Vennela Kishore In Web Series: ప్రస్తుతం అంతా వెబ్ సిరీస్‌ల హవా నడుస్తోంది. మరీ ముఖ్యంగా లాక్‌డౌన్ సమయంలో థియేటర్లు మూతపడడంతో ఓటీటీలు ప్రేక్షకాధరణ పొందాయి. దీంతో బడా నిర్మాతల దృష్టి కూడా ఓటీటీ రంగంపై పడింది. దీంతో వెబ్ సిరీస్‌లను కూడా సినిమాలకు పోటీగా తెరకెక్కిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ‘ఆహా’ ఓటీటీ వేదికగా వేణు ఉడుగుల సమర్పణలో ఓ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ వెబ్ సిరీస్‌లో కమెడియన్ వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో నటించనున్నట్లు సమాచారం. అయితే ఈ వెబ్ సిరీస్‌కు వేణు దర్శకత్వ పర్యవేక్షణ మాత్రమే చేస్తాడని సమాచారం. మరి ఇప్పటి వరకు కమెడియన్‌గా రాణించిన వెన్నెల కిషోర్ లీడ్ రోల్‌లో నటించనున్నాడంటే.. వెబ్ సిరీస్ కూడా అద్యంతం కామెడీతో కూడుకొని ఉంటుందనే చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే భవిష్యత్తు అంతా ఓటీటీల హవా కొనసాగుతుందన్న నేపథ్యంలో ఇలాంటి బడా దర్శకులు, తారలు వెబ్ సిరీస్‌ల పట్ల ఆసక్తి చూపిస్తుండడం.. తెలుగులో సరికొత్త సంప్రదాయానికి నాంది పలుకుతోందని చెప్పాలి. ఇక ఆహా ఓటీటీ వేదికగా ఇప్పటికే పలు చిత్రాలతో పాటు, సమంత వ్యాఖ్యాతగా ‘సామ్‌జామ్’ అనే టాక్ షో ప్రసారమవుతోన్న విషయం తెలిసిందే.