Peddareddy on JC Deeksha : తాడిపత్రిలో రాజకీయం రంజుగా మారింది. తాడిపత్రి ప్రొడక్షన్ సమర్పించు జేసీ బ్రదర్స్ వర్సెస్ పెద్దారెడ్డి సినిమాకు ఇంకా ఎండ్‌కార్డ్ పడలేదు. ఇంటర్వెల్‌కు ముందు జేసీ ఇంటికి వెళ్లి పెద్దారెడ్డి తొడగొడితే …ఆ తర్వాత జేసీ బ్రదర్స్ రియాక్షన్ మొదలైంది. వారం రోజుల తర్వాత దీక్ష రాజకీయం తెరపైకి వచ్చింది. పొలిటికల్ థ్రిల్లర్‌ను తలపిస్తున్న ఈ సినిమాకు క్లైమాక్స్ ఎలా ఉంటుందో తెలియదు. కానీ ప్రతిరోజూ ఏదో ఒక సస్పెన్స్, ట్విస్ట్‌తో ముందుకు సాగుతోంది.
దాడులు, వార్నింగ్‌లు, మాటల తూటాలు, నిరసనలు, ఉద్రిక్త పరిస్థితులు.. ఇదీ తాడిపత్రిలో ఇప్పుడు కనిపిస్తున్న తాజా పరిస్థితి. వీటికి జేసీ ప్రభాకర్ రెడ్డి దీక్ష విరమణతో బ్రేక్ పడింది. సోమవారం ఉదయం నుంచి జరిగిన నాటకీయ పరిణామాలకు కూడా తెరపడింది. అయితే ఇది అంతం కాదు ఆరంభం అని ప్రకటించిన జేసీ… మరో కొత్త ఎపిసోడ్‌కు తెరలేపారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో డిసెంబర్ 24 మొదలైన ఉద్రిక్త పరిస్థితులు, టెన్షన్ వాతావరణానికి తాత్కాలికంగా విరామం పడింది.
తాడిపత్రిలో పెద్దారెడ్డి వర్సెస్ జేసీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. జేసీ బ్రదర్స్ ఆమరణ దీక్ష ప్రకటనపై ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఉనికి కాపాడుకునేందుకే అలా చేస్తున్నారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ కేసుల గురించి వారు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. జేసీ బ్రదర్స్ గతంలో ఏకంగా పోలీసు అధికారులపైనే కేసులు నమోదు చేశారన్నారు పెద్దారెడ్డి. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చూడని ఇప్పటికీ అధికారులను, పోలీసులను బెదిరిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు డైరెక్షన్‌లోనే దీక్షలు చేస్తున్నట్లు ప్రకటించారని పెద్దారెడ్డి ఆరోపించారు. వారికి జిల్లా నేతలు ఎవరూ సహకరించడం లేదన్నారు. నేను శాంతి కోసం ట్రై చేస్తుంటే.. వాళ్లు యుద్ధం అంటున్నారు.. ఈ మాటలన్నది ఎవరో కాదు.. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి.