గుజరాత్ లో ఎవరైన భూకబ్జా కు పాల్పడితే 14 ఏళ్ల జైలు శిక్ష విధిస్తారని, తెలంగాణ లో కూడా అలాంటి బిల్లును తీసుకురావాలని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు. జైలు శిక్షలు వేస్తే భూ కబ్జా లకు పాల్పడాలంటే భయపడుతారని అన్నారు. తన చెప్పిన సూచనపై ఆలోచన చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సీఎం కేసీఆర్ ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చి మధ్య తరగతి ప్రజలను ఇబ్బందిపెట్టారని, ఇప్పుడు ధరణి పోర్టల్ తీసుకొచ్చి మళ్లీ పేదవారిని ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం నెల రోజుల్లో గ్యాస్ సిలిండర్ ధర 100 రూపాయలు పెంచడం తగదని అన్నారు. ప్రజల పక్షాన నిలబడుతానన్న బండి సంజయ్ ఇప్పుడు గ్యాస్ ధరల విషయంలో ప్రజలు ఇబ్బందిపడుతున్న విషయాన్ని ప్రధాని మోడీ కి చెప్పు అని సలహా ఇచ్చారు. పేదలను ఇబ్బందులకు గురి చేయవద్దని సూచించారు. ఎన్నికల్లో గెలుపే ముఖ్యంగా ఉన్న భారతీయ జనతా పార్టీకి ప్రజల సమస్యలు పట్టవా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న భూ కబ్జాలపై, కేంద్రం పెంచిన గ్యాస్ ధరలపై పోరాటం చేస్తామని ప్రకటించారు.
చాలా కాలంగా పీసీసీ మార్పుపై కాంగ్రెస్ పార్టీలో చర్చలు జరిగాయి. ఉత్తమ్ రాజీనామా చేయడంతో తాజాగా పీసీసీ నూతన అధ్యక్ష ఎంపిక ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో పీసీసీ అధ్యక్ష ఎన్నికపైనా వీహెచ్ స్పందించారు. పీసీసీ అధ్యక్షుడిగా బీసీ కులాలకు చెందిన వారికి ఒకసారి అవకాశం ఇవ్వాలని పార్టీ పెద్దలను కోరినట్లు తెలిపారు. పీసీసీ అనేది మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తి ఇవ్వాలని కోరినట్లు తెలియజేశారు. కొత్త పీసీసీ అధ్యక్ష ఎన్నికల ఎప్పుడు అనేది హైకమాండ్ చూస్తదని అన్నారు. కాగా, నాగార్జున సాగర్ ఉప ఎన్నిక విషయంలో జానారెడ్డి సలహా తీసుకొనే ముందుకెళ్తాం అని సలహా ఇచ్చారు.