కృష్ణా జిల్లా విసన్నపేట ట్రిపుల్ మర్డర్ కేసును ఛేదించారు పోలీసులు. నిందితులైన వెంకన్న, నాగమణి దంపతులతో పాటు వారి కొడుకును అరెస్ట్ చేశారు. వారి నుంచి ఆటోతో పాటు మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పశ్చిమగోదావరి జిల్లా చిలకలపూడికి చెందిన వారిగా గుర్తించారు. రెక్కీ నిర్వహించి హత్యలకు పాల్పడ్డాట్లు పోలీసులు తెలిపారు.
విస్సన్నపేటలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. అయితే అది ప్రమాదం కాదు.. ట్రిపుల్ మర్డర్ అని పోలీసుల విచారణలో తేలింది. రోడ్డు ప్రమాదంగా క్రియేట్ చేసి ముగ్గుర్ని హత్య చేశారు వెంకన్న దంపతులు.
కేసు వివరాలు పోలీసులు మీడియాకు వెల్లడించారు. మృతుడు చిన్నస్వామి భార్యతో దాసరి వెంకన్నకు వివాహేతర సంబంధం ఉందని తేల్చారు. దీంతో చిన్నస్వామి, దాసరి వెంకన్న మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో అతణ్ని చంపేయాలని దాసరి వెంకన్న ప్లాన్ చేశాడని చెప్పారు. చినస్వామికి మద్యం తాగించి హత్యలకు కుట్ర పన్నారని పోలీసులు వివరించారు.
నూజివీడు వెళ్దామని చిన్నస్వామి దంపతులతోపాటు వారి కూతురుని ఆటోలో తీసుకెళ్లారు దాసరి వెంకన్న దంపతులు. దారి మధ్యలోనే వారిని హతమార్చి… రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి, తప్పించుకుందామనుకున్నారు. ముచ్చినపల్లి మామిడి తోట వద్దకు రాగానే ఆటో ఆపి చినస్వామిపై మారణాయుధాలతో దాడి చేశాడు వెంకన్న. అది చూసి పారిపోతున్న భార్య తిరుపతమ్మను రాడ్డుతో కొట్టి హత్య చేశారు. అనంతరం మృతుల కుమార్తెను గొంతు బిగించి హత్య చేసినట్లు విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. ఆటో కల్వర్ట్‌ను ఢీ కొట్టడంతో యాక్సిడెండ్ జరిగిందని మొదట అందరిని నమ్మించారు. నిందితుల నుండి ఆటోను, మారణాయుధాలు, దుస్తులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పోలీసులకు దొరికిన క్లూస్ ఆధారంగా గంటల వ్యవధిలోనే ట్రిపుల్ మర్డర్ కేసును ఛేదించారు.