కుళ్లిన మృతదేహాల తరలింపు కలకలం..!

కోల్‌కతాలో కుళ్లిన మృతదేహాల తరలింపు తీవ్ర కలకలం రేపుతోంది. మున్సిపల్ వ్యాన్‌లో కుళ్లిన మృతదేహాలను ఎక్కించినట్లు ఓ వీడియో గురువారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది

కుళ్లిన మృతదేహాల తరలింపు కలకలం..!

Updated on: Jun 12, 2020 | 1:00 PM

కోల్‌కతాలో కుళ్లిన మృతదేహాల తరలింపు తీవ్ర కలకలం రేపుతోంది. మున్సిపల్ వ్యాన్‌లో కుళ్లిన తదేహాలను ఎక్కించినట్లు ఓ వీడియో గురువారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కరోనా మృతదేహాలు దహనంతో అంటువ్యాధుల ప్రబలుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే.. అవి కొవిడ్ డెడ్ బాడీలు కావంటూ కొట్టిపారేస్తున్నారు అధికారులు. అయితే నకిలీ వార్తలను ప్రచారం చేస్తే కఠినచర్యలు తప్పవని కోల్‌కతా పోలీసులు హెచ్చరిస్తున్నారు.

కోల్‌కతా మునిసిపల్ కార్పొరేషన్ సిబ్బంది వివిధ ఆస్పత్రుల్లో కుళ్ళిన మృతదేహాలను వ్యాన్‌లో ఎక్కించడానికి సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. మృతదేహాలను నగర శివారులోని గారియా శ్మశానవాటికకు తరలించి ఒకే చోట దహనం చేశారు. దీంతో స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మృతదేహాలన్ని కరోనావైరస్ బాధితులవని పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. జనావాసాల మధ్య ఉన్న శ్మశానవాటికలో కొవిడ్-19 రోగుల దహనం చేయడంతో అంటువ్యాధులు ప్రబలుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆరోగ్యంతో ఉన్న జనం కొత్త రోగాలతో ఆస్పత్రి పాలవుతున్నారని ఆరోపించారు.
అయితే, మృతదేహాలు కరోనా బాధితులవి కావని నకిలీ వీడియోలతో పుకార్లు సృష్టిస్తున్నారని పశ్చిమ బెంగాల్ ఆరోగ్య శాఖ, కోల్‌కతా పోలీసులు కొట్టిపారేశారు. మృతదేహాలు కోవిడ్ రోగులవి కాదని, హాస్పిటల్స్ నుండి గుర్తుతెలియని మృతదేహాలను మాత్రమే తరలిస్తున్నామని పశ్చిమ బెంగాల్ ఆరోగ్య శాఖ తెలిపింది. తప్పుడు వార్తలను వ్యాప్తి చేసే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని కోల్‌కతా పోలీసులు ట్వీట్ చేశారు.
ఇదిలావుంటే, గవర్నర్ జగదీప్ ధంఖర్ ఈ వీడియోపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై రాష్ట్ర హోం కార్యదర్శి నుండి వివరణ నివేదిక కోరారు. మృతదేహాలను పారవేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. మన సమాజంలో మృతదేహానికి అత్యున్నత గౌరవం లభిస్తుందని.. సంప్రదాయ ఆచారాల ప్రకారం దహన సంస్కారాలు నిర్వహించాలంటూ గవర్నర్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
మరోవైపు వైరల్ గా మారిన వీడియోపై ఎన్‌ఆర్‌ఎస్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ సైబల్ కుమార్ ముఖర్జీ కోల్‌కతా పోలీస్ కమిషనర్ అనుజ్ శర్మకు లేఖ రాశారు. వివిధ పోలీసు స్టేషన్లు అందించిన జాబితా ప్రకారం 14 అన్‌ క్లైమ్ మృతదేహాలను కెఎంసికి అప్పగించామని లేఖలో పేర్కోన్నారు. ఈ మృతదేహాలు ఏవీ కరోనా రోగులవి కావని.. ఈ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో నకిలీదని ఈ విషయంలో కఠినచర్యలు తీసుకోవచ్చని ముఖర్జీ తన లేఖలో కోరారు.
రాష్ట్రంలో కొవిడ్ 19 మరణాల వాస్తవ సంఖ్యను దాచడానికి TMC ప్రభుత్వం ప్రయత్నిస్తున్నందుకు వీడియో క్లిప్ ఒక రుజువని ప్రతిపక్ష సిపిఐ (ఎం), బిజెపిలు నేతలు ఆరోపించారు.
ఇదే అంశంపై స్పందించిన నగర మేయర్ ఫిర్హాద్ హకీమ్ ఈ సంఘటనను పరిశీలిస్తానని, నగరంలో కరోనావైరస్ బాధితుల మృతదేహాలను తూర్పు కోల్‌కతా శివారులోని ధాపా వద్ద ఒక ప్రత్యేక స్థలంలో దహనం చేస్తున్నట్లు తెలిపారు.