలక్ట్ కమిటీ పరిశీలించి రూపొందించిన బిల్లును అసెంబ్లీలో చర్చిస్తారు. అక్కడ చర్చించి ఆమోదించిన తర్వాత మరోసారి శాసనమండలికి వస్తుంది. మండలి సెలక్ట్ కమిటీ ప్రతిపాదించిన సూచనలు, సలహాలకు మళ్లీ శాసనసభలో సవరణలు ప్రతిపాదించుకునే అవకాశం ఉంటుంది. అంటే ఓ రకంగా మండలి సెలక్ట్ కమిటీ ప్రతిపాదించే సూచనలకు శాసనసభలో మళ్లీ మార్పులు ఉండొచ్చు. ఆ తర్వాత మళ్లీ మండలికి వెళ్తుంది. అక్కడ ఆమోదం పొందితే ఓకే. ఒకవేళ బిల్లు ఓడిపోతే రెండోసారి శాసనసభలో అదే బిల్లును ప్రవేశపెట్టి దాన్ని ఆమోదించినట్టుగా తేల్చుతారు.