ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. నదిలో భారీ వరద పారుతోంది. జలాశయాలన్నీ ఇప్పటికే నిండుకుండలా మారాయి. అటు శ్రీశైలానికి పెద్ద ఎత్తున వరద నీరు పోటెత్తుతోంది. దీంతో శ్రీశైలం నుంచి దిగువకు నీరు విడుదల చేస్తుండటంతో నాగార్జునసాగర్‌కు భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ డ్యాంలోకి మొత్తం 4,07,570 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. 18 గేట్లను పైకెత్తి 1,67,153 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులకు గానూ.. ప్రస్తుతం 586.04 అడుగుల నీరు ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 300.32 టీఎంసీల నీరు నిల్వ కొనసాగుతుంది.
మరోవైపు కృష్ణానది తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గుంటూరు జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. చేపలు పట్టేందుకు, పశువులు మేపేందుకు నదీ ప్రాంతంలోకి ఎవరు వెళ్లొద్దని అన్నారు. ముంపు ప్రాంతాల వారికి సహాయం కోసం కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని అధికారులందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ సూచించారు. అత్యవసర సమయంలో 08632324014, గుంటూరు రెవెన్యూ డివిజనల్ కార్యాలయం 08632240679, తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయం 08644223800, గురజాల రెవెన్యూ డివిజనల్ కార్యాలయం 7702853860, 8106142574 నెంబర్లకు ఫోన్ చేసి సాయం పొందవచ్చన్నారు. ముందజాగ్రత్త చర్యలు తీర ప్రాంతాల్లో సహాయక బృందాలను అందుబాటులో ఉంచినట్లు కలెక్టర్ తెలిపారు.