
కోల్‌కతా: ఎన్నికల అనంతరం పశ్చిమబెంగాల్‌లో చోటుచేసుకున్న ఘర్షణలపై ఆ రాష్ట్ర గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి అఖిలపక్ష భేటీకి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో శాంతి నెలకొల్పే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు అన్ని ప్రముఖ పార్టీలకు గురువారం సాయంత్రం 4 గంటలకు రాజ్‌భవన్‌లో జరిగే అఖిల పక్ష భేటీకి హాజరు కావాలని గవర్నర్ లేఖలు పంపారు.
గవర్నర్ నిర్ణయాన్ని పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ స్వాగతించారు. భేటీకి సంబంధించిన లేఖ తమకు అందిందని, తాము ఈ సమావేశానికి హాజరవుతామని తెలిపారు. తమకు ఎలాంటి లేఖా రాలేదని, ఒకవేళ వస్తే సమావేశానికి తప్పక హాజరవుతామని తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు తెలిపారు.
బెంగాల్‌లోని 24 పరగణాల జిల్లాలో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య ఇటీవల చోటుచేసుకున్న ఘర్షణల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రం అట్టుడుకుతోంది. రాష్ట్రంలోని పరిస్థితిని ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీకి, హోంమంత్రి అమిత్‌షాకు గవర్నర్ త్రిపాఠి వివరించారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ బెంగాల్ ప్రభుత్వాన్ని నివేదిక కోరింది. ఈ నేపథ్యంలో గవర్నర్ అఖిలపక్ష సమావేశానికి పిలుపునివ్వడం గమనార్హం. మరోవైపు గవర్నర్ బీజేపీకు అనుకూలంగా వ్యవహరిస్తున్నరంటూ మమత బెనర్జీ ఆరోపిస్తున్నారు.